- మరో 502 పాయింట్లు తగ్గిన సెన్సెక్స్
- 24,200 దిగువన నిఫ్టీ
ముంబై, డిసెంబర్ 18: యూఎస్ కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ పాలసీ సమావేశం నేపథ్యంలో భయాలు తలెత్తడంతో ఇన్వెస్టర్లు వరుసగా మూడో ట్రేడింగ్ సెషన్‌లోనూ భారీ విక్రయాలు జరిపారు. బీఎస్‌ఈ సెన్సె క్స్ బుధవారం మరో 502 పాయింట్లు క్షీణించి 80,182 పాయింట్ల వద్ద నిలిచింది. ఇదేబాటలో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మరో 137 పాయింట్ల నష్టంతో 24,200 పాయింట్ల స్థాయి దిగువన 24,198 పాయింట్ల వద్ద ముగిసింది. మొత్తం వరుస మూడు రోజు ల్లో సెన్సెక్స్ 1,900 పాయింట్లు, నిఫ్టీ 600 పాయింట్ల చొప్పున కోల్పోయాయి.
తాజా గా యుటిలిటీస్, క్యాపిటల్ గూడ్స్, మెటల్, బ్యాంకింగ్ రంగాల షేర్లను ఇన్వెస్టర్లు ఆఫ్‌లోడ్ చేశారు. బీఎస్‌ఈలో ట్రేడయిన షేర్ల లో 2,563 నష్టపోగా, 1,442 స్టాక్స్ లాభపడ్డాయి. యూఎస్ ఫెడ్ పాలసీ నిర్ణయం వెలువడనున్నందున, ముందుజాగ్రత్తగా అమ్మకాలు జరుగుతున్నాయని ట్రేడర్లు తెలిపారు. భారత మార్కెట్ల నుంచి విదేశీ పెట్టుబ డులు తరలివెళుతుండటం, గ్లోబల్ ట్రెండ్ ప్రతికూలంగా ఉండటం స్థానిక మార్కెట్ సెంటిమెంట్‌పై ప్రభావం చూపిందని చెప్పా రు.
మంగళవారం విదేశీ ఇన్వెస్టర్లు భారీగా రూ.6,410 కోట్ల విలువైన పెట్టుబడుల్ని వెనక్కు తీసుకోవడంతో మార్కెట్ బౌన్స్ అయితే మరిన్ని అమ్మకాలు జరుగుతాయన్న అంచనాలు ఏర్పడ్డాయన్నారు. రూపాయి మరో సరికొత్త కనిష్ఠస్థాయికి పడిపోవడం కూడా ఈక్విటీ మార్కెట్‌ను ఆందోళనపర్చిందని మెహతా ఈక్విటీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ప్రశాంత్ తాప్సి చెప్పా రు. రూపాయి పతనంతో వాణిజ్యలోటు, ద్రవ్యోల్బణం పెరుగుతుందన్న భయాలు నెలకొన్నాయన్నారు.
కొనసాగిన ఎఫ్‌పీఐల విక్రయాలు
మార్కెట్లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐలు) అమ్మకాలు వరుసగా మూడో రోజూ కొనసాగాయి. బుధవారం ఎఫ్‌పీఐ లు రూ.1,316 కోట్ల విలువైన ఈక్విటీలను నికరంగా విక్రయించినట్లు స్టాక్ ఎక్సేంజీల ప్రాధమిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దీనితో ఈ వారం తొలి మూడు రోజుల్లో ఎఫ్‌పీఐలు మార్కెట్ నుంచి వెనక్కు తీసుకున్న పెట్టుబడులు రూ. 8,000 కోట్లకు చేరాయి.
ఫెడ్ పాలసీపై కన్ను
అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడ్ తీసుకునే నిర్ణయం, వెల్లడించే సంకేతాలపై గ్లోబల్ మార్కెట్ల దృష్టి నిలిచివున్నదని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయ్‌కుమార్ తెలిపారు. ఫెడ్ పావు శాతం మేర వడ్డీ రేటు తగ్గిస్తుందన్న అంశాన్ని ఇప్పటికే మార్కెట్ డిస్కౌంట్ చేసుకున్నదని, భవిష్యత్ రేట్లబాటపై ఫెడ్ వ్యాఖ్యానాలపైనే ఇన్వెస్టర్ల దృష్టి నిలిచి ఉన్నదని వివరించారు.
బ్యాంక్ ఆఫ్ జపాన్ (బీవోజే), బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ (బీవోఈ) కీలకమైన పాలసీ నిర్ణయాలు, గురువారం వెలువడనున్న యూఎస్ క్యూ3 గణాంకాలపైనా ఇన్వెస్టర్లు కన్నేసి ఉంచారని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ్ ఖెమ్కా తెలిపారు. రూపాయి ఆల్‌టైమ్ కనిష్ఠస్థాయికి తగ్గడం, వాణిజ్యలోటు రికార్డు గరిష్ఠస్థాయికి పెరగడం ఈక్విటీలు ఒత్తిడికి లోనవుతున్నాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు.