మౌనం మౌనం మౌనం అలాగే కొనసాగితే
కొంత కాలానికి మంచుగడ్డ
కరిగితే మాట ముచ్చట, సంతోషం, దుఃఖం
కరగడం మరిస్తే కఠిన శిల
కడుపుల సలసల మరుగుతూ ఉంటే
బద్దలైతది ఏదో ఒకనాడు అగ్నిపర్వతంలా
అంతవరకు కనిపిస్తుంది మౌనశిలగానే
ఎంత బానిసత్వంలో ఉన్నా
జీవమున్నదంటే, విసుగు పరాకాష్టకు చేరితే
చలనం అవుతది సుడిగాలి
మెత్తని మౌనశిలలు ఉలి తాకిడికి
లొంగుతాయి శిల్పి చాతుర్యానికి
మొండి బండరాళ్లను లొంగదీస్తే
రోళ్లుగా, ఇసుర్రాళ్ళుగా, బడి గుడి మెట్లుగా
వాకిట్లో, పెరట్లో, పార్కులో నడక బండలుగా
ఉపయోగపడతాయి, ఉద్ధరిస్తాయి
మనుషుల మాటే ప్రశ్నార్థకం, ప్రశ్నార్థకం
విగ్రహాలన్నీ మౌనశిలలే
అత్యంత మానవత్వాన్ని, దైవత్వాన్ని
సంతరించుకున్న విశ్వాసాలు
అవి కదిలి రాకపోవచ్చు
కదిలిస్తాయి ఆలోచనా ధోరణులను
వెలిగిస్తాయి మానవత్వం దీపాలను
కారుణ్యం కరుగుతుంది వెన్నలా
నమ్మకం గుడ్డిగా మూఢత్వంగా మారితే
మతాల అడవిలో రగులుతుంది చిచ్చు
తటస్థంగా ఉన్న వారిని కూడా
లాగుతాయి ఎటోవైపు యుద్ధరంగంలోకి
తప్పు మౌనశిలలది కాదు
మూర్ఖత్వం పరాకాష్టకు చేరడమే
మౌనశిలల మధ్య సందు దొరికితే
మొలకెత్తవచ్చు రావి, మర్రి విత్తనాలు
పచ్చదనం రుచి తెలిస్తే
విస్తరిస్తాయి, నీడనిస్తాయి
నిజమే పలక లేని మౌనశిలలు కూడా
పాఠాలుగా నిలుస్తాయి గ్రహిస్తే..!