08-04-2025 01:03:45 AM
మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీవాణి
నల్లగొండ, ఏప్రిల్ 7 (విజయక్రాంతి) : మాతాశిశు మరణాలను అరికట్టేందుకు వైద్య ఆరోగ్యశాఖ, ఐసీడీఎస్ అధికారులు సమష్టిగా పనిచేయాలని నల్లగొండ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీవాణి, వైస్ ప్రిన్సిపాల్ రామచంద్ర అన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా సోమవారం మధురానగర్ కాలనీ అంగన్వాడీ కేంద్రంలో ‘ఆరోగ్యకరమైన ప్రారంభాలు- ఆశాజనక భవిష్యత్ ‘ అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ శ్రీవాణి మాట్లాడుతూ.. పౌష్టికాహారం లోపం కారణంగా యేటా 3 లక్షల మంది గర్భిణులు, బాలింతలు ప్రాణాలు కోల్పోతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక స్పష్టం చేస్తున్నదని తెలిపారు. 2 మిలియన్లకుపైగా నవజాత శిశువులు, అంతేసంఖ్యలో గర్భస్థ శిశువులు చనిపోతున్నారని విచారం వ్యక్తం చేశారు.
ఈ పరిస్థితిని నివారించేందుకు గర్భిణులు పౌష్టికాహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం, వ్యక్తి పరిశుభ్రత పాటించడం, ప్రసవం వరకు క్రమం తప్పకుండా వైద్యులను సంప్రదించాలని సూచించారు. వైస్ ప్రిన్సిపాల్ రామచంద్ర మాట్లాడుతూ.. ప్రభుత్వం అంగన్ వాడీ కేంద్రాల ద్వారా సరఫరా చేస్తున్న పౌష్టికాహారాన్ని గర్భిణులు, బాలింతలు, చిన్నారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ భాగ్యరేఖ, ట్యూటర్లు డాక్టర్ శ్వేత, మధులత, హెల్త్ ఎడ్యుకేటర్లు స్వామి, నాగలక్ష్మి, జ్యోతి, ఆఫీస్ సిబ్బంది, ఆశావర్కర్లు, అంగన్ వాడీ సిబ్బంది పాల్గొన్నారు.