calender_icon.png 25 October, 2024 | 5:52 AM

డెల్ టెక్నాలజీస్‌లో భారీ లేఆఫ్స్

08-08-2024 12:39:07 AM

  1. 12,500 మంది ఉద్యోగులపై వేటు
  2. ఐటీ, టెక్నాలజీ రంగంలో కొనసాగుతున్న మాస్ లేఆఫ్స్ 

హైదరాబాద్, ఆగస్టు 07 (విజయక్రాంతి): ఐటీ, టెక్నాలజీ రంగంలో మాస్ లేఆఫ్స్ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. తాజాగా డెల్ టెక్నాలజీస్ గత 15 నెలల్లో రెండో దశ లేఆఫ్స్‌ను ప్రకటించాయి. కంపెనీ ఉద్యోగుల్లో దాదాపు 10 శాతం ఏకంగా 12,500 మందిని విధుల నుంచి తొలగించింది. ఏఐతోపాటు ఆధునిక ఐటీ సొల్యూషన్స్‌పై దృష్టి సారించే క్రమంలో ఉద్యోగులపై వేటు వేసింది. కంపెనీ కార్యకలాపాల క్రమబద్ధీకరణ, భవిష్యత్ వృద్ధికి దారితీసే రంగాల్లో పెట్టుబడులు పెట్టే ఉద్దేశంతో ఉద్యోగుల సంఖ్యను డెల్ కుదించిందని చెబుతున్నారు. ఉద్యోగుల తొలగింపు నిర్ణయాన్ని డెల్ గ్లోబల్ సేల్స్, కస్టమర్ ఆపరేషన్స్ ప్రెసిడెంట్ బిల్ స్కానెల్, గ్లోబల్ చానెల్స్ చీఫ్ జాన్ బైర్న్ ప్రకటన ద్వారా సమాచారం అందించారు. భవిష్యత్ వృద్ధి కోసం ఈ బాధాకరమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వెల్లడించారు. 

26 వారాల వేతనం 

లేఆఫ్స్ గురించి హెచ్‌ఆర్ ఎగ్జిట్ మీటింగ్స్‌తోపాటు ముఖాముఖి భేటీల ద్వారా ఉద్యోగులకు తెలియజేశారు. బాధిత ఉద్యోగులకు రెండు నెలల వేతనం, ఉద్యోగి పనిచేసిన ఏడాదికి ఒక వారం చొప్పన గరిష్ఠంగా 26 వారాల వరకూ వేతనాన్ని లెక్కగట్టి పరిహార ప్యాకేజీ కింద చెల్లించనున్నారు. ఇక ఇటీవల ఉద్యోగుల బడ్జెట్ కుదించడం, ప్రాజెక్టులు రద్దు కావడంతో తదుపరి లేఆఫ్స్‌ను పలువురు ఉద్యోగులు అంచనా వేశారు. గత 15 నెలల్లో డెల్ కంపెనీలో ఇది రెండోసారి లేఆఫ్స్ కావడం. మొదటిసారి లేఆఫ్స్‌లో భాగంగా గత ఏడాది 13 వేల మందిని తొలగించింది. ప్రస్తుతం లేఆఫ్స్‌తో కలిపితే దాదాపు 25 వేల మంది ఉద్యోగులను తీసేసింది. తాజా వేటుతో కంపెనీలో పనిచేసే ఉద్యోగుల సంఖ్య లక్షలోపే ఉంటుందని అంచనా.