- అందుకే బ్లండ్ శాంపిల్స్ ఇవ్వలేదేమో
- హైదరాబాద్‌ను డ్రగ్ సిటీగా మార్చేందుకు యత్నం
- డ్రగ్ టెస్ట్ శాంపిల్స్ ఇచ్చిన బల్మూరి, ఎంపీ అనిల్
హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 30 (విజయక్రాంతి): బహుశా కేటీఆర్ ఈ మధ్య డ్రగ్స్ తీసుకున్నట్లు ఉన్నారేమో.. అందుకే డ్రగ్స్ నిజనిర్ధారణ శాంపిల్స్ ఇవ్వడానికి రాలేదని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ విమర్శించారు. బీఆర్‌ఎస్ నాయకులంతా తమ మిత్రులతో కలిసి హైదరాబాద్‌ను డ్రగ్స్ సిటీగా మార్చేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
జన్వాడా ఫామ్‌హౌస్ పార్టీలో డ్రగ్స్ వినియోగించినట్టుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతలు డ్రగ్స్ టెస్టులపై సవాళ్లు విసురుకున్న సంగతి తెల్సిందే. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ బుధవారం హైదర్‌గూడలోని అపోలో ఆసుపత్రిలో డ్రగ్స్ నిజ నిర్ధారణ కోసం యూరిన్, డీఓఏ 6 డ్రగ్ ప్యానల్ శాంపిల్స్ ఇచ్చారు.
అనంతరం వారు మాట్లాడుతూ గతంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా కేటీఆర్ డ్రగ్స్ తీసుకుంటారనే ఆరోపణలు వచ్చినా ఏనాడు టెస్టులు చేయించుకోలేదన్నారు. ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా విమర్శలు చేస్తున్న కేటీఆర్ టెస్ట్‌లకు శాంపిల్స్ ఇస్తే డ్రగ్స్ ఎవరు తీసుకున్నారో తెలిసిపోతుందని అన్నారు.
ఈ మధ్య కాలంలో కేటీఆర్, కౌశిక్ రెడ్డిలు డ్రగ్స్ తీసుకున్నారేమో.. అందుకే టెస్టులకు శాంపిల్స్ ఇవ్వడానికి రాలేదని ఎద్దేవా చేశారు. ఆరోపణలు, విమర్శలు చేయడం కాకుండా, వచ్చి టెస్టులు చేయించుకోవాలని సవాల్ విసిరారు. సీఎం రేవంత్ రెడ్డి నో డ్రగ్స్ అనే నినాదంతో మాదక ద్రవ్యాల నివార ణకు చర్యలు చేపడుతున్నారని తెలిపారు.
కౌశిక్‌రెడ్డి ఆంబోతులాగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడవద్దని, దమ్ముంటే ముందుకు వచ్చి టెస్టులు చేయించుకోవాని, లేదంటే నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని సూచించారు. మంగళవారం ఏఐజీ ఆసుపత్రికి వస్తానన్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఎందుకు రాలేదని వారు నిలదీశారు.
రేవంత్ గాలిగోటికి కౌశిక్‌రెడ్డి సరిపోడు
సీఎం రేవంత్‌రెడ్డి గాలి గోటికి కూడా ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి సరిపోడని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ విమర్శించారు. కేటీఆర్ మిత్రులు డ్రగ్స్ తీసుకుంటున్నారని, అందుకే కేటీఆర్ మీద కూడా అనుమానం ఉందని, నివృత్తి చేసుకోవాలని సూచించారు. బుధవారం గాంధీభవన్‌లో మీడి యాతో మాట్లాడుతూ..
విజయ్ మద్దూరి తనకు దగ్గరని కేటీఆర్ చెప్పారని, విజయ్ కొకైన్ తీసుకున్నట్టు నిర్ధారణ అయిందన్నారు. తాము అపోలో ఆసుపత్రికి వెళ్లి డ్రగ్స్ శాంపిల్స్ ఇచ్చామన్నారు. ప్రజా సమస్యలపై తాను పోరాటం చేసినందుకు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం 85 కేసులు పెట్టిందన్నారు. పాడి కౌశిక్‌రెడ్డి నోరు అదుపులో పెట్టుకోకుంటే బయట తిరిగే పరిస్థితి ఉండదని హెచ్చరించారు.