28-02-2025 10:19:28 AM
జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.
భద్రాద్రికొత్తగూడెం, (విజయక్రాంతి): జిల్లాలో పాల్వంచ మున్సిపల్ పరిధిలో డ్రోన్‌తో సర్వే చేసి మాస్టర్ ప్లాన్ రూపకల్పన చేస్తునట్లు కలెక్టర్ జితేష్ వి. పాటిల్ పేర్కొన్నారు. ఐడిఓసి కార్యాలయ ఆవరణలో అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన, మున్సిపల్ అధికారులు, సర్వే ఆఫ్ ఇండియా అధికారులు, డీటీసీపీ అధికారుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డ్రోన్‌కు పూజ చేసి సర్వేను కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా అభివృద్ధిలో భాగంగా మున్సిపాలిటీకి సమస్యలు లేని మాస్టర్ ప్లాన్ తయారవుతున్నదని, భవిష్యత్ తరాలకు అన్ని డిజిటలైజ్ చేయడమే లక్ష్యమన్నారు.
లేటెస్ట్ టెక్నాలజీ, డ్రోన్ కెమెరాల సాయంతో పాల్వంచ మున్సిపాలిటీ మాస్టర్ ప్లాన్ డిజిటల్ సర్వే పకడ్బందీగా నమోదు చేయడం జరుగుతున్నదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అమృత్ 2.0 స్కీమ్ కింద రాష్ట్రంలో 50వేల నుంచి లక్ష జనాభా కలిగిన 20 మున్సిపాలిటీలను మాస్టర్ ప్లాన్ డిజిటల్ సర్వే చేయడం కోసం పాల్వంచ మున్సిపాలిటీ సెలెక్ట్ చేసినట్లు తెలిపారు. జిల్లాలో మొట్టమొదటిసారిగా పాల్వంచ మున్సిపాలిటీలో మాస్టర్ ప్లాన్ డిజిటల్ సర్వే కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. ఈ మాస్టర్ ప్లాన్ సర్వే సాయంతో పాల్వంచ పట్టణం అభివృద్ధి చెందుతుందని, చాల ఏండ్ల కింద రూపొందించిన ప్రణాళికలను ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా మార్చేందుకు ఈ డిజిటల్ సర్వే ఉపయోగపడుతుందన్నారు.
ఈ సర్వేలో ఉపగ్రహాలు , డ్రోన్ల సాయంతో మున్సిపాలిటీల పరిధిలోని ప్రాంతాల వారీగా ఉపరితలం ఎత్తు, పరిస్థితులు, రోడ్లు, ఇండ్లు, డ్రైనేజీ, తాగునీటి పైపులైన్లు, సెల్ టవర్స్, టాయిలెట్స్, రిజర్వాయర్లు, మార్కెట్లు, వైకుంఠధామాలు ఇలా ప్రతిదీ చిత్రాలతో విభాగాల వారీగా సేకరించి బేస్ మ్యాప్‌లను తయారు చేస్తారన్నారు. ఈ మాస్టర్ ప్లాన్ ఆధారం చేసుకుని రాబోయే భవిష్యత్ అవసరాలకు తగ్గట్టు అధికార యంత్రాంగం కొత్త మాస్టర్ ప్లాన్‌ను రూపొందించే పనిలో నిమగ్నమైందన్నారు. పట్టణాల అభివృద్ధి, పరిష్కారంలో ఈ బేస్ మ్యాప్‌లే కీలకం కానున్నాయని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఓ నెల్లూరి సత్యనారాయణ , పాల్వంచ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్, మున్సిపల్ సిబ్బంది, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.