10-02-2025 12:16:55 AM
ఫలితాలతో సంబంధం లేకుండా మొన్నటిదాకా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరించారు హీరో రవి తేజ. చేతిలో కనీసం మూడు నాలుగు చిత్రాలతో వరుసగా వచ్చిన ఆయన ప్రస్తుతం ‘మాస్ జాతర’తో రాబోతున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాకు రవితేజ సినిమా కెరీర్‌లో మైలురాయి.
రవితేజ 75వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి భాను భోగవరపు దర్శకుడు. శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. సమ్మర్ మరెంతో దూరంలో లేదు.. మరి రవన్న తర్వాతి సినిమా ఏంటి? అన్న ప్రశ్న అభిమానుల్లో బయలుదేరుతుండగానే.. రవితేజ కొత్త సినిమా గురించి ఓ వార్త వినవస్తోంది.
ఆయన ఓ కొత్త ప్రాజెక్టును ఓకే చేశాడని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మాస్ హీరోగా పేరున్న రవితేజ ఓ క్లాస్ డైరెక్టర్‌కు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ‘నేను శైలజ’, ‘చిత్రలహరి’, ‘ఉన్నది ఒకటే జిందగీ’ లాంటి క్లాస్ లవ్‌స్టోరీలతో హిట్లు అందుకున్న కిశోర్ తిరుమలకు రవితేజ ఓకే చెప్పినట్టు టాలీవుడ్ టాక్. కిశోర్ గతంలో రవితేజ హీరోగా నటించిన ‘పవర్’ సినిమాకు రచయితగా పనిచేశారు.
అప్పట్నుంచి వీరిద్దరికి మంచి అనుబంధం ఉంది. రవితేజ క్లాస్ స్టోరీలో కనిపించి చాలా రోజులైంది. చివరగా ‘ఆడాళ్లూ మీకు జోహార్లు’ సినిమాతో పలకరించిన కిశోర్ సినిమా అనగానే ఫ్యాన్స్ రవితేజ నుంచి క్లాస్ లవ్‌స్టోరీ ఆశిస్తున్నారు. ఇదిలా ఉండగా, కిశోర్ ఇప్పటికే రవితేజను కలిసి కథ కూడా చెప్పటం..
ఆయన ఓకే చేప్పటం కూడా అయిపోయిందట! ‘మాస్ జాతర’ రిలీజ్ తర్వాత వెంటనే డైరెక్టర్ కిశోర్ ఈ ప్రాజెక్టును పట్టాలెక్కిస్తారట. ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికరమైన విషయమేం టంటే.. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు చేస్తున్నారట. మాస్ హీరో, క్లాస్ డైరెక్టర్ కాంబో ఎలాంటి సినిమాను ఇవ్వబోతోందో చూడాలి.