- 18న వెలువడనున్న వడ్డీ రేట్ల కోత నిర్ణయం
- ఈ వారం స్టాక్ సూచీల గమనంపై విశ్లేషకుల అంచనాలు
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15: కొద్ది నెలలుగా ప్రపంచ మార్కెట్లు, ఆర్థిక సంస్థలు, కార్పొరేట్లు ఎదురుచూస్తున్న తరుణం వచ్చేసింది. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో వడ్డీ రేట్ల దిశను నిర్దేశించే యూఎస్ ఫెడరల్ రిజర్వ్‌పై మార్కెట్లు దృష్టి నిలిపాయని విశ్లేషకులు తెలిపారు. ఫెడ్ పండ్స్ కమిటీ రెండు రోజుల సమావేశం సెప్టెంబర్ 17న మొదలవుతుంది. వడ్డీ రేట్లపై కమిటీ నిర్ణయాన్ని సెప్టెంబర్ 18న ఫెడ్ చైర్మన్ జెరోమ్ పొవెల్ వెల్లడిస్తారు. తమ సెప్టెంబర్ సమీక్షలో రేట్లను తగ్గించనున్నట్లు ఇప్పటికే పొవెల్ సూచనాప్రాయంగా వెల్లడించారు.
గత కొద్ది రోజులుగా వెలువడిన యూఎస్ జాబ్స్ డేటా, రిటైల్ సేల్స్, ఇన్‌ఫ్లేషన్ తదితర గణాంకాలతో ఫెడ్ వడ్డీ రేట్లను ఎంత శాతం మేర తగ్గిస్తుందన్న అంశమై మార్కెట్ అంచనాలు ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వారం ఫెడ్ మీట్‌పై ఇన్వెస్టర్లు పూర్తి దృష్టిని కేంద్రీకరించారని విశ్లేషకులు వివరించారు.
మార్కెట్ సెంటిమెంట్‌ను ప్రభావితం చేసే ఫెడ్ నిర్ణయంతో పాటు దేశీయంగా అంతర్జాతీయంగా వెలువడే ఆర్థిక గణాంకాలు, విదేశీ ఇన్వెస్టర్ల ట్రేడింగ్ యాక్టివిటీ దేశీయ స్టాక్ సూచీల ట్రెండ్‌ను నిర్దేశిస్తాయని వారన్నారు. గతవారం భారత స్టాక్ మార్కెట్ కొత్త రికార్డులను నెలకొల్పిన సంగతి తెలిసిందే. బీఎస్‌ఈ సెన్సెక్స్ తొలిసారిగా 83,000 పాయింట్ల స్థాయిని అందుకున్నది. వారం మొత్తంమీద సెన్సెక్స్ 1,707 పాయింట్లు, నిఫ్టీ 504 పాయింట్ల చొప్పున లాభపడ్డాయి.
పావు శాతమా.. ఆర శాతమా..
‘ఈ ఏడాది ఈవెంట్స్‌లో అత్యంత ఉత్సుకతతో వేచిచూస్తున్న యూఎస్ ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ (ఎఫ్‌వోఎంసీ) సమావేశం ఈ వారంలో జరుగుతుంది. సెప్టెంబర్ 18న ఫెడ్ నిర్ణయం వెలువడుతుంది. యూఎస్‌లో వడ్డీ రేట్ల తగ్గుదల సైకిల్‌కి ఇది నాంది పలుకుతుంది. ఈ దఫా పావుశాతం కోత ఉంటుందన్న అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. కొంతమంది మార్కెట్ పార్టిసిపెంట్లు 50 బేసిస్ పాయింట్ల (అరశాతం) తగ్గింపు ఉంటుందని భావిస్తున్నారు’ అని స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా వివరించారు.
మెజారిటీ అంచనాలకంటే తగ్గింపు అధికంగా ఉంటే ప్రపంచ మార్కెట్లకు ప్రత్యేకించి భారత్ వంటి వర్థమాన మార్కెట్లకు భారీ పాజిటివ్ ట్రిగ్గర్ అవుతుందన్నారు. డాలర్ బలహీనపడుతుందని, యూఎస్ ఈల్డ్స్ తగ్గుతాయని ఫలితంగా భారత్ ఈక్విటీల్లోకి విదేశీ పెట్టుబడులు ప్రవహిస్తాయని మీనా చెప్పారు.
ఎఫ్‌పీఐల పెట్టుబడులు రూ. 27,856 కోట్లు
యూఎస్ వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాలతో ఈ సెప్టెంబర్ నెలలో విదేశీ ఫోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) భారత మార్కెట్లో పెట్టుబడుల జోరును పెంచారు. ఈ నెలలో ఇప్పటివరకూ దేశీయ ఈక్విటీల్లో ఎఫ్‌పీఐలు రూ.27,856 కోట్లు
నికరంగా ఇన్వెస్ట్ చేశారు. ఏప్రిల్, మే నెలల్లో రూ. 34,000 కోట్ల మేర వెనక్కు తీసుకున్న ఎఫ్‌పీఐలు జూన్ నుంచి క్రమేపీ భారత మార్కెట్లో కొనుగోళ్లు జరుపుతున్నారు. భారత్ సూక్ష్మ ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉన్నందున విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు కొనసాగుతాయని మార్నింగ్‌స్టార్ ఇన్వెస్ట్‌మెంట్ రీసెర్చ్ ఇండియా అసోసియేట్ డైరెక్టర్ హిమాన్షు శ్రీవాస్తవ చెప్పారు.
అయితే యూఎస్ వడ్డీ రేట్లు, భౌగోళిక రాజకీయ పరిస్థితులు ఎఫ్‌పీఐల పెట్టుబడుల శైలిని ప్రభావితం చేస్తాయన్నారు. యూఎస్ 10 ఏండ్ల బాండ్ ఈల్డ్ 3.7 శాతానికి తగ్గడంతో భారత్‌తో సహా ఇతర వర్థమాన మార్కెట్లలో పెట్టుబడులకు ఎఫ్‌పీఐలు ఆసక్తి చూపిస్తున్నారని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయ్‌కుమార్ చెప్పారు.
ఆర్థిక గణాంకాలు
యూఎస్ ఫెడ్ నిర్ణయంతో పాటు ఈ వారాంతంలో జపాన్ ద్రవ్యోల్బణం డేటా వెలువడనుంది. తదుపరి బ్యాంక్ ఆఫ్ జపాన్ ద్రవ్య విధాన ప్రకటన ఉంటుంది. జపాన్ వడ్డీ రేట్ల ట్రెండ్ సైతం ప్రపంచ మార్కెట్లను ప్రభావితం చేస్తుందని విశ్లేషకులు తెలిపారు. భారత్ టోకు ద్రవ్యోల్బణం, యూఎస్ పారిశ్రామికోత్పత్తి, యూఎస్ జాబ్‌లెస్ క్లెయింల గణాంకాలు ఈ వారంలోనే వెలువడతాయని మాస్టర్ క్యాపిటల్ సర్వీసెస్ డైరెక్టర్ అరోరా చొప్రా తెలిపారు. ఈ వారం మార్కెట్‌కు యూఎస్ ఫెడ్ నిర్ణయం కీలకమని, దేశీయంగా టోకు ద్రవ్యోల్బణం డేటా, విదేశీ ఫండ్స్ పెట్టుబడుల శైలిని ఇన్వెస్టర్లు నిశితంగా గమనిస్తారని రెలిగేర్ బ్రోకింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా చెప్పారు.