calender_icon.png 25 December, 2024 | 7:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మరాఠా రాజకీయ చిత్రాలు

18-07-2024 12:00:00 AM

కె రామకృష్ణ :

అసెంబ్లీ ఎన్నికలకు ముందు మహారాష్ట్రలో మరోసారి కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయా?’ అంటే ‘అవుననే’ చెబుతున్నాయి ఇటీవలి పరిణామాలు. ముంబయిలో ముకేశ్ అంబానీ కుమారుడి వివాహ కార్యక్రమానికి విచ్చేసిన జ్యోతిష్‌పీఠం శంకరా చార్య అవిముక్తేశ్వరానంద సరస్వతి శివసేన నేత, మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే నివాసమైన మాతోశ్రీలో ఆయనతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన అక్కడ ప్రత్యేక పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. అనంతరం ఆయన విలే ఖరులతో మాట్లాడుతూ ‘పాపపుణ్యాలు అంటే ఏమి టో పెద్దలు చాలా స్పష్టంగా చెప్పారు. అతి పెద్ద పాపం నమ్మకద్రోహం. ఉద్ధవ్ థాక్రేకు ద్రోహం జరిగిం ది. కొంతమంది ఆయనకు నమ్మక ద్రోహం చేశారు.

ప్రభుత్వాన్ని చీల్చడం, ప్రజలు ఇచ్చిన తీర్పును అవమా నిం చడం తప్పు. ఇది ప్రజలలో తీవ్ర ఆవేదనను కలిగిస్తున్నది. ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో మహా రాష్ట్ర ప్రజల్లోని ఆ ఆవేదన ప్రభావం కనిపించింది. ఆయన తిరిగి ముఖ్యమంత్రిగా వచ్చేవరకు ఈ నొప్పి తగ్గదని ఆయనకు చెప్పాను’ అని అన్నారు. సాధారణంగా స్వామీజీలు రాజకీయాలకు దూరంగా ఉంటా రు. కానీ, జ్యోతిష్‌పీఠం శంకరాచార్య ఇప్పడు చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. 

గతంలో అయోధ్యలో రామమందిర ప్రతిష్ఠాపన వేడుకకు ఆహ్వానాన్ని సైతం ఆయన తిరస్కరించారు. అంతేకాదు, ఢిల్లీ లో కేదారేశ్వర మందిర నిర్మాణానికి బీజేపీ పెద్దలు చేస్తున్న ప్రయత్నాలను కూడా ఆ యన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఢిల్లీలో కేదార్‌నాథ్‌ను కట్టలేమని ఆయన స్పష్టం చేశారు. 12 జ్యోతిర్లింగ క్షేత్రాల ను పెద్దలు నిర్వచించారని, వాటి స్థానం స్థిరంగా ఉం టుందని, అది తప్పని అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో ప్రధాని మోడీ గురించి స్వామీజీ కీలక వ్యాఖ్యలు చేశారు. అంబానీ ఇంట వివాహం లో మోడీ తనను కలిశారని, తాను ఆయనను ఆశీర్వదించానని చెప్పారు. మోడీ తనకు శత్రువు కాదని అంటూనే ఒకవేళ ఆయన తప్పు చేస్తే ఆ విషయాన్ని ఎత్తి చూపిస్తామన్నారు. కేదార్‌నాథ్ ఆలయంలో భారీ గోల్డ్ స్కామ్ జరిగిందని, ఆలయం నుంచి 228 కిలోల బం గారం మాయమైందని స్వామీజీ ఆరోపించారు. దీనికి ఎవరు బాధ్యులని కూడా ప్రశ్నించారు. జ్యోతిష్‌పీఠం శంకరాచార్య  చేసిన వ్యాఖ్యలన్నీ కూడా ఒక రకంగా మహారాష్ట్రలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు, ఈ విషయంలో బీజేపీ పెద్దలు అను సరించిన విధానాలు తప్పనే విషయాన్ని చెప్పకనే చెబుతున్నాయి. 

ఫిరాయింపుదారుల్లో ఆత్మవిమర్శ

శంకరాచార్య వ్యాఖ్యల నేపథ్యంలో మహారాష్ట్రలో జరుగుతున్న తాజా పరిణామాలను ఓసారి గమనిద్దాం. మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీల కూటమి ప్రభుత్వాన్ని కూలదోయడానికి బీజే పీ పన్నిన కుట్ర చివరికి అటు శివసేన, ఇ టు ఎన్సీపీ రెండు పార్టీలూ నిట్టనిలువు నా చీలిపోయాయి. ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలో మెజారిటీ శివసేన ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసి ప్రత్యేక వర్గంగా బీజేపీతో కలిసి ప్రభు త్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధం కావడం, ఆ వెంటనే  షిండే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం జరిగిపోయింది. ఇది జరిగిన కొద్ది రోజులకే శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీలో సైతం ఆయన సమీప బం ధువు అజిత్ పవార్ తిరుగుబాటు జెండా ఎగరేసి బీజే పీ- షిండే కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా చేర డం తెలిసిందే. ఈ రెండు పరిణామాలు రాష్ట్ర ప్రజలకు రుచించక పో యినా ఏమీ చేయలేని పరిస్థితి. అవకాశం కోసం ఎదురు చూసిన ప్రజలు తాజాగా జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అధికార కూటమిని చావు దెబ్బ తీయడం ద్వారా తమ ఆగ్రహాన్ని, అసంతృప్తిని ఓటు రూపంలో తెలియజేశారు.

షిండే వర్గం శివసేన, అజి త్ పవార్ ఎన్సీపీతోపాటు కమలం పార్టీకి కూడా ఆ సెగ తగిలింది. ఈ ఏడాది చివర్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో తగిలిన ఈ షాక్ ఫిరాయింపుదారుల్లో ఆత్మ విమర్శకు దారి తీయవచ్చ న్న వార్తలు అప్పట్లోనే వచ్చాయి. ఆ సంకేతాలు ఇప్పు డు నిజమవుతున్నాయి. తాజాగా ముంబయి శివారయిన పిం ప్రీ- చించ్వాడా జిల్లాలో అజిత్ పవార్‌కు ఆయన వర్గం నేతలు షాక్ ఇచ్చారు. జిల్లా పార్టీ విభా గం చీఫ్ అజిత్ గవాహనేతోపాటు పార్టీ విద్యార్థి వర్గం అధ్యక్షుడు, ఇద్దరు మాజీ కార్పొరేటర్లు పార్టీకి రాజీనామా చేశారు. వీరంతా త్వరలోనే శరద్ పవార్ వర్గం లో చేరనున్నట్లు తెలుస్తున్నది. అజిత్ పవార్ వర్గంలోని 15 మంది ఎమ్మెల్యేలుసహా పలువురు నేతలు తిరిగి శరద్ పవార్ శిబిరంలో చేరడానికి సుముఖంగా ఉన్న ట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. సీఎం ఏక్‌నాథ్ షిండే వర్గంలోని ఎమ్మెల్యేల్లో కొందరు కూడా తిరిగి ఉద్ధవ్ వర్గం లోకి మారాలని అనుకొంటున్నారని అంటున్నారు. తిరిగి పార్టీలోకి రావాలనుకునే వారికి తలుపులు తెరిచే ఉన్నాయని గతంలో నే ఉద్ధవ్ ప్రకటించిన నేపథ్యంలో వారు పునరాలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.

అజిత్‌తో చేతులు కలపడం వల్లే..

లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో బీజేపీ వైఫల్యానికి ప్రధాన కారణం అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీతో చేతులు కలపడమేనని ఆర్‌ఎస్‌ఎస్‌కు అనుబం ధంగా ఉన్న మరాఠీ వారపత్రిక ‘వివేక్’ తాజాగా తన కవర్‌స్టోరీలో వ్యాఖ్యానించడం సంచలనంగా మారిం ది. ‘లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ వైఫల్యానికి కారణాలను వివరించిన ప్రతి బీజేపీ కార్యకర్తా అటువైపే వేలెత్తి చూపిస్తున్నారు. అజిత్ వర్గంతో చేతులు కలపడాన్ని బీజేపీ కార్యకర్తలెవరూ హర్షించడం లేదు. ‘ఈ విష యం బీజేపీ నేతలకు కూడా తెలుసు’ అని ఆ పత్రిక వ్యాఖ్యానించింది.

అక్కడక్కడా చిన్నచిన్న సమస్యలున్నా శివసేన- బీజేపీ బంధాన్ని దశాబ్దాలుగా అంద రూ హర్షించారని, అయితే, అజిత్ వర్గం చేరికపై మా త్రం పార్టీలో, ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందని, లోక్‌సభ ఫలితాల్లో ఇది స్పష్టమయిందని ఆ కథనం పేర్కొంది. అంతేకాదు పార్టీలు, నాయకులు తమ లెక్కలు వేసుకుంటుంటారు. అవి తప్పినప్పుడు పరిస్థితి ఏమిటి? ఈ ప్రశ్నకు నేతలు సమాధానం చెప్పి తీరాల్సి ఉంటుందని, లోక్‌సభ ఎన్నికల ఫలితాలు రాబోయే పరిణామాలకు ఓ సంకేతం మాత్రమేనని కూడా ఆ పత్రిక స్పష్టం చేసింది. తాజా పరిణామాలపై స్పందించిన ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ‘బీజేపీకి అజిత్ పవార్, ఆయన వర్గం అవసరం ఎంతమాత్రం లేదనిపిస్తున్నది’ అని వ్యాఖ్యానించారు.

కేంద్రంలో నరేంద్ర మోడీ నేతృత్వంలో కొత్తగా కొలువుదీరిన ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వంలో అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీకి ప్రాతినిధ్యం లేదు. లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీనుంచి ఒకే ఒక సభ్యుడు విజ యం సాధించడంతో సహాయమంత్రి పదవి ఇస్తామన్నా అందుకు ఆయన అంగీకరించలేదు. ఈ నేప థ్యంలో బారామతి నియోజక వర్గంలో శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలె చేతిలో ఓటమి పాలయిన తన సతీమణి సునేత్ర పవార్‌ను రాజ్యసభకు పంపి తద్వారా మోడీ కేబినెట్‌లో కీలక మంత్రి పదవిని దక్కించుకోవాలని అజిత్ పవార్  పావులు కదుపుతున్నారని సమాచారం. అయితే, దీనిపై పార్టీలో కీలక నేత అయిన ఛగన్ భుజ్‌బల్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని చెబుతున్నారు. అవసరమైతే పార్టీకి రాజీనామా చేసి శరద్ పవార్ వర్గంలో చేరడానికి ఆయన సిద్ధంగా ఉన్నారని  రాజకీయ వర్గాలు అంటున్నారు. రెం డు రోజుల క్రితం ఆయన శరద్ పవార్‌తో భేటీ కావడం ఈ వార్తలకు బలం చేకూరుస్తున్నది. 

అక్టోబర్- నవంబర్ నెలల్లో మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల వేడి మొదలైంది. అభ్యర్థుల ఎంపిక, పొత్తులు లాంటి వాటి పై ఇంకా చర్చలు మొదలు కానప్పటికీ, రాజకీయ పార్టీలన్నీ ఆ దిశగా అంతర్గత చర్చలు జరుపుతున్నాయి. ఈ నేపథ్యంలో రాబోయే  మూడు, నాలుగు నెలల్లో రా ష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.