- బట్టలు ఉతికే పనిఉందని చెప్పి ఇంటికి తీసుకెళ్లి.. అఘాయిత్యానికి పాల్పడిన కామాంధులు
- పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు
- అదుపులో ఒక నిందితుడు.. పరారీలో మరో ఇద్దరు!
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 5 (విజయక్రాంతి) : నగరంలో జరుగుతున్న వరుస సంఘటనలు కలకలం రేపుతున్నాయి. తాజాగా మధురానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. పొట్టకూటి కోసం భవన నిర్మాణ కార్మికురాలిగా పనికి వెళ్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్న మహిళపై ముగ్గురు యువకులు గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. క్లూస్ టీం, పోలీసులు ఘట నాస్థలానికి చేరుకుని పలు ఆధా రాలను సేకరించారు. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం, నిందితులను ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పుర్‌కు చెందినవారిగా పోలీసులు గుర్తించారు.
నెల రోజుల క్రితం పెయింటింగ్ పని చేసేందుకు నగరానికి వచ్చి, మధురానగర్ పోలీస్‌స్టేషన్ పరిధి రహ్మత్‌పుర డివిజన్‌లోని ఓం నగర్‌లో ఓ రూమ్ అద్దెకి తీసుకుని ఉంటున్నారు. ప్రస్తుతం ముగ్గురు నిందితుల్లో ఒకరు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితుల కోసం పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
అసలేం జరిగింది..
కొండాపూర్ ప్రాంతంలో నివాసముంటున్న మహిళ(50) సోమవారం ఉదయం పనికి వెళ్లి, సాయంత్రం పని ముగించుకుని ఇంటికి బయల్దేరింది. ఈ క్రమంలో హైటెక్స్ చౌరస్తా వద్ద బస్సు కోసం మహిళ ఎదురు చూస్తోంది. దీంతో ఎప్పటినుంచో ఆమెపై కన్నేసిన ముగ్గరు కామాంధులు ఆటోలో ఆమె వద్దకు వచ్చారు. తమ ఇంట్లో బట్టలు ఉతికే పనిఉందని మహిళకు చెప్పారు.
దీంతో బట్టలు ఉతికితే డబ్బులు వస్తాయని ఆశపడిన మహిళ వారితో వెళ్లేందుకు సిద్ధమైంది. దీంతో ముగ్గురు వ్యక్తులు ఆమెను ఆటోలో ఎక్కించుకుని మధురానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో తాము ఉంటున్న ఇంటికి తీసుకె ళ్లారు. ఆపై మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఎలాగోలా వారి నుంచి తప్పించుకున్న బాధితురాలు ఒంటిపై బట్టలు లేకుండా బయటకు పరుగులు తీసింది.
ఇది గమనించిన స్థానిక మహిళ.. ఆమె నైటీ ఇచ్చింది. ఆపై బాధితురాలు తనకు జరిగిన అన్యాయం గురించి సదరు మహిళకు చెప్పి బోరున విలపించింది. ఆ మహిళ సహాయంతో మధురానగర్ పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్న బాధితురాలు సోమవారం రాత్రి 11:30 గంటల సమయంలో ముగ్గురు యువకులు తనపై అత్యాచారం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం బాధిత మహిళను భరోసా కేంద్రానికి తరలించారు.