calender_icon.png 30 September, 2024 | 3:51 AM

సాహిత్యంలో వస్తు దారిద్య్రం పోవాలి

30-09-2024 01:47:50 AM

కవులు ప్రతిపక్ష పాత్ర పోషించాలి

సీనియర్ సంపాదకుడు కే శ్రీనివాస్

సిద్దిపేట, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): ప్రస్తుత సాహిత్యంలో వ్యక్తీకరణ, సృజనాత్మకత బాగున్నప్పటికీ వస్తు దారిద్య్రం ఉందని సీనియర్ సంపాదకుడు కే శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని విపంచి కళానిలయం (గద్దర్ ప్రాంగణం, జాన్‌వేస్లీ హాల్, దేవీప్రియ వేదిక)లో ఆదివారం నిర్వహించిన మంజీరా రచయితల సంఘం (మ.ర.సం) 38వ మహాసభలో ఆయన మాట్లాడారు.

దేనికి భయపడని పాలకులు అన్నిరకాల ప్రజా చైతన్యాన్ని హరిస్తారని హెచ్చరించారు. ఇలాంటి సందర్భం లో కవులు ప్రతిపక్ష పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఆత్మ మంజీరా, మూసీ వంటి ఉప నదుల్లో ఉందన్నారు. మ.ర.సం ఒకప్పుడు ఉప నదిగా ప్రారంభమై, ఇప్పుడు మహానదిగా పురోగమిస్తుం దని కొనియాడారు. సంఘం తెలంగాణ ఉద్యమ కాంక్షను రగల్చడంలో ముఖ్యపాత్ర పోషించిందన్నారు.

తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగేశ్వర శంకరం మాట్లాడుతూ.. ప్రస్తుత తరానికి భాషపై పట్టు లేకుండా పోయిందన్నారు. మాజీ ఎమ్మెల్యే రసమయి బాల కిషన్ మాట్లాడుతూ.. తెలంగాణ ధూందాంలో తాను మ.ర.సం సభ్యుడిగా ఉండడం ఎంతో గర్వకారణమన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన సంఘం ఇప్పుడు మరో ఉద్యమానికి తెరతీయాల్సిన అవసరం ఉందన్నారు.

టీఎన్జీవో రాష్ట్ర మాజీ అధ్యక్షుడు దేవిప్రసాద్ మాట్లాడుతూ.. భావితర లకు మరసం దిక్సూచిగా నిలిచిందని కొనియాడారు. మలిదశ ఉద్యమానికి ముందే ప్రత్యేక రాష్ట్రం అవసరమని  సంఘం ఎలుగెత్తి చాటిందన్నారు. టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు విరహత్ అలీ మాట్లాడుతూ.. సమాజంలోని అన్ని రుగ్మతలపై మ.ర.సం పోరాటం చేసిందని కొనియాడారు.

మొద ట్లో అర డజన్ మంది కవులు ఉండగా, సంఘం నేడు వందలా మంది కవులను తయరు చేసిందన్నారు.  ప్రొఫెసర్ కాశీం మాట్లాడుతూ.. ఎవరి చూపులు ప్రసరించని చోటికి సైతం కవి, రచయిత కళ్లు వెళ్తాయని అభివర్ణించారు. మ.రసం ఏర్పడినప్ప నాటి నుంచి అనేక ఉద్యమాల్లో భాగస్వామి అయిందన్నారు.

మ.ర.సం వ్యవస్థాపకుడు నందిని సిధారెడ్డి మాట్లాడుతూ.. మ.ర.సం చరిత్రలో గుర్తుండిపోయే ఉద్యోమాలు చేసిందన్నారు. 1948లో తెలంగాణకు స్వాతంత్య్రం రాలేదని ఆరుద్ర అనేక రచనలు చేశారన్నారు. తెలంగాణలో బుర్ర కథను నిషేధిస్తే ఆంధ్రాలో హరికథ ప్రారంభించారన్నారు.

ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. మ.ర.సం ప్రారంభించి అప్పుడే 38 ఏళ్లు గడిచిందంటే నమ్మలేకపోతున్నామన్నారు. అనంతరం అతిథులు కవి సిద్దెంకి యాదగిరి రచించిన ‘మూడు గుడిసెల పల్లె పుస్తకాన్ని ఆవిష్కరించారు.