కాలిఫోర్నియా: ప్రముఖ టెక్ కంపెనీ ఇంటెల్ తన ఉద్యోగులను తొలగించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. బహుశా ఈ వారంలోనే పెద్ద సంఖ్యలో ఉద్యోగులకు ఉద్వాసన పలకనున్నట్లు సమాచారం. ఖర్చు తగ్గించుకోవడంతో పాటు మార్కెట్ వాటాను పెంచుకొనే చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ’బ్లూమ్‌బర్గ్’ తన కథనంలో పేర్కొంది. ఇంటెల్ సాంకేతికతను మరింత మెరుగుపరచడానికి, సెమీకండక్టర్ పరిశ్రమలో కంపెనీని అగ్రగామిగా నిలిపేందుకు చేయాల్సిన పరిశోధన, అభివృద్ధిపై భారీగా ఖర్చు చేయాలని కంపెనీ సీఈఓ పాట్ గెల్సింగర్ నిర్ణయించుకున్నారు.
ఇందుకోసం ఖర్చులు తగ్గించుకోవడంపై దృష్టిసారించినట్లు స్పష్టమవుతోంది. ఇందులో భాగంగా ఉద్యోగుల తొలగింపు చేపట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇంటెల్ అధికారికంగా ఎటువంటి ప్రకటనా చేయలేదు.మరోవైపు అడ్వాన్స్ మైక్రో డివైజ్‌లు తయారుచేసే ప్రత్యర్థి కంపెనీలు ఈ రంగంలో మార్కెట్ వాటాను పెంచుకున్నాయి. ఎన్విడియా వంటి చిప్‌మేకర్లు సెమీకండక్టర్ల అభివృద్ధిలో ముందంజలో ఉన్నాయి. దీంతో ఇంటెల్ తమ మార్కెట్ వాటాను పెంచుకొనేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేయనుంది.
అందులోభాగంగానే సెమీకండక్టర్లను తయారుచేయడానికి ప్యాట్ గెల్సింగర్ ఫ్యాక్టరీలను నిర్మించాలని ప్రణాళిక రచిస్తున్నారు. వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా ఇంటెల్ 2023లో తన శ్రామిక శక్తిని 5 శాతం మేర తగ్గించుకుంది. భారతోత్‌లోని హైదరాబాద్, బెంగళూరు విభాగాల్లో 13 వేల మంది విధులు నిర్వహిస్తున్నారు.