calender_icon.png 22 February, 2025 | 2:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మార్కెట్లకు సెగలు

12-02-2025 12:00:00 AM

దేశీయ స్టాక్ మార్కెట్లు గత కొంత కాలంగా కుప్పకూలుతున్నాయి. ఫలితంగా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వారు భారీగా నష్టపోతున్నారు. గత అయిదు రోజుల వరస పతనాలతో మదుపరులు దాదాపు 25 లక్షలకోట్లు నష్టపోయినట్లు మార్కెట్ వర్గాల అంచనా. నిజానికి గత జూన్‌నుంచి స్టాక్ మార్కెట్లకు స్వర్ణయుగంగా సాగింది.లోక్‌సభ ఎన్నికల్లో మోదీ మరోసారి విజయం సాధిస్తారన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాతో గత జూన్‌లో స్టాక్‌మార్కెట్లు భారీగాపెరిగాయి.

అప్పటినుంచి వంద రోజుల మోదీ పాలనలో మార్కెట్లు పట్టిందల్లా బంగారం అయింది. వంద రోజుల్లో సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు దాదాపు 9 శాతం పెరిగాయి. సెప్టెంబర్ 18న సెన్సెక్స్ ఏకంగా 6,500 పాయిట్లు పెరిగి 82, 948పాయిట్ల రికార్డు స్థాయికి చేరింది. ఇదే సమయంలో నిఫ్టీ సైతం 25,377 పాయింట్లకు పెరిగింది. అయితే అప్పటినుంచి మార్కెట్లకు కష్టాలు మొదలయ్యాయి. అమె రికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పావుశాతం పెంచిన కారణంగా విదేశీ మదుపరులు భారతీయ స్టాక్ మార్కెట్లనుంచి పెట్టుబడులు ఉపసంహరించడం మొదలుపెట్టారు.

ముఖ్యంగా గత డిసెంబర్‌నుంచి ఇప్పటిదాకా స్టాక్ మార్కెట్లు  దాదాపు 11 శాతం నష్టపోయాయి. ప్రధాన సూచీలయిన సెన్సెక్స్, నిఫ్టీలకే ఈ పతనం పరిమితం కాలేదు. దీనికి మార్కెట్ వర్గాలు రకరకాల కారణాలు చెబుతున్నాయి. గత రెండు నెలల కాలంలో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు దేశీయ మార్కెట్‌నుంచి దాదాపు రూ.2.5 లక్షల కోట్లు ఉపసంహరించుకున్నారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విజయం ప్రభావం మార్కెట్‌పై బలంగా ఉంది.

డాలరుతో రూపాయి విలువ రికార్డుస్థాయికి పతనం కావడం, టారిఫ్‌ల భయం ఇవన్నీ మార్కెట్ల భారీ పతనానికి కారణమయ్యాయి. ట్రంప్ మొదటినుంచి భారత్ సహా అన్ని దేశాలపైనా టారిఫ్‌లు విధిస్తామని చెబుతున్న విషయం తెలిసిందే. దీంతో ఇప్పుడు మధ్యతరగతి ప్రజలు మార్కెట్ల వైపు చూడడానికే భయపడుతున్నారు. అంతేకాకుండా త్రైమాసిక ఫలితాలు మార్కెట్ వర్గాలను మెప్పించక పోవడం కూడా మరో కారణం.

రూపాయి పతనం మరింతగా కొనసాగుతుందన్న అంచనాలు కూడా మార్కెట్ వర్గాలో భయాలకు కారణమవుతోంది.ఈ పతనం ఇక్కడితో ఆగుతుందా? లేక మరికొంత కాలం కొనసాగుతుందా అనేది వేచి చూడాలని మార్కెట్ నిపుణులు అంటున్నా రు. అప్పటిదాకా హెవీవెయిట్ షేర్లలో పెట్టుబడులకు దూరంగా ఉండడం మంచిదని కూడా వారు సలహా ఇస్తున్నారు.

గతంలో కొన్నివర్గాలు మాత్రమే స్టాక్ మార్కెట్లో పెట్టబడులు పెట్టేవి. అయితే టెక్నాలజీ కారణంగా ఇప్పడు మధ్యతరగతి వారు కూడా సులభంగా పెట్టుబడులు పెడుతున్నారు. ఫలితంగా స్టాక్ మార్కెట్ల పరిధి విస్తృతమైంది. మరోవైపు భారతీయ స్టాక్ మార్కెట్లు పెట్టుబడులకు అనుకూలంగా ఉండడంతో విదేశీ సంస్థాగత మదుపరులు సైతం కూడా ఇక్కడి మార్కెట్లలో భారీగా పెట్టుబడులు పెట్టసాగారు. దీంతో మార్కెట్లు ఎవరూ ఊహించని విధంగా రికార్డు గరిష్ఠాలకు చేరాయి.

ఇక అంతా మంచి కాలమేనని మదుపరులు సంతోషపడ్డారు. అయితే స్టాక్ మార్కెట్లు అంతర్జాతీ య పరిణామాలకు అనుగుణంగా స్పందిస్తుంటాయి. ఓవైపు రష్యా ఉక్రెయిన్ యుద్ధం, మరోవైపు గాజా సంక్షోభం లాంటి పరిణామాలు కూడా మార్కెట్లపై కొంత మేరకు ప్రభావం చూపించాయి. అయితే స్టాక్ మార్కెట్లకు ఉత్థాన పతనాలు కొత్తేమీ కాదు. గతంలో హర్షద్ మెహతా, కేతన్ పరేఖ్ కుంభకోణం సమయంలో మార్కెట్లు భారీగా పతనమైనాయి.

అలాగే 2004లో ఎవరూ ఊహించని విధంగా యుపీఏ కూటమి లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించిన రోజయితే మార్కెట్లు దాదాపు 15 శాతం పతనమైనాయి. వీటన్నిటినీ తట్టుకుని నిలబడగలిగే శక్తి మన ఆర్థిక వ్యవస్థకు ఉంది. అందువల్ల ఈ పతనం తాత్కాలికం మాత్రమేనని, మార్కె ట్లు తిరిగి పూర్వ వైభవాన్ని సంతరించకుంటాయన్న ధీమా మార్కెట్ వర్గాల్లో కనిపిస్తోంది.అప్పటివరకు ఆచితూచి పెట్టుబడులు పెట్టాలని, భారీగా పెట్టుబడి పెట్టి చేతులు కాల్చుకోవడం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.