- వైభవంగా కొమురవెళ్లి మల్లన్న కల్యాణోత్సవం
- ప్రత్యేక పూజలు చేసిన ఎంపీ చామల, ఎమ్మెల్యే పల్లా
- భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో నిర్వాహకులు విఫలం!
చేర్యాల, డిసెంబర్ 29: రాష్ట్రంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన కొమురవెళ్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం స్వామివారి కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. కొరిన కోర్కెలు తీర్చె కొరమీసాల మల్లన్న కల్యాణానికి స్థానిక తోటబావి వేదికయ్యింది.
మల్లికార్జున స్వామి తరుఫున పడగాన్నగారి వంశస్తులు, వధువులు బలిజ మెడలమ్మ, గొల్ల కేతమ్మా తరుఫున మహాదేవ వంశస్తులు పెళ్లి పెద్దలుగా వ్యవహరించగా, వీరశైవ ఆగమశాస్త్రం ప్రకారం పురోహితులు కల్యాణం జరిపించారు. ఆలయ అర్చకులు పట్టు వస్త్రాలు, ముత్యాల తలాంబ్రాలను అందించారు.
కాశీ మహాపీఠం అధిపతి మల్లికార్జున విశ్వఆరాధ్య, శివాచార్యల పర్యవేక్షణలో వేడుకలు నిర్వహించారు. నందుల మఠం శశిభూషణ్ సిద్ధాంతి మల్లన్న కల్యాణ విశిష్టతను వివరించారు. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, భవనగిరి పార్లమెంట్ సభ్యులు చామాల కిరణ్ కుమార్ రెడ్డి, బీసీ కమిషన్ సభ్యురాలు బాలలక్ష్మి, జనగామ డీసీసీ అధ్యక్షులు కొమ్మురి ప్రతాప్ రెడ్డి వేడుకలలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
సౌకర్యాల కల్పనలో విఫలం..!
కొమురవెళ్లి ఆలయం వద్ద సాధారణంగా ప్రతి ఆదివారం భక్తుల రద్దీ ఉంటుంది. అలాంటిది బ్రహ్మోత్సవాలకు వేల సంఖ్యలో భక్తులు హాజరవుతారు కాబట్టి ప్రతియేట ఎల్‌ఈడీ స్క్రీన్స్ ఏర్పాటు చేసి మండపానికి దూరంగా ఉన్నవారికి కూడా కల్యాణం తిలకించే సౌకర్యాం కల్పిస్తారు. అయితే ఈసారి ఎల్‌ఈడీలు ఏర్పాటు చేయకపోవడంతో భక్తులకు కల్యాణం తీలకించేందుకు ఇబ్బంది పడ్డారు.
జోగినీలు పూలదండలు, తలాంబ్రాలు తీసుకుని కల్యాణ వేదికపైకి వేళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు జోగినీలకు మధ్య వాగ్వివాదం జరిగింది. నిర్వహకుల సూచన మేరకు జోగిని శ్యామల, క్రాంతిను మాత్రమే వేదికపైకి పంపించి తలాంబ్రాలు, పూలదండలు అందజేశారు. ఇలా ప్రతిచోట భక్తులకు అసౌకర్యాల నడుమే కల్యాణ ఘట్టాన్ని ముగించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.