03-03-2025 02:01:26 AM
రూ.కోటితో దేవాలయ అభివృద్ధికి భూమి పూజ
వనపర్తిలో ముఖ్యమంత్రికి ఘన స్వాగతం
వనపర్తి టౌన్, మార్చి 2 : శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కృపతో రాష్ర్ట ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని భగవంతుని ప్రార్థించినట్లు రాష్ర్ట ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తెలిపారు.
ఆదివారం వనపర్తి జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి జిల్లా కేంద్రం లోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి విచ్చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి తో పాటు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, ఎక్సుజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి, నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు మేఘారెడ్డి, మధుసూదన్ రెడ్డి, వాకిటి శ్రీహరి దేవాలయానికి రాగా మంగళ వాయిద్యాలతో వారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అంతకుముందు రూ. 1కోటి నిధులతో దేవాలయ అభివృద్ధికి ముఖ్యమంత్రి భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం దేవాలయంలో ముఖ్యమంత్రి కి ఆలయ అర్చకులు గోత్రనామాలతో అర్చనలు నిర్వహించి స్వామివారి శేష వస్త్రంతో పాటు స్వామి వారి చిత్రపటాన్ని అందజేసి ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలను ఘనంగా సన్మానించి వేద ఆశీర్వచనం చేశారు.
ఈ సందర్భంగా దేవాలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ముఖ్యమంత్రి తెలిపారు. రూ.1 కోటితో అభివృద్ధి పనులు చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగు చర్యలు తీసుకుంటామని ఇంకా అవసరం ఉంటే తన దృష్టికి తీసుకురావాలని ముఖ్యమంత్రి అధికారులకు తెలి పారు. ఈ కార్యక్రమంలో ఒబేదుల్లా కొత్వా ల్, సాయి చరణ్ రెడ్డి, శివసేనారెడ్డి, డిసిసిబి చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి నియోజకవర్గ నాయకులు తదితరులు పాల్గొన్నారు.