25-02-2025 07:28:28 PM
కొండపాక: భక్తి భావం పెంపొందించడంతో పాటు ఆధ్యాత్మిక కేంద్రంగా మర్పడగ క్షేత్రం విరాజిల్లుతుందని సిద్దిపేట జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కొండపాక మండలం మర్పడగ విజయదుర్గ సమేత క్షేత్రంలో కృష్ణంవందే జగద్గురుమ్, రామం భజే శ్యామలం సంస్థల ఆధ్వర్యంలో విబంధ సంసర్గ మర్పడగ విజయదుర్గ అనే పుస్తకాన్ని సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ అశ్రుత్ కుమార్ తో కలిసి పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... విజయ దుర్గ మాత అనుగ్రహం సాధించాలంటే మనోభావాలతో స్తుతించాలన్నారు.
సకల భక్తుల మనోభీష్టాన్ని నెరవేర్చే విజయదుర్గ మాతను భక్తిశ్రద్ధలతో కొలిచే అవకాశం దొరకడం ఈ ప్రాంత వాసులు అదృష్టమన్నారు. తెలుగు పండితుల కోసం క్షేత్ర నిర్వాహకుల డాక్టర్ చెప్పెల హరినాధ శర్మ సూచనలతో ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని విద్యాశాఖ పక్షాన త్వరలో నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సంగీతం నరసింహారావు మంచినీళ్ల సరస్వతి, ఉండ్రాళ్ళ రాజేశం ఉపాధ్యాయులు కవులు పుస్తక రచయితలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్, డిఈఓ ను ఘనంగా సత్కరించారు.