- దేశానికి ప్రాంతీయ పార్టీలే బలమైన పునాదులు
- బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, నవంబర్ 23 (విజయ క్రాంతి): సీఎం రేవంత్‌రెడ్డి అబద్ధపు ప్రచారం తోనే మహారాష్ర్టలో కాంగ్రెస్ ఓటమి చవిచూసిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. జార్ఖండ్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలను కూడా జనం తిరస్కరించారని అన్నారు. దేశ భవిష్యత్‌కు ప్రాంతీయ పార్టీలే గట్టి పునాదులని ఆయన పేర్కొన్నారు.
శనివారం ఒక ప్రకటనలో పేర్కొంటూ ప్రాంతీయ పార్టీలు బలంగా లేని చోట మాత్రమే బీజేపీ గెలుస్తుందన్నారు. ఇప్పటికీ ప్రాంతీయ పార్టీలను ఎలా అంతం చేయాలనే దానిపైనే కాంగ్రెస్ ఫోకస్ పెట్టిందని మండిపడ్డారు. ఈ కుట్రలో కాంగ్రెస్ ఎక్కువా కాదని, బీజేపీ తక్కువా కాదని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీలు ఎన్ని కుట్రలు చేసినా ప్రాంతీయ పార్టీలను ఏమీ చేయలేరని అన్నారు.
మహారాష్ర్టలో కాంగ్రెస్ ఘోర ఓటమి పొందిందని చెప్పారు. ఇకనుంచి సీఎం పదవికి న్యాయం చేసి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని రేవంత్‌రెడ్డికి సూచించారు. 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాల నుంచి దేశంలో సంకీర్ణ శకం మొదలైందని, భవిష్యత్తులో ఇదే ట్రెండ్ కొనసాగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
హేమంత్ సోరెన్‌ను వేధించిన కేంద్రానికి ఈఎన్నికల్లో ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారని ఎద్దేవా చేశారు. మహారాష్ట్రలో బీజేపీ గెలిచేందుకు ప్రాంతీయ పార్టీ నేతలు ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్‌లే కీలకమయ్యారని అన్నారు.