న్యూఢిల్లీ, డిసెంబర్ 6: తమ వాహన ధరల్ని జనవరి నుంచి పెంచుతున్నట్లు మారుతి సుజుకి ఇండియా, మహీంద్రా అండ్ మహీంద్రాలు శుక్రవారం ప్రకటించాయి. ముడి వ్యయాలు, రవాణా వ్యయాలు పెరగడం, కరెన్సీ మారకపు విలువ ప్రతికూలతల కారణంగా ఆయా మోడల్స్ ధరల్ని 4 శాతం వరకూ పెంచుతున్నట్లు మారుతి వెల్లడించింది.ఆల్టో హ్యాచ్‌బ్యాక్ నుంచి ఇన్విక్టో మల్టీయుటిలిటీ వాహనాల వరకూ పలు మోడల్స్‌ను దేశీయ మార్కెట్లో మారుతి సుజుకి విక్రయిస్తున్నది.
కమోడిటీల ధరలు పెరగడం, ద్రవ్యోల్బణం గరిష్ఠస్థాయిలో ఉన్నందున పెరిగిన ముడి వ్యయాలు సర్దుబాటు చేసుకునేందుకు తమ ఎస్‌యూవీలు, వాణిజ్య వాహనాల ధరల్ని జనవరి నుంచి 3 శాతం అధికం చేస్తున్నట్లు మహీంద్రా తెలిపింది. ఇదేరీతిలో జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ కూడా ధరల పెంపును ప్రకటించింది. తమ అన్ని మోడల్స్ ధరల్ని వచ్చే నెల నుంచి 3 శాతం పెంచుతున్నట్లు తెలిపింది.