అగ్నిమాపక, పోలీసు సిబ్బంది అప్రమత్తతో తప్పిన ప్రాణ నష్టం
వికారాబాద్, మే 17 (విజయక్రాంతి) : జిల్లా కేంద్రంలోని ఓ హార్డ్‌వేర్ షాపులో షాట్ సర్కూట్‌తో నెలకొన్న మంటలు చెలరేగాయి. ధారూరు మండలానికి చెందిన నెనావత్ కృష్ణ కొన్ని సంవత్సరాలుగా రామయ్యగూడ రోడ్డులోని ఓ భవనంలో హార్డ్‌వేర్ షాపు నడుపుతున్నాడు. భవనం మొత్తం మూడు అంతస్తులు ఉండగా రెండు అంతస్తుల్లో హార్డ్‌వేర్ సామాను సమకూర్చాడు. పై అంతస్తులో షాపు యజమాని కుటుంబం నివాసం ఉంటున్నారు. అయితే శుక్రవారం తెల్లవారు జామున 4గంటల సమయంలో అకస్మాత్తుగా షాపులో మంటలు చెలరేగాయి.
నిమిషాల్లోనే మంటలు పెద్ద ఎత్తున చెలరేగి దట్టమైన పొగ మూడు అంతస్తులకు పాకింది. చుట్టుపక్కల భవనాలకు సైతం మంటలు, పొగ కమ్మేయడంతో నిద్రలో ఉన్న చాలా కుటుంబాలు ఏం జరుగుతుందో తెలియక అర్థనాదాలు చేస్తూ రోడ్లపైకి పరుగులు తీశారు. అయితే అగ్నిప్రమాదం జరిగిన భవనం పై అంతస్తులో యజమాని భార్య పిల్లలు ఉన్న విషయం స్థానికులు గమనించడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. అగ్నిప్రమాదం జరిగిన ప్రదేశానికి అగ్నిమాపక కేంద్రం కూతవేటు దూరంలోనే ఉండటంతో అగ్నిమాపక సిబ్బంది వెంటనే అప్రమత్తమై రెండు ఫైర్ ఇంజన్లతో అక్కడి చేరుకొని మంటలను అదుపుచే ప్రయత్నం చేశారు.
సమాచారం అందుకున్న పట్టణ సీఐ నాగరాజు తన సిబ్బందితో అక్కడి చేరుకొని చుట్టుపక్క భవనాల వారికి ఎలాంటి ప్రమాదం జరుగకుండా అప్రమత్తం చేశారు. పై అంతస్తులో చిక్కుకున్న మహిళ, ఇద్దరు పిల్లలను అగ్నిమాపక సిబ్బంది నిచ్చెన సహాయంతో వెళ్లి బయటకు తీసుకొచ్చి ప్రాణా లు కాపాడారు. సుమారు రెండు గంటల పాటు ఏకదాటిగా మంటలు మండటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. భారీ మంటల కారణంగా చుట్టుపక్క ఇళ్లు కూడా పాక్షికంగా దెబ్బతిన్నట్లు స్థానికులు తెలిపారు. అగ్నిప్రమాదం విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అందుబాటులో లేకపోవడంతో మున్సిపల్ చైర్‌పర్సన్ మంజుల రమేశ్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డిలను అక్కడి పంపించారు.
చైర్‌పర్సన్ మంజుల రమేశ్, సుధాకర్‌రెడ్డి, మరి కొందరు వ్యాపారులు షాపు యజమానికి కొంత ఆర్థిక సహాయం అందించారు. ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసు సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది స్పందించడంతో ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదని స్థానికులు వారి సేవలను కొనియాడారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు షాట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగి ఉండవచ్చునని ప్రాథమికంగా అంచనా వేశారు. సుమారు రూ. 2కోట్ల ఆస్తి నష్టం జరిగిందని బాధితుడు తెలిపాడు.