calender_icon.png 11 October, 2024 | 11:52 AM

మార్కెట్ తగ్గింది.. సంపద పెరిగింది

10-10-2024 12:00:00 AM

168 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్

ఎఫ్‌ఎంసీజీ షేర్లలో అమ్మకాలు

ముంబై, అక్టోబర్ 9: భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నడుమ బుధవారం భారత స్టాక్ సూచీలు గరిష్ఠస్థాయిల్ని నిలుపుకోలేక, నష్టాలతో ముగిసాయి. రిజర్వ్‌బ్యాంక్ వడ్డీ రేట్లను యథాతథంగా అట్టిపెట్టడం కూడా సెంటిమెంట్‌ను బలహీనపర్చిందని విశ్లేషకులు తెలిపారు. 

ఆర్బీఐ సమీక్ష అనంతరం బ్యాంకింగ్ షేర్ల అండతో బీఎస్‌ఈ సెన్సెక్స్ ఇంట్రాడేలో 684 పాయింట్ల వరకూ పెరిగి 82,319 పాయింట్ల గరిష్ఠస్థాయిని తాకిన అనంతరం హెవీ వెయిట్ షేర్లు రిలయన్స్ ఇండస్ట్రీస్, హిందుస్థాన్ యూనీలీవర్, ఐటీసీ  కౌంటర్లలో అమ్మకాలు జరగడంతో నష్టాలోకి జారుకున్నది. చివరకు 168 పాయింట్ల తగ్గుదలతో  81,467 పాయింట్ల వద్ద నిలిచింది.

ఇదేబాటలో  ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ  ఇంట్రాడేలో 220 పాయింట్లు పెరిగి 25,234 పాయింట్ల గరిష్ఠస్థాయిని తాకిన తర్వాత చివరకు 31 పాయింట్ల నష్టంతో  కీలకమైన 25,000 పాయింట్ల దిగువన 24,982 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. అయితే ప్రధాన స్టాక్ సూచీలు క్షీణించినప్పటికీ, పలు షేర్లు కొత్త రికార్డుస్థాయిలకు చేరడంతో స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ల సంపద రూ.2.70 లక్షల కోట్ల మేర పెరిగింది.

వరుస రెండు రోజుల్లో ఇన్వెస్టర్లు రూ.10.20 లక్షల కోట్ల సంపదను రికవరీ చేసుకోగలిగారు. అంతక్రితం వరుసగా ఆరు రోజుల్లో కోల్పోయిన రూ.17 లక్షల కోట్ల సంపదలో సగానికి పైగా తిరిగి సంపాదించగలిగారు.  బీఎస్‌ఈలో లిస్టయిన కంపెనీల మార్కెట్ విలువ బుధవారం రూ.2.70 లక్షల కోట్లు పెరిగి 462.2 లక్షల కోట్లకు చేరింది. ఇన్ఫోసిస్, సిప్లాలతో సహా 184 షేర్లు వాటి రికార్డు గరిష్ఠస్థాయిల్ని నమోదు చేశాయి. బీఎస్‌ఈలో ట్రేడయిన షేర్లలో 2,705 స్టాక్స్ లాభపడగా, 1,248 షేర్లు నష్టపోయాయి. 

ఐటీసీ టాప్ లూజర్

 సెన్సెక్స్ బాస్కెట్‌లో అన్నింటికంటే అధికంగా ఐటీసీ 3.20 శాతం మేర క్షీణించింది. ఇతర ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు హిందుస్థాన్ యూనీలీవర్, నెస్లే ఇండియాలు 2 శాతం వరకూ తగ్గాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, లార్సన్ అండ్ టూబ్రో, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లు 1.5 శాతం వరకూ నష్టపోయాయి.

మరోవైపు టాటా మోటార్స్, టెక్ మహీంద్రా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మారుతి సుజుకి, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, భారతి ఎయిర్‌టెల్‌లు 3 శాతం వరకూ ర్యాలీ జరిపాయి. వివిధ రంగాల సూచీల్లో అధికంగా రియల్టీ ఇండెక్స్ 2.21 శాతం పెరిగింది. హెల్త్‌కేర్ ఇండెక్స్ 1.68 శాతం, పవర్ ఇండెక్స్ 1.18 శాతం, కన్జూమర్ డిస్క్రీషనరీ ఇండెక్స్ 1.09 శాతం,  ఇండస్ట్రియల్స్ ఇండెక్స్ 0.96 శాతం,ఆటో ఇండెక్స్ 0.84 శాతం చొప్పున పెరిగాయి.

ఎఫ్‌ఎంసీజీ ఇండెక్స్ 1.31 శాతం క్షీణించగా, ఎనర్జీ, ఆయిల్ అండ్ గ్యాస్, మెటల్ సూచీలు సైతం నష్టపోయాయి. బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్ సూచి 1.21 శాతం, మిడ్‌క్యాప్ ఇండెక్స్ 1.06 శాతం చొప్పున లాభపడ్డాయి.

కొనసాగిన ఎఫ్‌పీఐల అమ్మకాలు

విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెసర్ల (ఎఫ్‌పీఐలు) విక్రయాలు బుధవారం సైతం కొన సాగాయి. తాజాగా ఎఫ్‌పీఐలు రూ.4,562 కోట్ల విలువైన షేర్లు విక్రయించినట్లు ్ట స్టాక్ ఎక్సేంజీల ప్రాధమిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గత ఏడు ట్రేడింగ్ రోజుల్లో విదేశీ ఫండ్స్ దాదాపు రూ.55,000 కోట్లకుపైగా ఈక్విటీ పెట్టుబడుల్ని విదేశీ ఫండ్స్ వెనక్కు తీసుకున్నాయి.