calender_icon.png 24 November, 2024 | 9:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాస్ మెకానిక్.. ఇంటెలిజెంట్ రాకీ

23-11-2024 12:00:00 AM

విశ్వక్‌సేన్ కథానాయకుడిగా తెరకెక్కింది ‘మెకానిక్ రాకీ’ చిత్రం. శుక్రవారం థియేటర్లలో విడుదలైన ఈ సినిమా కథ ఓ కార్ గ్యారేజ్ చుట్టూ అల్లుకుంది. అదెలా ఉందో చూద్దాం... 

ఇదీ కథ..  

రాకీ అలియాస్ రాకేశ్ నగుమోము (విశ్వక్ సేన్) తన తండ్రి (నరేశ్) మెకానిక్ గ్యారేజీతోపాటు డ్రైవింగ్ స్కూల్ నడిపిస్తుంటాడు. అతని గ్యారేజీని రంకి రెడ్డి (సునీల్) కబ్జా చేసి వేరేవాళ్లకు ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాడు. రాకీ తన గ్యారేజిని కాపాడుకోవడానికి రూ.25 లక్షలు కట్టాల్సి వస్తుంది. అదే సమయంలో మాయ (శ్రద్ధా శ్రీనాథ్) ఓ ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేస్తున్నానంటూ డ్రైవింగ్ నేర్చుకోవడానికి రాకీ దగ్గరకు వస్తుంది.

డ్రైవింగ్ నేర్పించే క్రమంలో మాయ రాకీ కథ అడగడంతో.. తన తాత ఓ కామెడీ ఫ్యాక్షనిస్ట్ అని, రాయలసీమ నుంచి వచ్చి హైదరాబాద్‌లో సెటిల్ అయ్యాడని, కాలేజీలో ప్రియ (మీనాక్షి చౌదరి)ని ప్రేమించడం, చదువు మధ్యలోనే ఆపేయడం, చాలా కాలం తర్వాత ప్రియ మళ్లీ కనపడి తన దగ్గరికి డ్రైవింగ్ నేర్చుకోవడానికి రావడం, ప్రియ అన్నయ్య (విశ్వదేవ్) చనిపోవడం, తన తండ్రి చనిపోవడం.. ఇలా తన గురించి మొత్తం చెప్తాడు.

గ్యారేజీ కూల్చే సమయానికి మాయ రాకీ వాళ్ల నాన్న పేరు మీద రూ.2 కోట్లు ఇన్సూరెన్స్ ఉందని ఫోన్ చేస్తుంది. మరి రాకీకి వాళ్ల నాన్న ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చాయా? రాకీ గ్యారేజీ సమస్య ఏంటి? చచ్చిపోయిన రాకీ తాత రాకీకి ఎలా హెల్ప్ అయ్యాడు? ప్రియ వాళ్ల అన్నయ్య ఎలా చనిపోయాడు? ప్రియ ప్రేమ ఏమైందో తెరపైనే చూడాల్సిందే. 

ఎలా ఉందంటే..? 

ఫస్ట్ హాఫ్ అంతా హీరో పాత్ర, మాయ పరిచయం అవ్వడం, హీరో గ్యారేజీ కష్టాలు, నాన్న చనిపోవడం చూపించి ఇంటర్వెల్‌కి సింపుల్‌గా ఓ ట్విస్ట్ ఇచ్చి ముగించారు. ప్రీ ఇంటర్వెల్ వరకు రెగ్యులర్ కమర్షియల్ సాగదీసిన సినిమాలానే అనిపిస్తుంది. ఇంటర్వెల్ తర్వాత ఓ రెండు ట్విస్టులతో కథను మలుపు తిప్పి వేగవంతంగా నడిపించారు. ట్విస్టులు బాగున్నా, ఈజీగా కనిపెట్టేలా అనిస్తాయి. స్క్రీన్ ప్లే ఎత్తుకు పైఎత్తు కాన్సెప్ట్‌తో సాగింది.

కామెడీ ఇంకాస్త పండాల్సింది. విషయమంతా ద్వితీయార్థంలోనే ఉందని చెప్పొచ్చు. మొత్తంగా ఈ సినిమాతో విశ్వక్ సేన్ మాస్ ‘మెకానిక్’ ఇంటెలిజెంట్ ‘రాకీ’ అనిపించుకున్నాడు. 

సినిమా: మెకానిక్ రాకీ 

విడుదల: నవంబర్ 22 

ముఖ్య తారాగణం: విశ్వక్‌సేన్, మీనాక్షి చౌదరి, 

శ్రద్ధా శ్రీనాథ్, సునీల్, నరేశ్, రఘురాం, 

వైవా హర్ష, ఆది తదితరులు 

బ్యానర్: ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్స్ 

నిర్మాణం: రామ్ తాళ్లూరి 

దర్శకత్వం: రవితేజ ముళ్లపూడి