calender_icon.png 19 April, 2025 | 12:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రానికి ‘మారుబెనీ’

18-04-2025 12:40:21 AM

జపాన్ పర్యటనలో తొలిరోజే రూ. 1,000 కోట్ల పెట్టుబడి ఒప్పందం

  1. జపాన్ దిగ్గజ కంపెనీ ప్రతినిధులతో సీఎం రేవంత్‌రెడ్డి చర్చలు సఫలం
  2. ఫ్యూచర్ సిటీలో దశలవారీగా 600 ఎకరాల్లో ఏర్పాటు
  3. తెలంగాణ ప్రాజెక్టులకు ఆర్థిక సాయం చేయాలని ‘జైకా’తో చర్చలు
  4. సోనీ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించిన సీఎం బృందం
  5. హైదరాబాద్‌లో యానిమేషన్, వీఎఫ్‌ఎక్స్, గేమింగ్ అవకాశాలపై వివరణ

హైదరాబాద్, ఏప్రిల్ 17 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బృందం జపాన్ పర్యటనలో తొలిరో జే కీలకమైన పెట్టుబడుల ఒప్పందం కుదుర్చుకుంది. జపాన్‌కు చెందిన వ్యాపార దిగ్గజం మారుబెనీ కంపెనీ తెలంగాణలో పెట్టుబడులకు ముందుకొచ్చింది. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో నెక్ట్స్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేసేందుకు మారుబేని కంపెనీ సంసిద్ధత తెలిపింది.

టోక్యోలో ఆ కంపెనీ ప్రతినిధులు గురు వారం సీఎం రేవంత్‌రెడ్డితో భేటీ అయ్యి ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలు, పెట్టుబడులపై చర్చించారు. దాదాపు రూ. 1,000కోట్ల ప్రారంభ పెట్టుబడితో మారుబెనీ కంపెనీ ఈ ప్రాజెక్టు చేపట్టనుంది.

దశలవారీగా ఫ్యూచర్ సిటీలో 600 ఎకరాల్లో ప్రపంచస్థాయి, నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్‌ను అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు తయారు చేసుకుంది. అందుకు సంబంధించిన లెటర్ ఆఫ్ ఇంటెంట్‌పై సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో ప్రభుత్వ అధికారులు, కంపెనీ ప్రతినిధులు సంతకాలు చేశారు. 

రూ.5వేల కోట్ల పెట్టుబడుల ఆకర్షణ..

జపాన్ కంపెనీలతో పాటు ఇతర మల్టీ నేషనల్ కంపెనీలు హైదరాబాద్‌లో తమ తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు వీలుగా ఈ ఇండస్ట్రియల్ పార్క్ అభివృద్ధి చేయనున్నారు. దీంతో దాదాపు రూ.5వేల కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించే అంచనాలున్నాయి. మారుబెనీ ఇండస్ట్రియల్ పార్క్ ప్రధానంగా ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఫార్మా, ప్రెసిషన్ ఇంజినీరింగ్, ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలపై దృష్టి సారిస్తుంది.

చర్చల సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో కొత్తగా అభివృద్ధి చేస్తున్న ఫ్యూచర్ సిటీలో అభివృద్ధి చేసే మొట్టమొదటి పార్కు ఇదేనని తెలిపారు. దీంతో తెలంగాణలో దాదాపు 30వేల ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి వస్తాయని, జీవనోపాధి మెరుగుపడుతుందని చెప్పారు.

అన్ని విధాలా సహకరిస్తాం..

తెలంగాణలో వ్యాపారానికి అనువైన అవకాశాలున్నాయని మారుబెనీకి ప్రభుత్వం తరఫున తగినంత మద్దతు ఉంటుందని సీఎం రేవంత్‌రెడ్డి భరోసా ఇచ్చారు. దేశంలోనే మొట్టమొదటి నెట్ జీరో సిటీగా ఫ్యూచర్ సిటీ అభివృద్ధి చెందుతుందని, అందులో మారుబెనీ పెట్టుబడులకు ముందుకురావటం సంతోషంగా ఉందన్నారు.

తెలంగాణ, హైదరాబాద్‌ను అభివృద్ధి చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ఎంచుకున్న దార్శనికతను మారుబెనీ నెక్స్ట్ జనరేషన్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దైసకాకురా అభినందించారు. మారుబెనీ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా 65 దేశాలలో 410లకు పైగా గ్రూప్ కంపెనీల ద్వారా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తోంది.

ఆహారం, వ్యవసాయ ఉత్పత్తులు, లోహాలు, గనులు, ఇంధనం, విద్యుత్, కెమికల్స్, మౌలిక సదుపాయాలు, ఫైనాన్స్ లీజింగ్, రియల్ ఎస్టేట్, ఏరోస్పేస్, మొబిలిటీ రంగాల్లో అగ్రగామిగా ఉంది. 

‘జైకా’తో సీఎం బృందం చర్చలు

రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మెట్రో రైల్ రెండోదశ, మూసీ పునరుజ్జీవనం, రీజినల్ రింగ్‌రోడ్డు నుంచి అవుటర్ రింగ్‌రోడ్డుకు అనుసంధానించే రేడియల్ రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆర్థిక సాయం అందించాలని సీఎం రేవంత్‌రెడ్డి బృందం జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ(జైకా)ను కోరింది.

రాష్ర్టంలో చేపడుతున్న పలు అభివృద్ధి పనులకు నిధులను సమీకరించేందుకు తెలంగాణ ప్రభుత్వం జైకాతో చర్చలు జరిపింది. సీఎం రేవంత్‌రెడ్డి సారథ్యంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం జైకా ఉన్నత యాజమాన్యంతో సమావేశమైంది. సీఎంతో పాటు ప్రభుత్వ ఉన్నతాధికారులు జైకా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ షోహెయ్ హరా, ఆ సంస్థ సీనియర్ మేనేజర్లు సమావేశంలో పాల్గొన్నారు.

హైదరాబాద్‌ను అత్యంత ఆకర్షణీయమైన నగరంగా అభివృద్ధి చేసేందుకు చేపట్టిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల గురించి సీఎం సమావేశంలో వివరించారు.  కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ర్ట ప్రభుత్వం సంయుక్తంగా రూ.24,269కోట్ల అంచనాలతో చేపట్టనున్న మెట్రో రైలు రెండో దశ ప్రతిపాదనలు ఇప్పటికే కేంద్రం తుది పరిశీలనలో ఉన్నాయని చెప్పారు. ఈ ప్రాజెక్టుకు అవసరమమ్యే వ్యయంలో 48 శాతం..

అంటే రూ.11,693 కోట్లు రుణం అందించి మద్దతు ఇవ్వాలని కోరారు. హైదరాబాద్ నగరాన్ని న్యూయార్క్, టోక్యోలాంటి ప్రపంచ నగరాలతో సమానంగా అభివృద్ధి చేయాలనే తన ఆలోచనలను సీఎం రేవంత్‌రెడ్డి వారితో పంచుకున్నారు. జైకాకు, తెలంగాణతో ఏండ్లుగా సంబంధాలున్నాయని జైకా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ షోహెయ్ హరా అన్నారు.

మెట్రో రైలు విస్తరణతో పాటు, అర్హతలున్న ఇతర అభివృద్ధి ప్రాజెక్టులకు జైకా నుంచి ఆర్థిక సాయం పొందేందుకు కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలని సీఎం రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. సమావేశంలో రాష్ర్ట పరిశ్రమలు, ఐటీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, సీఎం ముఖ్య కార్యదర్శి వీ శేషాద్రి, మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, హెచ్‌ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, తెలంగాణకు చెందిన ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

సోనీ ప్రధాన కార్యాలయం సందర్శన

సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం జపాన్‌లోని సోనీ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించింది. సోనీ కంపెనీకి చెందిన యానిమేషన్ అనుబంధ సంస్థ క్రంచైరోల్ బృందంతో సమావేశమైంది. సోనీ కార్పొరేషన్ తయారుచేస్తున్న కొత్త ఉత్పత్తులు, చేపడుతున్న కొత్త కార్యక్రమాలను ఆ కంపెనీ ప్రతినిధులు ప్రదర్శించారు. ఉత్పత్తులతో పాటు వారి పనితీరును సీఎంకు వివరించారు.

యానిమేషన్, వీఎఫ్‌ఎక్స్, గేమింగ్ రంగాల్లో హైదరాబాద్‌లో ఉన్న అవకాశాలు, అనుకూలతలను తెలంగాణ బృందం కంపెనీ ప్రతినిధులకు వివరించింది. ఎండ్ -టు -ఎండ్ ప్రొడక్షన్ సామర్థ్యాన్ని కలిగి ఉండే అత్యాధునిక ఫిల్మ్‌సిటీ ఏర్పాటు చేయాలనే సీఎం రేవంత్‌రెడ్డి తన భవిష్యత్తు విజన్‌ను వారితో పంచుకున్నారు.