calender_icon.png 23 November, 2024 | 7:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్

23-11-2024 02:51:09 AM

10 మంది మావోయిస్టులు మృతి

సుక్మా జిల్లాలో ఘటన

రాయ్‌పూర్ /జనగామ, నవంబర్ 22 (విజయక్రాంతి): ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో మరోసారి తుపాకుల శబ్దం మార్మోగింది. సుక్మా జిల్లాలో భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఘటనలో 10 మంది మావోయిస్టులు మృతిచెందారు. ఒడిశా అటవీప్రాంతం నుంచి ఛత్తీస్ గఢ్‌లోకి మావోయిస్టులు ప్రవేశించారని సమాచారం అందుకున్న  పోలీస్ అధికారులు గురువారం రాత్రి డిస్ట్రిక్ రిజర్వ్ గార్డ్ (డీఆర్జీ) బృందాలతో కూంబింగ్ చేపట్టారు.

శుక్రవారం తెల్లవారుజామున వారికి మావోయిస్టులు తారసపడి కాల్పులు జరిపారు. అప్రమత్తమైన జవాన్లు ఎదురుకాల్పులకు దిగారు. ఇరువర్గాల మధ్య సుమారు ఆరగంట పాటు భీకర పోరు జరిగింది. జవాన్ల ధాటికి తాళలేని మావోయిస్టులు కాల్పులు జరపుతూ దట్టమైన అటవీప్రాంతంలోకి పారిపోయారు. జవాన్లు అనంతరం ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. ఘటనా స్థలంలో పది మంది మావోయిస్టుల మృతదేహాలను గుర్తించారు.

అలాగే మావోయిస్టులకు సంబంధిం చిన మూడు అటోమేటిక్ తుపాకులతో పాలు కొంత పేలుడు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. మృతుల వివరాలను ఛత్తీస్‌గఢ్ పోలీ సులు అధికారులు ధ్రువీకరించాల్సి ఉన్నది.

ఇన్‌ఫార్మర్ల నెపంతో ఇద్దరి హత్య

ములుగు జిల్లాలో మావోయిస్టులు దారుణానికి పాల్పడ్డారు. ఇన్‌ఫార్మర్ల నెపంతో ఓ పంచాయతీ కార్యదర్శితో పాటు అతడి సోదరుడిని గొడ్డళ్లతో నరికి దారుణంగా హత్య చేశారు. వాజేడు మండలం జంగాలపల్లికి చెందిన ఊయి క రమేశ్, అర్జున్ సోదరులు. వీరిలో రమేశ్ పేరూరు పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. వీరిద్దరూ పోలీస్ ఇన్‌ఫార్మర్లుగా భావించిన మావోలు గురువారం అర్ధరాత్రి సాయుధంగా జంగాలపల్లికి చేరుకున్నారు.

నిద్రిస్తున్న రమేశ్, అర్జున్‌పై విచక్షణారాహిత్యంగా గొడ్డళ్లతో దాడిచేశారు.  అప్పటికే రమేశ్ చనిపోగా అర్జున్‌ను ఏటూరునాగారం ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెం దాడు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మావోయిస్టులు వదిలివెళ్లిన లేఖను స్వాధీనం చేసుకున్నారు. రమేశ్, అర్జున్ షికార్ పేరుతో అటవీ ప్రాంతం లో తిరుగుతూ, తమ కదలికల సమాచారాన్ని చేరవేస్తున్నందనే హతమార్చా మని లేఖలో పేర్కొన్నారు.