సెన్సెక్స్ 1,000 పాయింట్ల పతనం
- నాలుగు నెలల కనిష్ఠస్థాయికి సూచీలు
- బ్యాంకింగ్,ఆటో షేర్లలో ఎడతెగని అమ్మకాలు
ముంబై, నవంబర్ 13: భారత్ స్టాక్ మార్కెట్‌ను బేర్స్ స్వాధీనంలోకి తీసుకున్నారు. ఎడాపెడా అమ్మకాలకు పాల్పడటం తో స్టాక్ సూచీలు నిలువునా కుప్పకూలా యి. నాలుగు నెలల కనిష్ఠస్థాయికి పడిపోయాయి. ప్రతికూల గ్లోబల్ సంకేతాలతో పాటు విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు వేగవంతంకావడంతో బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్ మరో భారీ పతనాన్ని చవిచూసింది.
ఇంట్రాడేలో 1,142 పాయింట్ల వర కూ పడిపోయిన బీఎస్‌ఈ సెన్సెక్స్ 77,533 పాయింట్ల కనిష్ఠస్థాయిని తాకింది. చివరకు 984 పాయింట్ల నష్టంతో 77,690 పాయిం ట్ల వద్ద నిలిచింది. ఇదేబాటలో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఇంట్రాడేలో 350 పాయింట్లకుపైగా పతనమై 23,509 పాయింట్ల కనిష్ఠస్థాయిని తాకిన అనంతరం 324 పాయింట్ల క్షీణతతో కీలకమైన 23,559 పాయింట్ల వద్ద ముగిసింది.
ఈ ఏడాది జూన్ తర్వాత ఈ స్థాయికి సూచి తగ్గడం ఇదే ప్రధమం. నిఫ్టీకి సాంకేతికంగా అత్యంత కీలకమైన 23,800 స్థాయిని బేర్స్‌కు బుల్ప్ అప్పగించి పరారయ్యారు. స్టాక్ సూచీలు క్షీణించడం వరుసగా ఇది ఐదవ రోజు.
రిటైల్ ద్రవ్యోల్బణం అక్టోబర్ నెలలో 14 నెలల గరిష్ఠస్థాయి 6.21 శాతానికి పెరిగిన నేపథ్యంలో వడ్డీ రేట్లతో ప్రభావితమయ్యే బ్యాంకింగ్, ఆటోమొబైల్ షేర్లను ఇన్వెస్టర్లు వదిలించుకున్నారని మార్కెట్ విశ్లేషకులు చెప్పారు. బీఎస్‌ఈలో ట్రేడయిన షేర్లలో 3,299 షేర్లు క్షీణించగా, 670 మాత్రమే గ్రీన్‌లో ముగిసాయి. ప్రత్యేకించి చిన్న షేర్లు విలవిలలాడాయి. ప్రధాన సూచీలకంటే అధికంగా మిడ్‌క్యాప్, స్మాల్ సూచీలు పతనమయ్యాయి.
ద్రవ్యోల్బణం దడ
రిటైల్ ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో 14 నెలల గరిష్ఠస్థాయి 6.21 శాతానికి చేరడంతో రిజర్వ్‌బ్యాంక్ ఇప్పట్లో వడ్డీ రేట్లు తగ్గించబోదన్న అంచనాలు మార్కెట్‌ను ఏ దశలోనూ కుదుటపడనివ్వలేదని విశ్లేషకులు చెప్పారు. కార్పొరేట్ల బలహీన ఆర్థిక ఫలితాలకు తోడు రిటైల్ ధరలు అంచనాల్ని మించి పెరగడంతో ఆర్బీఐ రేట్ల కోత ఆశలు అడుగంట డంతో మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతిన్నదని జియోజిత్ ఫైనాన్షి యల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు.
మరోవైపు విదేశీ ఫండ్స్ అమ్మకాల ఒత్తిడి దేశీయ స్టాక్ మార్కెట్‌ను ప్రభావితం చేస్తున్నదని, ‘ట్రంపోనోమిక్స్’ భయాలు ఇన్వెస్టర్లను వెంటాడుతున్నాయన్నారు. యూఎస్ చేపట్టే విధాన చర్యలు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై వాటి ప్రభావం సైతం ఇన్వెస్టర్లను ఆందోళనపరుస్తున్నదన్నారు. దీనితోనే డాలర్ ఇండెక్స్, బాండ్ ఈల్డ్స్ పెరుగుతూ వర్థమాన దేశాల ఈక్విటీ మార్కెట్ల పతనానికి దోహదపడుతున్నాయని నాయర్ వివరించారు.
ఎం అండ్ ఎం టాప్ లూజర్
సెన్సెక్స్ బాస్కెట్‌లో అన్నింటికంటే అధికంగా మహీంద్రా అండ్ మహీంద్రా 3.40 శాతం తగ్గింది. టాటా స్టీల్, అదానీ పోర్ట్స్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బజాజ్ ఫిన్‌సర్వ్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ షేర్లు 3.4 శాతం వరకూ నష్టపోయాయి.
మరోవైపు ఎన్టీపీసీ, టాటా మోటార్స్, హిందుస్థాన్ యూనీలివర్, ఏషియన్ పెయింట్స్, ఇన్ఫోసిస్ లు స్వల్పంగా లాభపడ్డాయి. వివిధ రంగాల సూచీల్లో అత్యధికంగా రియల్టీ ఇండెక్స్ 3.23 శాతం తగ్గింది. ఇండస్ట్రియల్స్ ఇండెక్స్ 2.95 శాతం,
క్యాపిటల్ గూడ్స్ ఇండెక్స్ 2.72 శాతం, సర్వీసెస్ ఇండెక్స్ 2.54 శాతం, కమోడిటీ ఇండెక్స్ 2.45 శాతం, మెటల్ ఇండెక్స్ 154 శాతం చొప్పున క్షీణించాయి. ఐటీ, రియల్టీ ఇండెక్స్‌లు గ్రీన్‌లో ముగిసాయి.బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 3.08 శాతం, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 2.56 శాతం చొప్పున తగ్గాయి.
విదేశీ ఫండ్స్ విక్రయాల జోరు
దేశీయ స్టాక్ మార్కెట్ నుంచి విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెసర్ల (ఎఫ్‌పీఐలు) నిధుల తరలింపు కొనసాగుతున్నది. బుధవారం విదేశీ ఫండ్స్ మరో రూ. 2,502 కోట్ల నికర విక్రయాలు జరిపినట్లు స్టాక్ ఎక్సేంజీల ప్రాధమిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
దీనితో ఈ వారం తొలి మూడు రోజుల్లో రూ. 7,500 కోట్లకుపైగా ఎఫ్‌పీఐలు వెనక్కు తీసుకున్నారు. గతవారం ఆరు ట్రేడింగ్ రోజుల్లో దేశీయ ఈక్విటీ మార్కెట్‌లో విదేశీ ఫండ్స్ విక్రయాలు రూ.22,500 కోట్లుగా నమోదయ్యాయి. బుధవారం దేశీయ సంస్థలు భారీగా రూ. 6,145 కోట్ల నికర పెట్టుబడులు చేసినప్పటికీ మార్కెట్ పతనాన్ని నిలువరించలేకపోయాయి.
కరిగిపోయిన రూ.13 లక్షల కోట్ల సంపద
వరుసగా మంగళ, బుధవారాల్లో జరిగిన మార్కెట్ పతనంతో రూ.13 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద తరిగి పోయింది. ఈ రెండు రోజుల్లో బీఎస్‌ఈ సెన్సెక్స్ 1,800 పాయింట్లు పడిపోయింది.
బుధవారం ఒక్కరోజులోనే రూ.8 లక్షల కోట్ల సంపదను ఇన్వెస్టర్లు నష్టపోయారు. తాజాగా ఇన్వెస్టర్ల సంపదగా వ్యవహరించే బీఎస్‌ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ రూ.13,07,898 కోట్లు తగ్గి రూ.4,29,46,189 కోట్లకు (5.09 ట్రిలియన్ డాలర్లు) పడిపోయింది.