పాలకుర్తి రామమూర్తి :
ప్రస్తావసదృశం వాక్యం,
ప్రభావసదృశం ప్రియమ్
ఆత్మశక్తి సమం కోపం,
యో జానాతి స పండితః
చాణక్య నీతి (14--15)
“సందర్భానుసారంగా మాట్లాడ డం, ప్రభావవంతంగా, ప్రియంగా మాట్లాడడం, తన పరిధిలో ఎంతవరకు ఎవరిపై కోపం చూపాలో తెలిసిన వాడు పండితుడు” అని అంటాడు చాణక్యుడు. ‘ఆ తెలుసుకునేదే జ్ఞానం’ అన్నది తన అభిప్రాయం. పండితుడైన వానికి సభలు, సమావేషాలలో ఏం చెప్పాలో, ఎంత వరకు చెప్పాలో, ఎవరితో ఎలా వ్యవహరించాలో, ఎక్కడ కోపం నటించాలో తెలియాలి. ఒక శాస్త్రజ్ఞుల సమావేశానికి వెళ్ళి సామాన్య విషయాలు ప్రస్తావించినా, సామాన్యు ల సమావేశంలో వేదాంతాన్ని సం స్కృతంలో ఉపన్యసించినా వక్తకు సముచి త గౌరవం దక్కదు. నిజానికి వ్యక్తులమధ్య సంబంధాలను పటిష్ఠ పరిచేది, ప్రభావవంతమైన భావ వ్యక్తీకరణే. అవతలి వ్యక్తికి వారి మాతృభాషలో చెపితే మనం చెప్పేది చక్కగా అర్థమవుతుంది. మాతృభాష అనేది తల్లి వంటిది. అది అమృతం లాగా ఎదుటి వ్యక్తి హృదయాన్ని చేరుతుంది.
‘విషయం మనకెంత తెలుసు?’ అన్నది కాదు ముఖ్యం. దానిని ఎంత సమర్థవంతంగా ఎదుటివారితో పం చుకోగలమన్న దానిపైనే వ్యక్తి విజ యం ఆధారపడి ఉంటుంది. మన భా వాన్ని ఎదుటివారికి ప్రభావవంతంగా తెలియజేయడం వల్ల జీవితానికి కొత్త మార్గం కనిపిస్తుంది. తగు విధంగా భావాన్ని పంచుకోవడం ద్వారా అంతర్గత ఆలోచనా సరళి వికసిస్తుంది. మన వైఖరి పరివ్యాప్తమవుతుంది. ఈ మేర కు నమ్మకాలు కూడా లోతుగా పాతుకుపోతాయి. ధృక్కోణంలో స్పష్టత వస్తుంది. ఆశలు పరిమళిస్తాయి. నిరా శా నిస్పృహలు చెదరి పోతాయి. దెబ్బ తిన్న హృదయ స్పందనలు సాధారణమవుతాయి. ఎదుటివారితో సంబంధ బాంధవ్యాలు మెరుగు పడతాయి. ఆశ ఉన్నంత వరకు జీవితం ఉంటుంది. జీవితం ఉన్నంత వరకు ఆశ ను బతికించుకోవాలి. దానికి చుట్టూ ఉన్నవారితో ప్రభావవంతమైన సంబంధాలను పెంచుకోవాలి.
‘అనవసరమైన మాటలు ఎందుకు మాట్లాడకూడదు?’ అంటే, ఉదాహరణకు: ఒక మత పెద్ద ఒక పెద్ద పట్టణా నికి వచ్చాడు. ఆయన విమానం దిగగానే విలేఖరుల సమావేశం జరిగింది. ఒక విలేఖరి త్వరగా అతని దగ్గరికి వెళ్ళి, “ఇక్కడి వ్యభిచారిణుల గురించి మీరేం చెపుతారు?” అని ప్రశ్నించాడు. దానికి ఆయన, “మీ ఊర్లో వ్యభిచారిణులు ఉన్నారా?” అని ఎదురు ప్రశ్నించాడు. అయితే, తెల్లవారి అన్ని పేపర్లలో ప్రచురితమైన ప్రముఖ వార్త.. ‘ఫలానా మత పెద్ద విమానం దిగగానే అడిగిన మొద టి ప్రశ్న “మీ ఊర్లో వ్యభిచారిణులున్నారా?” అని ప్రచురితమైంది. అందు కే, ఆలోచించి ఆచితూచి మాట్లాడవలసి ఉంటుంది.
భావ వ్యక్తీకరణ ఒక కళ
సరైన పద్ధతిలో, సరైన పదాలను ఎన్నుకొని మాట్లాడడం నేర్చుకోవాలి. ఆలోచనలు చేయడం ఎలాగో, ఎక్కడ ఆ ఆలోచనలు ఉద్భవిస్తాయో గమనించి అక్కడ ఏవి ఉపయుక్తమైనవో, ఏవి కావో గ్రహించి వాటిని సమర్థవంతంగా ఉపయోగించడం అభ్యసిం చాలి. ఈ కళ చాలామందిలో సహజంగానే వస్తుంది. లేకపోతే, అభ్యాసంతో నేర్చుకోవాలి. పిల్లలకు చిన్నతనంలోనే శిక్షణ ఇవ్వాలి. అయితే, పిల్లలు చెపితే నేర్చుకోరు. తలిదండ్రులు, ఉపాధ్యాయులు, తోటివారిని చూసి నేర్చుకుం టారు. ఆ వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులది. భావ వ్యక్తీకరణ సజావుగా సాగేందుకు పరస్పరం వాటిని పంచుకోవడమే ఉత్తమ మైన విధానం.
మన మెదడు నాలుగు విభాగాలు గా పనిచేస్తుంది. హేతుబద్ధంగా ఆలోచిస్తే, మెదడులోని హేతుబద్ధమైన పార్శ్వం జాగృతమవుతుంది. ప్రణాళికలు రచించే సమయంలో సం బంధి త భాగం క్రియాశీలకం అవుతుంది. సహజ స్వీకృతి ఆధారంగా స్పందిస్తే, సహజజ్ఞానం ఉత్తేజితమవుతుంది. భావోద్వేగాలకు అనుబంధంగా స్పం దించడం మెదడు నాలుగవ పార్శ్వం చేసే పని. ఇతరులతో సత్సంబంధాలు నెలకొల్పుకోగలిగిన వ్యక్తి తన మెదడు చేసే పనులను సమర్థవంతంగా ఉపయోగించుకుంటాడు.
అవసరమైన చోట కోపాన్ని నటించకపోతే మనం తేలిక కావడమూ జరుగుతుంది. ముఖ్యంగా ఉన్నత స్థా నాలలో ఉన్న వ్యక్తులు కోపాన్ని ప్రదర్శించే సమయంలో జాగ్రత్తగా వ్యవ హరించాలి. అలాగని కోపాన్ని మనసులో ఉంచుకోకూడదు. దానివల్ల అది క్రోధంగా పరిణామం చెంది మన ఆరోగ్యమే పాడవుతుంది. తోటివారితో సంబంధాలూ చెడిపోతాయి. విషయ పరిజ్ఞానం అనుభవ జ్ఞానంతో జత కడితే అది విజ్ఞానంగా పరిణతి చెందుతుంది. అలా, విజ్ఞానాన్ని పొం దిన వ్యక్తి భావ వ్యక్తీకరణ ప్రభావవంతంగా ఎదుటివ్యక్తిని చేరుతుంది. చక్క ని విజయాన్ని అందిస్తుంది. సమాచారాన్ని పంపడం, సమాచారాన్ని గ్ర హించడం సమర్థవంతంగా జరిగితేనే ఎవరైనా విజయసాధకులవుతా రు. “అలా ప్రవర్తించిన వాడే పండితుడు” అంటాడు చాణక్యుడు.