గతంకంటే ఎక్కువ దాదాపు 3-4 శాతం అధికం
రెండు చోట్ల ప్రధాన పార్టీల మధ్య టఫ్ ఫైట్
గెలుపుపై ఎవరి ధీమా వారిదే
కరీంనగర్, మే 13 (విజయక్రాంతి): గత పార్లమెంట్ ఎన్నికలతో పోల్చుకుంటే ఈసారి కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో పోలింగ్ శాతం పెరిగింది. గత ఎన్నికల్లో 69.5 శాతం పోలింగ్ నమోదు కాగా ఈ సారి సాయంత్రం 5 గంటల వరకే 67.67 శాతం నమోదైందని అధికారులు తెలిపారు. వేసవికాలం కావడంతో పోలింగ్‌ను 6 గంటల వరకు కొనసాగించారు. ఆరు గంటల వరకు క్యూలో ఉన్నవారిని ఓటు హక్కును వినియోగించుకునేందుకు పలు పోలింగ్ కేంద్రాల్లో రాత్రి 8 దాటినప్పటికీ అనుమతించారు. అధికారుల సమాచారం మేరకు సాయంత్రం 6 గంటల వరకు 72 శాతం పోలింగ్ నమోదవుతుందని అంచనా.
కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండగా కరీంనగర్, చొప్పదండిలో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ లీడ్‌లో అవకాశం ఉండే అవకాశం కనిపిస్తోంది. హుస్నాబాద్, మానకొండూర్‌లో కాగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుకు అనుకూలంగా కనిపించింది. బీఆర్‌ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్‌కు హుజూరాబాద్, సిరిసిల్లలో మెరుగైన వాతావరణం కనిపించింది. వేములవాడలో కాంగ్రెస్, బీజేపీలలో ఎవరికి మెజార్టీ ఉంటుందో చెప్పలేని పరిస్థితి ఉంది. మొత్తం ఏడు సెగ్మెంట్లను పరిశీలిస్తే మాత్రం బీజేపీ, కాంగ్రెస్ మధ్యనే ప్రధాన పోటీ ఉన్నట్లు స్పష్టమయింది.
ఎక్కువగా మైనార్టీ ఓట్లు ఉండే కరీంనగర్ సెగ్మెంట్‌లో చివరి క్షణాల్లో కాంగ్రెస్‌వైపు మొగ్గు చూపిసట్లు తెలుస్తుంది. మొత్తంగా పరిశీలిస్తే ప్రతి ప్రాంతంలో మోదీ మేనియా కనిపించింది. ప్రతి ఎన్నికల్లో కరీంనగర్, చొప్పదండిలలో లభించే మెజార్టీ ఓట్లే అభ్యర్థుల గెలుపు ఓటములు నిర్ణయిస్తాయి. ఈసారి కూడా అదే జరుగుతుందా, సైలెంట్ ఓటింగ్ ప్రభావం ఎవరి గెలుపును నిర్ణయిస్తుందో చూడాలి. పోలింగ్ కేంద్రాల్లో పర్యటించిన ప్రధాన పార్టీల ముగ్గురు అభ్యర్థులు మాత్రం గెలుపుపై లెక్కలేస్తూ ఎవరికి వారు ధీమా వ్యక్తం చేశారు.
ప్రశాంతంగా పోలింగ్...
పార్లమెంట్ పరిధిలో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా సాగింది. పోలింగ్ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి పమేలా సత్పతి ప్రత్యేకంగా పర్యవేక్షించారు. కరీంనగర్‌లోని పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి అధికారులకు సూచనలు చేశారు. తన చాంబర్‌లో వెబ్‌కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించారు. తన దృష్టికి వచ్చిన అంశాలపై అధికారులను అప్రమత్తం చేశారు. ఐదు చోట్ల కొద్దిసేపు ఈవీఎంలు మొరాయించిన సంఘటనలు తప్ప పోలింగ్ ప్రక్రియ సాఫీగా సాగింది. పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతీ కరీంనగర్, హుజూరాబాద్‌తోపాటు పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి పర్యవేక్షించారు.
ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద దివ్యాంగుల కోసం వీల్ చైర్లను, ఆటోలను అందుబాటులో ఉంచి పోలింగ్ కేంద్రాలకు తరలించారు. హుస్నాబాద్‌లోని పోలింగ్ కేంద్రాలను మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. రోడ్డు పక్కన ఓ హోటల్‌లో చాయ్ తాగుతూ కాంగ్రెస్ నేత బొమ్మ శ్రీరాం చక్రవర్తితోపాటు స్థానిక నేతలతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ పోలింగ్ సరళిపై చర్చించారు. అనంతరం హుస్నాబాద్ నుంచి చిగురుమామిడి వరకు బస్సులో ప్రయాణించిన మంత్రి ప్రయాణికులతో మాట్లాడుతూ ఓటు హక్కును ప్రతిఒక్కరూ వినియోగించుకోవాలని సూచించారు.
ఎన్నికలు ముగిశాక వినోద్‌కుమార్, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, నగర మేయర్ యాదగిరి సునీల్‌రావు, నగర అధ్యక్షులు చల్ల హరిశంకర్ కరీంనగ్ టవర్‌సర్కిల్ చాట్ బండార్ వద్ద నాయకులతో లిసి పానీపూరి తిని, చాయ్ తాగి సరాదాగా గడిపారు. మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌రావుపై కేసు నమోదైంది. కాంగ్రెస్ అభ్యర్థి క్రమసంఖ్య 4వ నంబర్ కలిగిన టీషర్టును ధరించి కాంగ్రెస్‌కు ఓటేయాలంటూ పోలింగ్ కేంద్రాల వద్ద ప్రచారం చేస్తున్నారంటూ ఎన్నికల సంఘానికి బీజేపీ కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్‌రావు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన ఎన్నికల సంఘం అధికారులు రాజేందర్‌రావుపై కేసు నమోదు చేశారు.