calender_icon.png 27 December, 2024 | 6:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ర్టంకోసం మళ్లీ పెళ్లి!

01-08-2024 12:00:00 AM

తెలంగాణ ఉద్యమంలో భాగంగా 2011లో హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌కు లక్షలాది ప్రజలను కదిలించి నిర్వహించిన మిలియన్ మార్చ్ చరిత్రలో చిరస్మరణీయంగా నిలుస్తుంది. ఈ మిలియన్ మార్చ్‌లో పాల్గొనకుండా పోలీసులు ట్యాంక్‌బండ్‌పై బారికేడ్లను, ముళ్లకంచెలను ఏర్పాటు చేసి, కట్టుదిట్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. దాన్ని దాటుకుని ఎలాగైనా మిలియన్ మార్చ్ నిర్వహించాలని జేఏసీ నిర్ణయం తీసుకుని, ఓ దంపతులకు మళ్లీ పెళ్లి చేశారు. తెలంగాణ ఉద్యమం కోసం మళ్లీ పెళ్లి చేసుకున్న ఆ జంట.. మిలియన్ మార్చ్ విజయవంతం కావడానికి దోహదం చేసింది.

ప్రత్యేక తెలంగాణ ఉద్యమం యావత్తు ప్రపంచ ప్రజల మద్దతును కూడగట్టుకుంది. అనేక పోరాట రూపాలు, త్యాగాలు, బలిదానాలు కలగలిపితేనే స్వరాష్ట్రం సిద్ధించింది. తెలంగాణ ఉద్యమానికి ఊతమిచ్చిన ఘటనలు, సంఘటనలు అనేకం. తరతరాలుగా ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను పాలకుల ముందు వ్యక్తం చేస్తున్నా.. కొన్ని అదృశ్య శక్తులు తెలంగాణ ప్రజల ఆశలపై నీళ్లు చల్లిన సందర్భాలు కోకొల్లలు. ఈ సందర్భాల్లోనే పాలకుల వ్యవహార శైలిపై ఉద్యమకారులు, ప్రజలు అనేక కోణాల్లో తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. 2009లో అమరుడు శ్రీకాంతాచారి మొదలుకొని వేణుగోపాల్‌రెడ్డి, సిరిపురం యాదయ్య, పోలీస్ కానిస్టేబుల్ కిష్టయ్య వంటి ఎంతోమంది ఆత్మ బలిదానం చేశారు. ఈ నేపథ్యంలో బలిదానాలు చేసుకోవద్దంటూ ఉద్యమ సమయంలో జేఏసీ నాయకత్వం ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేసింది. 

ఆకాంక్షలను బలంగా రగిల్చేందుకు

1969లో విద్యార్థి ఉద్యమం ఉవెత్తున ఎగిసిపడి 369 మంది పోలీసు తూటాలకు బలయ్యారు. ఆ తర్వాత పలువురు ఉద్యమకారులు తెలంగాణ ఆకాంక్షకు వివిధ రూపాల్లో జీవం పోస్తూనే వచ్చారు. 2009 నవంబరు 29 కేసీఆర్ ఆమరణ దీక్షకు బయలుదేరిన సమయంలో జరిగిన అరెస్టుల నిరసనలు రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేశాయి. తెలంగాణ ఉద్యమం ఎంత ఎత్తుకు ఎగిసిపడుతున్నా ఆ ఉద్యమ వేడిని పాలకులు చల్లార్చుతూనే వచ్చారు. ఈ వేడి రాష్ట్రం వచ్చేదాకా రగలాలే గానీ, ఏమాత్రం చల్లారకూడదంటూ, ఈ ఉద్యమానికి తన చావుతో అయినా జీవం పోయాలని భావించిన శ్రీకాంతాచారి ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని 2009 డిసెంబరు 3న అమరజీవి అయ్యాడు.

యావత్తు తెలంగాణ అగ్గిలా భగ్గుమనడంతో 2009 డిసెంబరు 9న ప్రత్యేక రాష్ట్ర ప్రక్రియను ప్రారంభిస్తున్నాం అంటూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రెండు వారాలు తిరక్కముందే ఆంధ్రా పాలకుల లాబీయింగ్ రీత్యా ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను వెనక్కు తీసకుంటున్నట్టు డిసెంబరు 23న మరో ప్రకటన చేసింది. ఆ తర్వాత రెండేళ్ల పాటు ధర్నాలు, సభలు, సమావేశాలు, రైల్‌రోఖోలు, రహదారుల బంద్, వంటా వార్పు వంటి నిరసన కార్యక్రమాలతో జేఏసీ ఉద్యమాన్ని కొనసాగించింది. 

బారికేడ్లను బద్దలు కొట్టి ట్యాంక్‌బండ్‌కు

కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రజల ఆకాంక్షను బలంగా చాటి చెప్పాలని భావించిన జేఏసీ మరో కార్యచరణకు శ్రీకారం చుట్టాలని భావించింది. 2011 మార్చి 10న యావత్తు తెలంగాణ ప్రజలు ట్యాంక్‌బండ్‌కు తరలిరావాలని జేఏసీ పిలుపునిచ్చింది. జేఏసీ తలపెట్టిన మిలియన్ మార్చ్ నిర్వహణకు పెట్టుకున్న దరఖాస్తును ప్రభుత్వం తిరస్కరించినా మార్చి 10న ట్యాంక్‌బండ్‌పై కలుసుకుందాం అంటూ జేఏసీ ప్రజలకు సందేశాన్ని అందించింది. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం కూడా అంతే సీరియస్‌గా తీసుకుంది.

ఫలితంగా హైదరాబాద్ నగరంలో ఎటు చూసినా పోలీసు బలగాలు పహారాతో నిండిపోయాయి. బారీకేడ్లు, ముళ్ల కంచెలతో ట్యాంక్‌బండ్‌కు వచ్చే దారులన్నీ మూసేశారు. జేఏసీ చెప్పిన టైం దగ్గర పడుతుండటంతో ఏం జరుగుతుందోనంటూ ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణ ప్రజలు టీవీలకు అతుక్కుపోయి కూర్చున్నారు. సరిగ్గా అనుకున్న సమయానికి జేఏసీ పిలుపు మేరకు వేలాదిమంది ఉద్యమకారులు తండోపతండాలుగా ట్యాంక్‌బండ్‌కు చేరుకున్నారు. బారికేడ్లను బద్దలు కొట్టి, ముళ్ల కంచెలను దాటుకుంటూ నాలుగు కోట్ల ప్రజల హృదయాల్లో జీవనదిలా ప్రవహిస్తున్న జైతెలంగాణ నినాదాన్ని ఆకాశమే హద్దుగా ఈ విశ్వానికి గొంతెత్తి చాటిచెప్పారు. 

ఆంజనేయులు, రజిత దంపతుల సాహసం

మిలియన్ మార్చ్ సందర్భంగా హైదరాబాద్ నగర వ్యాప్తంగా పోలీసు పహారా. అయినా వేలమంది ఉద్యమకారులు ట్యాంక్‌బండ్ పైకి ఎలా వచ్చారనుకుంటున్నారా..? ఈ ఉద్యమాన్ని ఎలా నిర్వహించాలనే దానిపై జేఏసీ సుధీర్ఘంగా చర్చించి ఓ నిర్ణయానికి వచ్చింది. ట్యాంక్‌బండ్‌కు దగ్గరలోనే ఓ పెళ్లి వేడుకను నిర్వహించి ఉద్యమకారులంతా అక్కడికి చేరుకోవాలని తీర్మానం చేసింది. పెళ్లి కొడుకు, పెళ్లి కుమార్తెను చూసే బాధ్యతను జేఏసీ భాగస్వామ్య పక్షమైన న్యూడెమోక్రసీకి అప్పగించింది. విద్యానగర్‌లోని ఆ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆఫీస్ ఇన్‌చార్జిగా ఉన్న ఆంజనేయులుకు అప్పటికే పెళ్లయి రెండేళ్లు అయ్యింది.

విషయాన్ని పార్టీ నాయకత్వం ఆంజనేయులు దంపతులకు మార్చి 9వ తేదీ రాత్రి చెప్పారు. ఉద్యమాలు తెలిసిన వారు కావడంతో తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రత్యక్షంగా భాగస్వాములు అవుతున్నందుకు వారు కూడా సంతోషం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ట్యాంక్‌బండ్ సమీపంలోని రాణిగంజ్ ఆర్యసమాజ్ వాళ్లకు సమాచారం అందించారు. 2011 మార్చి 10న ఆర్య సమాజ్‌లో ఆంజనేయులు, రజిత దంపతులకు హిందూ సాంప్రదాయం ప్రకారం మళ్లీ పెళ్లి చేశారు. పెళ్లికాగానే అక్కడికొచ్చిన ఉద్యమకారులంతా ఒక్కసారిగా ట్యాంక్‌బండ్ వైపు పరుగెత్తారు. నిమిషాల వ్యవధిలోనే ట్యాంక్‌బండ్‌ను తమ చేతుల్లోకి తీసుకున్నారు. ఇటు పోలీసులు, అటు ప్రభుత్వం ఒక్కసారిగా నివ్వెరపోవాల్సి వచ్చింది. 

 వీ గోపాలరావు

 హైదరాబాద్ సిటీబ్యూరో, విజయక్రాంతి

ఉద్యమకారులుగా గుర్తించాలి: మాదాసు ఆంజనేయులు, రజిత 

మాది(ఆంజనేయులు) పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం యకలాస్‌పూర్ గ్రామం. మొదట్నుంచి న్యూడెమోక్రసీ పార్టీ కార్యకర్తగా పనిచేశాను. 2009 జూన్‌లో రజితతో వివాహమైంది. అనంతరం పార్టీ ఆదేశాల మేరకు హైదరాబాద్ విద్యానగర్‌లోని ప్రధాన కార్యాలయ వ్యవహారాలు చూశాను. ఆ సమయంలో పార్టీ ఆదేశాలు, తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణంగా మరోసారి పెళ్లి చేసుకోవడానికి అంగీకరించాం. మిలియన్ మార్చ్ నేపథ్యంలో పోలీసులు మాపై కేసులు నమోదు చేశారు. అయినా కూడా తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములైనందుకు సంతోషపడ్డాం. కానీ, ప్రత్యేక తెలంగాణలో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం మమ్మల్ని ఉద్యమకారులుగా గుర్తించలేదు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వమైనా మమ్మల్ని ఉద్యమకారులుగా గుర్తించాలి. ఉద్యమకారులకు ఇచ్చే ప్రభుత్వ పథకాలలో మాకు అవకాశాలు కల్పించాలి.