మహబూబ్ నగర్ (విజయక్రాంతి): భారతరత్న, స్వాతంత్య్ర సమర యోధులు, భారత దేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ విద్యారంగానికి చేసిన సేవలు మరువలేనివని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకొని సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి జిల్లా కలెక్టర్ పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని ప్రభుత్వము ప్రతి సంవత్సరం నవంబర్ 11న మైనార్టీ సంక్షేమ దినోత్సవంగా నిర్వహిస్తుందన్నారు. దేశంలో విద్యా వ్యవస్థ పటిష్ఠతకు ఆయన ఎంతో కృషి చేశారని ఆమె పేర్కోన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, రెవెన్యూ అదనపు కలెక్టర్ మోహన్ రావు, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి శంకరా చారి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.