calender_icon.png 1 April, 2025 | 11:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విశ్వావసు నామ సంవత్సరం వెలుగులు నింపాలి

31-03-2025 01:14:22 AM

ఉగాది వేడుకల్లో సీఎం రేవంత్‌రెడ్డి

రవీంద్రభారతిలో ఎండోమెంట్‌శాఖ ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం 

హాజరైన డిప్యూటీ సీఎం భట్టి, పలువురు మంత్రులు

హైదరాబాద్, మార్చి 30 (విజయక్రాంతి): విశ్వావసు నామ సంవత్సరం ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆకాంక్షించారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఆదివారం రాష్ట్ర భాష, సాంస్కృతిక శాఖ, దేవాదాయ ధర్మాదాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఉగాది సందర్భంగా నిర్వహించిన పంచాంగ శ్రవణ కార్యక్రమంలో మాట్లాడారు.

తెలంగాణ రైజింగ్ నినాదాన్ని సార్థకం చేస్తూ.. నవ వసంతంలో తెలంగాణ ఒక వెలుగు వెలగాలని ఆకాంక్షించారు. అద్భుతమైన భవిష్యత్తు కోసం తమ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీకి శ్రీకారం చుట్టినట్లు వెల్లడించారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెండుగా రావాలని ఆకాంక్షించారు.

హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి నరగంగా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రణాళికలు అమలు చేస్తున్నదన్నారు. పేదల ఆకలి తీర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం దశాబ్దాల క్రితమే ఆహార భద్రత యాక్ట్ తీసుకొచ్చిందని కొనియాడారు.

ఇప్పుడు తమ ప్రభుత్వం పేదలకు సన్నబియ్యం ఇస్తున్నదన్నారు. తెలంగాణ వరి సాగులో దేశంలోనే అగ్రస్థానంలో ఉందన్నారు. యావత్ దేశానికి రాష్ట్రం అన్నం పెడుతున్నదని కొనియాడారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ భేషుగ్గా ఉందని, తామిద్దరం కలిసి జోడెడ్లలా పనిచేస్తున్నామని వెల్లడించారు.

డిప్యూటీ సీఎం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఉగాది ప్రసాదంలా ఉందని అభివర్ణించారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు అడ్లూరి లక్ష్మణ్, శంకరయ్య, మల్‌రెడ్డి రంగారెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, పలువురు ఉన్నతాధికారులు పాల్లొన్నారు.

రాములోరి కల్యాణానికి సీఎంకు ఆహ్వానం..

భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయ సన్నిధిలో ఏప్రిల్ 6న జరుగనున్న శ్రీరామనవమి వేడుకలకు విచ్చేయాలని ఆలయ ఈవో, అర్చకులు ఆదివారం సీఎం రేవంత్‌రెడ్డిని ఆహ్వానించారు. ఈ మేరకు తిరుకల్యాణ మహోత్సవ ఆహ్వాన రాజపత్రం అందజేశారు. పంచాగ శ్రవణం ముగిసిన తర్వాత సీఎం రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.