నటి కీర్తి సురేష్ పెళ్లి వార్తలు గతంలో చాలా వచ్చాయి. ఈ క్రమంలోనే నాన్నా పులి మాదిరిగా ఈసారి వచ్చిన వార్తలను కూడా ఎవరూ అంతగా పట్టించుకోలేదు. కానీ ఈసారి వచ్చిన వార్త మాత్రం నిజమే. వరుడి ఫోటోలతో సహా బయటకు రావడంతో సందేహించాల్సిన అవసరం లేకుండా పోయింది. తన బాయ్‌ఫ్రెండ్ ఆంటోని తట్టిల్‌తోనే కీర్తి పెళ్లి పీటలు ఎక్కనున్నారు.
డిసెంబర్‌లో గోవాలో వీరిద్దరి వివాహం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఇరు కుటుంబాల వారు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. కీర్తి, ఆంటోనీలది 14 ఏళ్ల ప్రేమట. స్కూల్ డేస్ నుంచి వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్టు సమాచారం. ఆంటోని వచ్చేసి దుబాయ్‌లో వ్యాపార రంగంలో రాణిస్తున్నారు. అలాగే తన స్వస్థలమైన కొచ్చిలో రిసార్ట్స్ నడుపుతున్నారు.
ఇవి మాత్రమే కాకుండా కీర్తి పేరు మీద కూడా ఆమె స్వస్థలమైన చెన్నైలో కొన్ని బిజినెస్‌లు నిర్వహిస్తున్నారు. కీర్తితో కలిసి ఆంటోని పెద్దగా ఎప్పుడూ మీడియా ముందుకు వచ్చింది లేదు. కీర్తి, ఆంటోని టీనేజర్స్‌గా ఉన్నప్పుడే అంటే 15 ఏళ్ల వయసులోనే కనెక్ట్ అయ్యారట. కానీ ఇన్నేళ్లు ఎక్కడా మీడియాకు కానీ, సోషల్ మీడియాకు కానీ దొరక్కుండా జాగ్రత్తపడ్డారు.
వీరిద్దరూ 2008లో డేటింగ్ స్టార్ట్ చేశారట. డిసెంబర్ 11న కానీ 12న కానీ వీరి వివాహం గోవాలో జరగనుందట. ఎలాంటి హంగామా లేకుండా చిన్న ప్రైవేట్ ఈవెంట్ మాదిరిగా వీరి వివాహం జరగనుందట. ఇరు కుటుంబాల వారితో పాటు కొందరు అతిథులను మాత్రమే ఈ వివాహానికి ఆహ్వానించనున్నారట. ప్రస్తుతం కీర్తి ‘బేబీ జాన్’ మూవీతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు.