- నవంబర్ 2 నుంచి డిసెంబర్ 1వరకు నిర్వహణ
- దేవాదాయ, ధర్మాదాయశాఖ మంత్రి కొండా సురేఖ
హైదరాబాద్, నవంబర్ 2 (విజయక్రాంతి): కార్తీక మాసంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసేలా దేవాదాయ శాఖ ‘సామూహిక కార్తీకమాస దీపోత్సవ వేడుకలు’ వైభవంగా నిర్వహిస్తున్నదని దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రకటించారు. నవంబర్ 2 నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు ఈ వేడుకలను నిర్వహించనున్నట్టు తెలిపారు.
ఇందులో భాగంగా దేవాదాయ శాఖ పరిధిలోని అన్ని దేవాలయాల్లో కార్తీకమాస దీపోత్సవ వేడుకలను కన్నులపండువగా నిర్వహించేలా కార్య నిర్వహణాధికారులు, అసిస్టెంట్ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు.
ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు అన్ని దేవాలయాల్లో కార్తీక దీపోత్సవ వేడుకలను నిర్వహించ నున్నట్టు పేర్కొన్నారు. సామూహిక కార్తీక దీపోత్సవంలో పాల్గొనే భక్తులకు రెండు మట్టి ప్రమిదలు, నూనె వత్తులు ఉచితంగా అందించనున్నట్టు స్పష్టం చేశారు. ఈ దిశగా చర్యలు చేపట్టాలని ఈవోలను మంత్రి సురేఖ ఆదేశించారు.