calender_icon.png 5 October, 2024 | 4:47 AM

36 మంది మావోయిస్టులు మృతి

05-10-2024 02:36:33 AM

దంతెవాడలో భీకర ఎన్‌కౌంటర్

ఛత్తీస్‌గఢ్, అక్టోబర్ 4: ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి తుపాకీ గర్జించింది. అబూజ్‌మాడ్ దండకారణ్యంలో నారాయణ్‌పూర్, దంతెవాడ జిల్లాల సరిహద్దుల్లో శుక్రవారం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో 36 మంది నక్సల్స్ మరణించారు. మావోయిస్టులు, భద్రతాదళాల మధ్య ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు.

బస్తర్ రేంజ్ పరిధిలో ఈ రెండు జిల్లాల సరిహద్దులున్నాయి. ఓర్చా, బర్సూర్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని తుల్‌తులి, నెందూర్, గోవెల్ గ్రామాల్లో భద్రతా దళాలు సంయుక్త ఆపరేషన్ నిర్వహించారు. ఈ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో సెర్చ్ ఆప రేషన్ చేపట్టారు. ఇందులో జిల్లా రిజర్వ్ గార్డ్స్, ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు.

శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటలకు ఎదురు కాల్పులు మొదలైనట్లు ఐజీ సుందర్‌రాజ్ తెలిపారు. ఎన్‌కౌంటర్‌లో 36 మంది నక్సల్స్ మృతదేహాలతో పాటు ఏకే రైఫిళ్లు, ఇతర ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఎన్‌కౌంటర్ నుంచి తప్పించుకున్న మావోయిస్టుల కోసం భద్రతా బలగాలు గాలిస్తున్నాయని అధికార వర్గాలు తెలిపాయి. 

ఏడాదిలో 185 మంది

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఏరివేతలో ఈ ఎన్‌కౌంటర్ అతిపెద్ద విజయాల్లో ఒకటిగా నిలుస్తుందని ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ అన్నారు. ఈ సందర్భంగా భద్రతాదళాలను ఆయన అభినందించారు. ‘నక్సలిజం తుదిశ్వాస తీసుకుంటోంది. ఛత్తీస్‌గఢ్‌లో 2026 మార్చి నాటికి నక్సలిజాన్ని అంతం చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అనేకసార్లు చెప్పారు’ అని సీఎం గుర్తుచేశారు.

కొన్నేళ్లుగా ఈ ప్రాంతంలో తరచూ ఎన్‌కౌంటర్లు కొనసాగుతున్నాయని, బస్తర్‌లో ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 185 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు డీజీపీ సుందర్‌రాజ్ తెలిపారు. కాగా, మావోయిస్టుల హింస ప్రజాస్వామ్యానికి సవాలుగా మారిందని, ఇప్పటివరకు 17 వేల మంది బలయ్యారని అమిత్ షా ఇటీవల పేర్కొన్నారు.

నక్సల్స్ అంతానికి బలమైన, పకడ్బందీ వ్యూహం అవసరమని, 2014కు ముందుతో పోలిస్తే ఎన్డీయే హయాంలో నక్సల్స్ సంబంధిత ఘటనల్లో 53 శాతం తగ్గుదల నమోదైనట్లు తెలిపారు. నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేసేందుకు కేంద్రం కృషి చేస్తోందని చెప్పారు. ఈ ప్రాంతాల్లో భద్రతతోపాటు అభివృద్ధి కార్యకలాపాలు ఏకకాలంలో చేపడుతున్నట్లు వెల్లడించారు. ఎన్‌ఐఏ తరహా కేంద్ర సంస్థలు మావోయిస్టుల హింస నిర్మూలకు కృషి చేస్తున్నాయని చెప్పారు.