calender_icon.png 22 October, 2024 | 9:11 PM

లాభాలలోనే మార్కెట్లు

16-07-2024 01:14:39 AM

24,600 మార్కు చేరువలో నిఫ్టీ

ముంబయి: దేశీయ మార్కెట్లువరుసగా రెండో సెషన్లో లాభాలను దక్కించుకున్నాయి. విదేశీ మదుపర్ల పెట్టుబడులు, దిగ్గజ రంగాల షేర్లలో కొనుగోళ్లతో సోమవారం నాటి ట్రేడింగ్ ఆద్యంతం సూచీలు లాభాల్లోనే కదలాడాయి. అయితే, త్రైమాసిక ఫలితాల సీజను మొదలు కావడంతో పాటు టోకు ద్రవ్యోల్బణ గణాంకాలపై దృష్టి పెట్టిన మదుపర్లు కొంత అప్రమత్తత పాటించారు. దీంతో సూచీలు స్వల్ప లాభాలకే పరిమితమయ్యాయి. నేటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 145 పాయింట్లు లాభపడగా,నిఫ్టీ  24,600 మార్కుకు చేరువైంది.కొనుగోళ్ల అండతో  ఉదయం సెన్సెక్స్ ఉత్సాహంగా ప్రారంభమైంది.

ఒక దశలో దాదాపు 300 పాయింట్లకు పైగా లాభపడి ఇంట్రాడేలో 80,862 కొత్త జీవనకాల గరిష్ఠాన్ని తాకింది. అయితే ఆ తర్వాత మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో రికార్డుల నుంచి వెనక్కి వచ్చిన సూచీ చివరకు 145.52 పాయింట్ల లాభంతో 80,664.86 వద్ద ముగిసింది. అటు నిఫ్టీ 84.50 పాయింట్లు లాభపడి 24,586.70 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 9 పైసలు తగ్గి 83.60గా ముగిసింది. ఐటీ మినహా దాదాపు అన్ని రంగాల షేర్లు రాణించాయి. నిఫ్టీలో ఓఎన్జీసీ, శ్రీరామ్ ఫైనాన్స్, ఎస్బీఐ లైఫ్ ఇన్స్యూరెన్స్, బజాజ్ ఆటో, ఎస్బీఐ షేర్లు లాభపడగా.. ఎల్టీఐ మైండ్‌‌‌రరటీ, ఏషియన్ పెయింట్స్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, టాటా స్టీల్, యాకిస్స్ బ్యాంక్ షేర్లు నష్టపోయాయి.