జీవితకాల గరిష్ఠాలకు సూచీలు
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. మారుతీ సుజుకీ, భారతీ ఎయిర్‌టెల్ వంటి షేర్ల అండతో సరికొత్త గరిష్ఠాల వద్ద స్థిరపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలూ కలిసొచ్చాయి. బ్యాంక్ ఆఫ్ జపాన్ వడ్డీ రేట్లను పెంచగా... అమెరికా ఫెడ్ నిర్ణయాలు బుధవారం రాత్రికి వెలువడనున్నాయి. సెన్సెక్స్ ఉదయం 81,655.90 పాయింట్ల వద్ద లాభాల్లో (క్రితం ముగింపు 81,455.40) ప్రారంభమై రోజంతా లాబాల్లోనే కొనసాగింది. ఇంట్రాడేలో 81,828.04 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకిన సూచీ.. చివరికి 285.94 పాయింట్ల లాభంతో 81,741.34 వద్ద ముగిసింది.
నిఫ్టీ 93.85 పాయింట్ల లాభంతో 24,95115 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.76గా ఉంది. సెన్సెక్స్ 30 సూచీలో జేఎస్ డబ్ల్యూ స్టీల్, ఏషియన్ పెయింట్స్, మారుతీ సుజుకీ, ఎన్టీపీసీ, భారతీ ఎయిర్‌టెల్ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. రిలయన్స్, టాటా మోటార్స్, ఇన్ఫోసిస్, మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్ షేర్లు నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 80.43 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. బంగారం ధర మళ్లీ పుంజుకుని ఔన్సు 2466 డాలర్ల స్థాయికి చేరింది.