26-03-2025 01:28:10 AM
అర్ధరాత్రి తరువాత ఘటన
నల్లగొండ, మార్చి 25 (విజయక్రాంతి) : నల్లగొండ పట్టణం హైదరాబాద్ రోడ్డులోని హాట్ బకెట్ బిర్యానీ సెంటర్లో సోమవారం అర్థరాత్రి తరువాత భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి బిర్యానీ సెంటర్ షెట్టర్, గేటుతోపాటు సామగ్రి ఎగిరి రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. పేలుడు తీవ్రతకు ఏం జరిగిందో తెలియక సమీపంలోని కాలనీలవాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
రంజాన్ నెలకావడంతో బిర్యానీ సెంటర్ అర్ధరాత్రి వరకూ తెరిచే ఉంది. ఒంటిగంట సమయంలో పేలుడు సంభవించడం.. దుకాణంలో సిబ్బంది ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు, అగ్నిమాపక కేంద్రం సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకొని ఫైరింజన్తో మంటలు అదుపు చేశారు.
బిర్యానీ సెంటర్లో గ్యాస్ సిలిండర్ పేలిందా? లేక షార్ట్ సర్క్యూట్ సంభవించిదా? ఇంకా మరేదైనా ఉందా? అన్న కోణంలో నల్లగొండ టూటౌన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దుకాణం నిర్వాహకుడు తమకు ఫిర్యాదు ఇవ్వలేదని టూటౌన్ ఎస్‌ఐ తెలిపారు.