calender_icon.png 3 October, 2024 | 3:54 AM

భారీగా గంజాయి పట్టివేత

03-10-2024 01:38:28 AM

ముగ్గురి అరెస్ట్

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 2 (విజయక్రాంతి): మల్లెపల్లికి చెందిన సయ్యద్ అబ్దుల్లా అనే వ్యక్తి గంజాయికి అలవాటు పడ్డాడు. మొదట్లో ధూల్‌పేట్ నుంచి గం జాయి కొనుగోలు చేసి సేవించేవాడు. అనంతరం తన ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన మహా రాష్ట్రకు చెందిన అనాస్ అనే వ్యక్తి నుంచి గంజాయి కొనుగోలు చేసి తాను సేవించడంతో పాటు ఇతరులకు విక్రయిస్తే అధిక డబ్బు సంపాదించవచ్చని ప్లాన్ వేశాడు.

కానీ, పోలీసులకు చిక్కి కటకటాల్లోకి వెళ్లా డు. ఈ మేరకు బుధవారం సౌత్‌వెస్ట్ జోన్ డీసీపీ చంద్రమోహన్ మెహదీపట్నంలోని తన కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పా టు చేసి వివరాలను వెల్లడించారు. మహారాష్ట్రకు చెందిన అనాస్ అహ్మద్ షేక్, ఇర్ఫాన్ రాజుషేక్ అనే ఇద్దరు స్నేహితులు. వీరిద్దరు కలిసి ఫర్హాన్ అనే గంజాయి పెడ్లర్ వద్ద పనికి కుదిరారు.

ఫర్హాన్ ఆదేశాల మేరకు మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో గంజాయి సరఫరా చేసేవారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని మల్లెపల్లికి చెందిన సయ్యద్ అబ్దుల్లా తన ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన అనాస్‌ను కలిశాడు. అయితే గంజాయి సేవించడంతో పాటు విక్రయిస్తే లాభాలు గడించవచ్చని ప్లాన్ వేసి, అనాస్ నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి అధిక ధరలకు విక్రయించడం ప్రారంభించాడు.

ఈ క్రమంలోనే గత నెల 30న అనాస్, ఇర్ఫాన్ రాజుషేక్ కలిసి అబ్దుల్లాకు గంజాయి డెలివరీ చేయడానికి వచ్చారు. విశ్వసనీయ సమాచారం మేరకు హబీబ్‌నగర్ పోలీసులు దాడులు నిర్వహించి ముగ్గురిని అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 10 లక్షల విలువ చేసే 144.7 గ్రాముల ఆర్గానిక్ గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్‌కు తరలించామని డీసీపీ తెలిపారు.

హాష్ ఆయిల్ సరఫరా చేస్తున్న వ్యక్తి అరెస్ట్ 

హాష్ ఆయిల్ సరఫరా చేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలిలా ఉన్నాయి.. ఒడిశాకు చెందిన హంటల్ గోబర్ధన్ అనే వ్యక్తి వృత్తి రీత్యా రైతు. ఇతడికి ఒడిశాలోని కోరాపుట్ జిల్లాకు చెందిన మనోజ్ అనే డ్రగ్ పెడ్లర్‌తో పరిచయం ఏర్పడింది. మనోజ్ సూచనల మేరకు గోబర్ధన్ విశాఖపట్నం, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు డ్రగ్స్ సరఫరా చేసేవాడు.

ఈక్రమం లోనే గత వారం మనోజ్ హైదరాబాద్‌లోని ఓ కస్టమర్‌కు 2 కిలోల హాష్ ఆయిల్ డెలివరీ చేయాలని గోబర్ధన్‌కు చెప్పాడు. దీంతో గోబర్దన్ నగరంలోని గుడిమల్కాపూర్‌లో ఉన్న సాయిబాబా ఆలయం వద్దకు చేరుకున్నాడు.

విశ్వసనీయ సమచారంతో సౌత్‌వెస్ట్ జోన్ కమిషనర్ టాస్క్‌ఫోర్స్, ఆసిఫ్ నగర్ పోలీసులు దాడి నిర్వహించి గోబర్ధన్‌ను అరెస్ట్ చేసి రూ. 20 లక్షల విలువ చేసే 2 కిలోల హాష్ ఆయిల్, ఒక సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. మనోజ్‌పై కూడా కేసు నమోదు చేశామని డీసీపీ చంద్రమోహన్ తెలిపారు. 

185 గ్రాముల గంజాయి స్వాధీనం

ఏపీలోని శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన గేడెల రుషికేశ్వర్‌రావు వ్యాపారంలో నష్టాలు రావడంతో మత్తు పదార్థాల విక్రయాలకు తెరలేపాడు. నగరానికి వచ్చి ఓ ఇల్లు అద్దెకి తీసుకొని అమ్మకాలు సాగిస్తున్నాడు. ఈ క్రమంలో కూకట్‌పల్లి గాయత్రినగర్ శ్రీచైతన్య జూనియర్ కళాశాల సమీపంలోని ఓ ఇంట్లో గంజాయి, డ్రగ్స్ అమ్మకాలు జరుపుతున్నారనే సమాచారం మేరకు ఎస్టీఎఫ్ బీ టీమ్ సీఐ నాగరాజు బృందం బుధవారం రుషికేశ్వర్‌రావు ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో 185 గ్రాముల గంజాయి, 7 గ్రాముల ఎండీఎంఏ స్వాధీనం చేసుకున్నారు. రుషికేశ్వర్‌రావును కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.

గంజాయి మొక్కలు పెంచుతున్న వ్యక్తి అరెస్ట్ 

మల్కాజిగిరికి చెందిన వెంకటరాజు అనే వ్యక్తి వెస్ట్ ఆనంద్‌బాగ్ రైల్వే ట్రాక్ వద్ద గంజాయి మొక్కలు పెంచుతున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంకటరాజును అదుపులోకి తీసుకొని మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. 

విశాఖ టు హైదరాబాద్ గంజాయి సరఫరా

ఉత్తరప్రదేశ్‌కు చెందిన సైదులు, వెస్ట్‌బెంగాల్‌కు చెందిన సుమనసేన్, ఎండీ సోహెల్‌లు ఉపాధి నిమిత్తం విశాఖపట్నం వచ్చారు. వారికి తమకు తెలిసిన వ్యక్తుల ద్వారా ఆకాశ్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. ఈ క్రమంలో ఆకాశ్ ఇచ్చే గంజాయి మూటలను విశాఖ నుంచి హైదరాబాద్‌లోని రిసీవర్‌కు ఇచ్చి వస్తే ఒక్కొక్కరికి రూ. 10 వేలు చొప్పున ఇస్తానని చెప్పాడు.

దీంతో ముగ్గురు గంజాయి మూటలతో రైలులో విశాఖ నుంచి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఎక్సైజ్ ఎస్టీఎఫ్ పోలీసులు దాడులు నిర్వహించి బుధవారం ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. 15 లక్షల విలువచేసే 60 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్‌కు తరలించారు.

గంజాయి విక్రయిస్తున్న భార్యాభర్తల అరెస్ట్

ఎల్బీనగర్: గంజాయి విక్రయించడానికి ప్రయత్నించిన భార్యాభర్తలను ఎల్బీనగర్ ఎస్‌వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 930 గ్రాముల గం జాయి స్వాధీనం చేసుకున్నారు. ఏపీలోని గుంటూరు జిల్లాకు చెం దిన యాపర్తి గోపి, ఉమా మహేశ్వరి భార్యాభర్తలు. వీరు గుంటూరు జిల్లా మాచర్లకు చెందిన చల్లా శివనాగరాజు వద్ద గంజాయిని కొనుగోలు చేస్తూ హైదరాబాద్‌లో విక్రయిస్తున్నారు.

ఈ క్రమంలో నాగోల్‌లోని జైపూరి కాలనీకి చెందిన తంగెళ్ల ప్రభుచరణ్, ఏరుకల నగేశ్ అనే ఇద్దరు యువకులు గంజాయి కోసం భార్యాభర్త లను సంప్రదించారు. ఈ మేరకు బుధవారం ఎల్బీనగర్‌లోని లక్ష్మీ హ్యుందాయ్ షోరూమ్ వద్ద గంజా యి విక్రయించడానికి రాగా, పక్కా సమాచారం తెలుసుకున్న ఎల్బీనగర్ పోలీసులు నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.