వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల
హైదరాబాద్, జనవరి 31 (విజయక్రాంతి): రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా, నాణ్యమైన ఉత్పత్తులకు గరిష్ఠ మద్దతు ధర అందేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. మార్కెటింగ్ అంశాలపై వరుసగా మీడియాలో ప్రసారమవుతున్న కథనాలపై శుక్రవారం మంత్రి స్పందించారు.
అధికారులను ఆరా తీసి హైదరాబాద్‌లో సమీక్ష నిర్వహించారు. పలు అంశాలపై మంత్రి వారికి సలహాలు సూచనలిచ్చారు. మార్కెటింగ్‌శాఖ ఉన్నతాధికారులు ప్రత్యేక బృందాలు నియమించి, ఆ బృందాలను రాష్ట్ర నలుమూలలకు పంపించాలని సూచించారు. పంట ఉత్పత్తుల నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా, గరిష్ఠ మద్దతు ధర ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
రైతులు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 21 కంది కొనుగోలు కేంద్రాలు, 14 పెసర కేంద్రాలు, 42 సోయాబిన్ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పంట నిల్వలకు మార్క్‌ఫెడ్ గోదాములను వినియోగించుకోవాలని సూచించారు. అర్హులైన రైతులందరికీ రైతుభరోసా అందుతుందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. రైతులు వ్యవసాయ యాంత్రీకరణ పథకాలను వినియో గించుకోవాలని, సాగులో ఆధునిక మెళకువలు పాటించాలని సూచించారు.