గజ్వేల్ (విజయక్రాంతి): గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని సెయింట్ మేరీస్ పాఠశాలలో బుధవారం ప్రీ ప్రైమరీ విద్యార్థులతో రైతు బజార్ పై మార్కెటింగ్ మేళా నిర్వహించారు. విద్యార్థులు రైతు బజార్లో అమ్మడానికి పండ్లు, కూరగాయలు, స్వీట్స్, గాజులు, చెప్పులు, బేకరీలో లభించే ఆహార పదార్థాలు, పానీ పూరి, అల్లిన బుట్టలు, పప్పు దినుసులు, మొక్కజొన్న కంకులు, కిరాణా సామాగ్రి, స్టేషనరీ విక్రయాలు వివిధ వస్తువులతో భారీ మార్కెట్ మేళాను నిర్వహించారు. ఈ బజారులో విద్యార్థులు ఉపాధ్యాయులు తమకు అవసరమైన కూరగాయలను సరుకులను, డబ్బులు చెల్లించి కొనుగోలు చేశారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ కాటారాయప్ప మాట్లాడుతూ.. తినే ఆహార పదార్థాలను, రైతులు ఏ విధంగా పండించి మార్కెట్లో అమ్మడం జరుగుతుందో విద్యార్థులకు ప్రత్యక్ష రూపంగా వివరించడంతో పాటు నిత్యజీవితంలో ప్రజలందరికీ అవసరమగు ఆహార పదార్థాలు ధరించే వస్తువులు, శుభకార్యాలకు వినియోగించే ఆహార పదార్థాలు మార్కెట్లో ఏ విధంగా అమ్మకం కొనుగోలు చేస్తారో విద్యార్థులకు ఉపాధ్యాయులు తెలియజేశారు.
ఇలాంటి కార్యక్రమాల వల్ల రైతులు వారు పడుతున్న కష్టాన్ని పండిస్తున్న పంటలను అమ్మకంలో ఎదురవుతున్న ఇబ్బందులను విద్యార్థులకు తెలియజేస్తూ చిన్ననాటి నుండి అమ్మకం కొనుగోళ్ల పట్ల అవగాహన కలిగి ఉండడమే కాకుండా అవి ఎక్కడి నుండి లభిస్తున్నాయి. పండించే వారెవరు అమ్మేవారెవరు అనే విషయాలు విద్యార్థులకు అవగాహన కలుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ గోపు ఇన్నారెడ్డి, పాఠశాల డైరెక్టర్ థామస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.