21-03-2025 01:51:49 AM
పోలీసుల అదుపులో 9మంది నిందితులు
హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 20 (విజయక్రాంతి): ఎక్సైజ్ ఎస్టీఎఫ్ పోలీసులు పలు చోట్ల నిర్వహించిన తనిఖీల్లో రూ.13 లక్షల విలువైన 21 కిలోల గంజాయి, నల్లబెల్లాన్ని స్వాధీనం చేసుకొని తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు. అధికారులు తెలిపిన ప్రకారం ఒడిశా నుంచి హైదరాబాద్‌కు కోణార్క్ రైల్లో వచ్చిన ఇష్రేల్ అన్సారీ నుంచి 11.6 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
గంజాయిని కొన్న వ్యక్తికి ఇచ్చేందుకు శేర్‌లింగంపల్లి స్టేషన్ వద్ద ఎదురుచూస్తుండగా అతడిని అదుపులోకి తీసుకున్నారు. కంచన్‌బాగ్ డీఆర్డీవో ప్రాంతంలో గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయనే సమాచారంతో ఎస్టీఎఫ్ ఏ టీమ్ పోలీసులు తనిఖీలు నిర్వహించి మహ్మద్ అబ్దుల్ ఖాదర్, జమీర్‌ఖాన్, మహ్మద్ సహేద్, షేక్ యాసిన్, ఫాజిల్‌లను అరెస్టు చేశారు. వారి నుంచి 2.2 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.
మధ్యప్రదేశ్ నుంచి హైదరాబాద్‌కు గంజాయి తీసుకొచ్చిన వివేక్ దాహెరియా అనే వ్యక్తిని ఎంజీబీఎస్ సమపంలోని ఎస్‌టీఎఫ్ బీ టీమ్ అదుపులోకి తీసుకుంది. అతడి నుంచి 5 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. బాలానగర్‌లో గంజాయి అమ్మకాలు జరుగుతున్నట్టు తెలియడంతో హెచ్‌డీఎఫ్ బీ టీమ్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి 2.233 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
మహారాష్ట్రకు చెందిన మణికంఠని అరెస్టు చేశారు. హైదరాబాద్ నుంచి దేవరకొండకు తరలిస్తున్న 360 కేజీల నల్లబెల్లం, 50 కిలోల అలంను ఎక్సైజ్ ఎస్టీఎఫ్ బీ టీం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆయా తనిఖీల్లో పాల్గొన్న అధికారులు, సిబ్బందిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ వీబీ కమలాసన్ రెడ్డి, బీ టీమ్ లీడర్ ప్రదీప్‌రావు అభినందించారు.