calender_icon.png 17 January, 2025 | 3:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాజిటివ్ ట్రెండ్‌లో మార్కెట్

02-09-2024 12:00:00 AM

గ్లోబల్ సంకేతాలు, యూఎస్ డేటాపై ఇన్వెస్టర్ల దృష్టి

ఈ వారం మార్కెట్‌పై విశ్లేషకుల అంచనా

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1:  ఈ వారం స్టాక్ మార్కెట్ కదలికలకు గ్లోబల్ సంకేతాలు నిర్దేశిస్తాయని విశ్లేషకులు చెప్పారు. వడ్డీ రేట్ల తగ్గింపునకు సమయం వచ్చిందంటూ యూఎస్ ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పొవెల్ జాక్‌సన్‌హోల్  సింఫోజియంలో న స్పష్టమైన ప్రకటన చేయడం, అటుతర్వాత అమెరికా జీడీపీ పెరుగుదల, కొనుగోలు ద్రవ్యోల్బణం తగ్గుదల తదితర సానుకూల డేటాలు వెలువడినందున, ప్రపంచ మార్కెట్లు ఎగువముఖంగానే సాగుతాయని, అందుకు అనుగుణంగా దేశీయ సూచీలు కూడా పాజిటివ్ ట్రెండ్‌ను ప్రదర్శిస్తాయని విశ్లేషకులు తెలిపారు.

  గత వారం మొత్తంమీద సెన్సెక్స్ 1,279 పాయింట్లు పెరిగి 82,365 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 413 పాయింట్లు ర్యాలీ జరిపి 25,236 పాయింట్ల వద్ద నిలిచింది. ఈ రెండు సూచీలు సరికొత్త గరిష్ఠస్థాయిలకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో ఎంపికచేసిన షేర్ల సాయంతో మార్కెట్ మరింత పెరుగుతుందని తాము అంచనా వేస్తున్నట్టు మోతీలాల్ ఓస్వాల్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ్ ఖెమ్కా తెలిపారు.

జీడీపీ, ఆటో సేల్స్ గణాంకాల ప్రభావం

శుక్రవారం మార్కెట్ ముగిసిన తర్వాత వెల్లడైన భారత జీడీపీ డేటా, ఆదివారం వెలువడిన ఆటోమొబైల్ కంపెనీల అమ్మకాల గణాంకాలపై ఈ సోమవారం తొలుత మార్కెట్ స్పందిస్తుందని, అటుతర్వాత అంతర్జాతీయ ట్రెండ్‌కు అనుగుణంగా కదలవచ్చని విశ్లేషకులు చెపుతున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌జూన్ తొలి త్రైమాసికంలో జీడీజీ వృద్ధి రేటు 15 నెలల కనిష్ఠస్థాయి 6.7 శాతానికి తగ్గిన సంగతి తెలిసిందే. అయితే ఈ తగ్గుదల అంచనాల మేరకే ఉన్నందున, మార్కెట్లో నెగిటివ్ ప్రభావం ఉండకపోవచ్చని విశ్లేషకులు వివరించారు.    ఈ వారంలో వెల్లడయ్యే అంతర్జాతీయ ఆర్థిక గణాంకాలు దేశీయ ఈక్విటీలను నడిపిస్తాయని చెప్పారు.

విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐలు) ట్రేడింగ్ యాక్టివిటీ, డాలర్ మారకంలో రూపాయి విలువ, ప్రపంచ మార్కెట్లో క్రూడ్ ధర కదలికల్ని కూడా దేశీయ ఇన్వెస్టర్లు ట్రాక్ చేస్తారన్నారు.    వచ్చే ఫెడ్ కమిటీ మీటింగ్ సెప్టెంబర్ మధ్యలో జరగనున్నందున, రానున్న రోజుల్లో యూఎస్ నుంచి వెలువడే ఆర్థిక గణాంకాల్ని మార్కెట్ సునిశితంగా గమనిస్తుందని స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా తెలిపారు. యూఎస్ తయారీ పీఎంఐ, జాబ్స్ డేటా, నిరుద్యోగం రేటు ఈ వారం వెలువడతాయని, ఈ గణాంకాలు మార్కెట్ సెంటిమెంట్‌ను గణనీయంగా ప్రభావితం చేస్తాయన్నారు. అమ్మకాల అంకెలు వెలువడినందున ఆటోమొబైల్ షేర్లు సోమవారం వెలుగులో ఉంటాయని అంచనా వేశారు.

లాభాలు స్వీకరించే అవకాశం

అయితే గత 12 ట్రేడింగ్ సెషన్లుగా నిఫ్టీ అప్‌ట్రెండ్ సాగిస్తున్నందున లాభాల స్వీకరణ తలెత్తే అవకాశం ఉన్నదని మెహతా ఈక్విటీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ప్రశాంత్ తాప్సి తెలిపారు. 1996లో నిఫ్టీ ప్రారంభమైనప్పటి నుంచి ఎన్నడూలేని స్థాయిలో ఉత్తమ ర్యాలీ జరిపిందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ దీపక్ జసాని చెప్పారు. ధనిక దేశాల్లో ద్రవ్యోల్బణం తగ్గుతున్న సంకేతాలతో కేంద్ర బ్యాంక్‌లు వడ్డీ రేట్లలో కోత విధించే అవకాశం ఉన్నందున టెక్నాలజీ కంపెనీల భవిష్యత్ అవకాశాల పట్ల మార్కెట్లు ఆశావహంగా ఉన్నాయని, ఫలితంగా శుక్రవారం గ్లోబల్ షేర్లు ర్యాలీ జరిపాయని జసాని వివరించారు.