calender_icon.png 27 December, 2024 | 6:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జనగామలో భారీ అగ్నిప్రమాదం

28-10-2024 01:28:31 AM

  1. మూడు షాపింగ్ మాళ్లు దగ్ధం
  2. దుకాణ యజమానులకు సుమారు రూ.20 కోట్ల మేర ఆస్తి నష్టం ?

జనగామ, అక్టోబర్ 27 (విజయక్రాంతి): జనగామ జిల్లాకేంద్రంలో శనివారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. సిద్దిపేట రోడ్డులోని ఎస్బీఐ బ్యాంక్ పక్కనే ఉన్న విజయ షాపింగ్ మాల్‌లో షార్ట్‌సర్క్యూట్ సంభవించి పొగలు బయటకు వచ్చాయి. తర్వాత మంటలు అంటుకుని ఎగసిపడ్డాయి.

తెల్లవారుజామున స్థానికులు మంటలను గమనించి జనగామ పోలీసులు, అగ్నిమాపకశాఖకు సమాచారం అందించారు. డీసీపీ రాజమహేంద్ర నాయక్, ఏసీపీ పార్థసారథి, సీఐ దేవేందర్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. అగ్నిపమాక సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నం చేశారు.

అయినప్పటికీ మంటలు అదుపులోకి రాలేదు. మంటలు క్రమంగా పక్కనే ఉన్న శ్రీలక్ష్మి షాపింగ్ మాల్‌కు వ్యాపించాయి. దీంతో పోలీసులు, యాద్రాద్రి భువనగిరి జిల్లా నుంచి మరో మూడు ఫైరింజన్లను తెప్పించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేందుకు గంటల పాటు శ్రమిస్తూనే ఉన్నారు. మంటలు క్రమంగా ఎస్‌ఆర్ బ్రదర్స్ వస్త్ర దుకాణానికి అంటుకున్నాయి.

పోలీసులు జనగామ, యాదాద్రి భువనగిరి నుంచే కాకుండా స్టేషన్ ఘన్‌పూర్, పాలకుర్తి నుంచి కూడా మరో రెండు ఫైరింజన్లను తెప్పించారు. ఇలా ఆరు ఫైరింజన్లు ఘటనా స్థలానికి వచ్చి, 40 మంది సిబ్బంది 12 గంటల పాటు శ్రమించి చివరకు ఆదివారం సాయంత్రం 7 గంటలకు మంటలను పూర్తిగా ఆర్పివేశారు.

మంటలు ఆర్పడానికి సిబ్బందికి 130 ట్రిప్పుల నీరు అవసరమైంది. అగ్ని ప్రమాదంతో ఆయా దుకాణాల యజమానులకు రూ.20 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అగ్నిమాపక శాఖ అధికారులు అంచనా వేశారు. ప్రమాదంతో ఆయా సముదాయాల్లో పనిచేస్తున్న సుమారు 200 మందికి ఉపాధి పోయింది.