calender_icon.png 22 January, 2025 | 9:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ బందూకుల మోత

22-01-2025 02:21:38 AM

16 మంది మావోయిస్టుల మృతి

  1. మృతుల్లో కేంద్ర కమిటీ సభ్యులు చలపతి, మనోజ్, స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు గుడ్డు
  2. కొనఊపిరితో నక్సలిజం: కేంద్ర హోంమంత్రి అమిత్‌షా

రాయ్‌పూర్, జనవరి 21: ఛత్తీస్‌గఢ్ అడవులు రక్తమోడుతూనే ఉన్నాయి. ఛత్తీస్‌గఢ్-ఒడిశా రాష్ట్రాల సరిహద్దులో మంగళవారం భారీ ఎన్‌కౌంటర్ జరిగిం ది. గరియాబంద్, నౌపాడ జిల్లాల్లో భద్రతాబలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో 16 మంది మావోయిస్టులు మృతిచెందా రు. మృతుల్లో కేంద్ర కమిటీ(సీసీ) సభ్యు డు చలపతి అలియాస్ రామచంద్రారెడ్డి,  మనోజ్, స్పెషల్ జోన్ కమిటీ సభ్యుడు గుడ్డు ఉన్నారు

. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా సరిహద్దు జిల్లాలైన గరియాబా ద్, నౌపాడలో జిల్లా రిజర్వ్ గార్డ్, సెంట్ర ల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, ఛత్తీస్‌గఢ్‌కు చెం దిన కోబ్రా, ఒడిశాకు చెందిన స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ భద్రతా సిబ్బంది సం యుక్తంగా ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు.

ఈ క్రమంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో సోమవారం ఇద్దరు మావోయిస్టులు మృతిచెందగా.. తర్వాత కూడా కొనసాగుతున్న ఆపరేషన్‌లో మరో 14మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఆపరేషన్‌లో వెయ్యిమంది వరకు భద్రతా సిబ్బంది పాల్గొన్నట్లు తెలుస్తోంది.

అతిపెద్ద ఎన్‌కౌంటర్‌లలో ఒకటి..

నిషేధిత మావోయిస్టు సంస్థకు చెందిన కేంద్ర కమిటీ(సీసీ) సభ్యుడు చలపతి మృతుల్లో ఉండడంతో దేశంలో జరిగిన అతిపెద్ద ఎన్‌కౌంటర్లలో ఇది ఒకటని, సీసీ సభ్యుడిని చంపడం ఒక పెద్ద విజయమని ఎస్పీ రఖేచా చెప్పారు. ఎన్‌కౌంటర్ స్థలం నుంచి ఏకే 47, ఎస్‌ఎల్‌ఆర్, ఐఎన్‌ఎస్‌ఏఎస్, ఇతర ఆటోమేటిక్ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.

ఆదివారం రాత్రి నుంచి భద్రతా బలగాలతో జరుగుతున్న ఎన్‌కౌంటర్‌లో పలువురు మావోయిస్టులు మృతిచెందారని ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్‌సాయి భద్రతా సిబ్బంది పరాక్రమానికి సలాం చేశారు. మార్చి 2026 నాటికి దేశవ్యాప్తంగా నక్సలిజాన్ని నిర్మూలించాలని ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా సంకల్పాన్ని బలోపేతం చేస్తూ భద్రతా సిబ్బంది వరుస విజయాలు సాధిస్తున్నారని చెప్పారు. 

36గంటలుగా కొనసాగుతున్న ఎదురుకాల్పులు..

గరియాబంద్ ఎన్‌కౌంటర్ గత 36 గంటలుగా కొనసాగుతోందని సోమవారం రెండు మహిళా మృతదేహాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయని స్థానిక ఎస్పీ తెలిపారు. ఛత్తీస్‌గఢ్, ఒడిశా నుంచి వచ్చిన బలగాలు ఈనెల 19 రాత్రి, పొరుగున ఉన్న ఒడిశాలోని నౌపాడ నుంచి 5 కి.మీ., రాయ్‌పూర్ నుంచి 125 కి.మీ. దూరంలోని గరియాబంద్‌లోని కుల్‌హరీఘాట్ రిజర్వ్ ఫారెస్ట్‌లో మావోయిస్టులు పెద్దసంఖ్యలో ఉన్నట్లు తెలుసుకుని ఆపరేషన్ ప్రారంభించినట్టు పోలీసులు చెబుతున్నారు. 

అలిపిరి ఘటన సూత్రధారి చలపతి 

మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు చలపతి అలియాస్ రామచంద్రారెడ్డిపై ప్రభుత్వం కోటి రూపాయల రివార్డు ప్రకటించింది. చలపతికి అప్పారావు అలియాస్ జైరామ్ అలియాస్ రాము అనే పేర్లు కూడా ఉన్నాయి. ఆయనకు సుమారు 60 సంవత్సరాల వయస్సు ఉంటుంది. చలపతి ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందినవారు. 10వ తరగతి వరకు చదువుకున్నారు. కేంద్ర కమిటీ సభ్యుడిగానే కాకుండా ఒడిశా రాష్ట్ర కమిటీ ఇన్‌చార్జిగా ఉన్నారు.

ఛత్తీస్‌గఢ్‌లోని మార్హ్ ప్రాంతం ఆయన ప్రధాన స్థావరమని పోలీసులు తెలిపారు. మావోయిస్టులకు వ్యూహరచన చేయడంలో, కార్యకలాపాలు నడిపించడంలో చలపతి ముఖ్యపాత్ర పోషించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై గతంలో అలిపిరిలో జరిగిన దాడి కేసులో చలపతి కీలక సూత్రధారి. చలపతికి భద్రతగా 8-10 మంది వ్యక్తిగత గార్డులు ఉండేవారు. చలపతి ప్రధాన వ్యక్తి కావడంతో ఆయన్ను పట్టించినవారికి కోటి రూపాయల భారీ రివార్డును ప్రభుత్వం ప్రకటించింది. 

2024లో 200 మంది మావోయిస్టుల హతం..

మావోయిస్టులకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. 2024లో ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా బలగాల చేతిలో 200 మందికి పైగా మావోయిస్టులు హతమయ్యారు. గతేడాది హతమైన 219 మంది మావోయిస్టుల్లో 217 మంది బస్తర్, దంతేవాడ, కాంకేర్, బీజాపూర్, నారాయణ పూర్, కొండగావ్, సుక్మా జిల్లాలతో కూడా బస్తర్ ప్రాంతానికి చెందినవారు. 800 మంది మావోయిస్టులు అరెస్ట్ కాగా, 802 మంది ఆయుధాలు వదిలేశారు. 2024లో మావోయిస్టులకు వ్యతిరేకంగా జరిగిన పోరులో 18 మంది భద్రతా సిబ్బంది ప్రా ణాలు కోల్పోగా, మావోయిస్టుల హింసలో మరణించిన పౌరులు 65 మంది.

కొనఊపిరితో నక్సలిజం..

కేంద్ర హోంమంత్రి అమిత్‌షా

ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌పై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా స్పందిస్తూ.. నక్సల్స్ లేని భారత్ దిశగా ఇది కీలక అడుగని వ్యాఖ్యానించారు. నక్సలిజానికి గట్టి ఎదురుదెబ్బ అని, భద్రతా బలగాలకు గొప్ప విజయమన్నారు. దేశంలో నక్సలిజం కొన ఊపిరితో ఉందన్నారు. ఒడిశా-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో సీఆర్‌పీఎఫ్, ఎస్‌వోజీ ఒడిశా, ఛత్తీస్‌గఢ్ పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో భారీ సంఖ్యలో మావోయిస్టులను మట్టుబెట్టారని అమిత్‌షా ఎక్స్ లో ట్వీట్ చేశారు.