న్యూఢిల్లీ: ఆల్టో కే10, ఎస్-ప్రెసో మోడళ్లలోని కొన్ని వేరియంట్ల ధరలను తగ్గించినట్లు మారుతీ సుజుకీ ఇండియా సోమవారం వెల్లడించింది. కొత్త ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని తెలిపింది. ఎస్-ప్రెసో ఎల్‌ఎక్స్‌ఐ పెట్రోల్ వేరియంట్ ధరను రూ.2,000 తగ్గించినట్లు మారుతీ సుజుకీ ఇండియా తెలిపింది. కే10 వీఎక్స్‌ఐ పెట్రోల్ వెర్షన్ ధరను రూ.6,500 తగ్గించినట్లు, రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది. ఆల్టో కే10 ధర రూ.3.99 లక్షల వద్ద ప్రారంభమై రూ.5.96 లక్షల వరకు ఉంది. ఎస్-ప్రెసో ధర రూ.4.26 లక్షల నుంచి రూ.6.11 లక్షల (ఎక్స్ షోరూం, ఢిల్లీ) మధ్య కొనసాగుతోంది. మారుతీ సుజుకీలో ఆల్టో, ఎస్-ప్రెసోతో కూడిన మినీ కార్ల సెగ్మెంట్ విక్రయాలు ఆగస్టులో 10,848 యూనిట్లుగా నమోదయ్యాయి. క్రితం ఏడాది ఈ సంఖ్య 12208గా ఉంది.