calender_icon.png 23 March, 2025 | 10:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పుట్టగొడుగుల్లా ఫంక్షన్ హాల్స్

22-03-2025 01:15:22 AM

 శంషాబాద్‌లో అనుమతులు తూచ్

 నిబంధనలకు విరుద్ధంగా భారీగా ఏర్పాటు  

 భద్రత, ఫైర్ సేఫ్టీ దైవాధీనం 

 ఆయా ప్రభుత్వ శాఖలకు దండిగా మామూళ్లు 

 ఏమాత్రం పట్టించుకోని అధికారులు  

 తాజాగా తొండుపల్లిలో నిర్మాణంలో ఉన్న భారీ కన్వెన్షన్ హాలులో అగ్నిప్రమాదం  

 రాజేంద్రనగర్, మార్చి 21 (విజయ క్రాంతి): ఇబ్బడిముబ్బడిగా ఫంక్షన్ హాల్స్.. కన్వెన్షన్ హాల్స్.. వాటికి అనుమతులు లేవు. ఫైర్ సేఫ్టీ, భద్రత ప్రమాణాలు కూడా అంతంతే. ఏమైనా ప్రమాదాలు జరిగితే జనం భద్రత దైవాధీనం. ఇదీ ప్రస్తుతం శంషాబాద్ లోని పరిస్థితి. అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుతో ఈ ప్రాంతం లో శరవేగంగా నివాస ప్రాంతాలు విస్తరిస్తున్నాయి. అయితే, శంషాబాద్ మున్సిపాలిటీ తో పాటు మండల పరిధిలోని ఆయా గ్రామాలు మొత్తం 111 జీవోలో పరిధిలో ఉన్నాయి. ఇక్కడ ఫంక్షన్ హాల్స్, కన్వెన్షన్ హాల్స్ ఇతర భారీ నిర్మాణాలు ఏమాత్రం చేపట్టొద్దు అని నిబంధనలు స్పష్టంగా సూచిస్తున్నాయి. అయితే అయా శాఖల అధికారులు నిబంధనలకు పాతర వేశారు. కళ్ళముందే అడ్డగోలుగా ఫంక్షన్ హాల్స్, కన్వెన్షన్ హాల్స్ కట్టి  నడిపిస్తున్నా అడిగే నాథుడు లేకుండా పోయాడనే విమర్శలు వెల్లి వెతుకుతున్నాయి. 

వందల సంఖ్యలో..

 శంషాబాద్ ప్రాంతంలో వందల సంఖ్యలో ఫంక్షన్ హాల్స్, పెద్దపెద్ద కన్వెన్షన్ హాల్స్ ఉన్నాయి. వాటిలో దేనికి కూడా పర్మిషన్లు లేకపోవడం గమనార్ధం. అన్నింటినీ నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేశారు. వీటిలో చాలా వాటికి ఫైర్ సేఫ్టీ అధికారుల నుంచి కూడా అనుమతులు లేవు. దీంతోపాటు ఫంక్షన్ హాల్స్, కన్వెన్షన్ హాల్స్ లో ఏమాత్రం భద్రత చర్యలు పాటించడం లేదు. ఏమైనా ప్రమాదాలు జరిగితే ఇక అంతే సంగతులు. తాజాగా శుక్రవారం ఉదయం శంషాబాద్ మున్సిపల్ పరిధిలోని తొండుపల్లి లోని నిర్మాణంలో ఉన్న కన్వెన్షన్ హాల్లో భారీ అగ్నిప్రమాదం జరగడం తో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ ఫంక్షన్ హాల్ కు పర్మిషన్ లేదని మున్సిపల్ కమిషనర్ సుమన్ రావు స్పష్టం చేశా రు. దీంతోపాటు ఏ ఫంక్షన్ హాల్ కు కూడా పర్మిషన్ లేకపోవడం గమనార్హం. 

చర్యలు ఉత్తివే  

 పర్మిషన్ లేని ఫంక్షన్ హాల్స్ కన్వెన్షన్ హాల్స్ పై చర్యలు తీసుకోవాల్సిన ఆయా శాఖల అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. తమ జేబులు నిండితే చాలు అనే విధంగా అధికారులు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. నిబంధనలను పాటించని ఫంక్షన్ హాళ్లలో దురదృష్టవశాత్తు ఏమైనా ప్రమాదాలు జరిగితే ఎవరిది బాధ్యత అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పర్మిషన్ లేని ఫంక్షన్ హాల్స్, కన్వెన్షన్  హాల్స్ విషయంలో అధికారులు కఠిన తరమైన నిబంధనలు అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

ఎన్‌ఓసీలు లేకపోతే చర్యలు

 ఫంక్షన్ హాల్స్, కన్వెన్షన్ హాల్స్ లో తప్పనిసరిగా ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించాలి. తమ శాఖ నుంచి ఎన్‌ఓసీలు లేకపోతే కఠిన చర్యలు తీసు కుంటాం ఈ విషయంలో ఊరుకునేది లేదు. 

పూర్ణ చందర్ రావు, డిఎఫ్‌ఓ