calender_icon.png 6 February, 2025 | 3:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మావోయిస్టులు అజ్ఞాతం వీడాలి

05-02-2025 11:49:55 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): మావోయిస్టులు అజ్ఞాతం వీడి జనజీవన స్రవంతిలోకి రావాలని రామగుండం సీపీ ఎం.శ్రీనివాస్ అన్నారు. బుధవారం బెల్లంపల్లి మండలంలోని చంద్రవెళ్లి గ్రామంలో నుండి దండకారణ్య మావోయిస్టు పార్టీలో టెక్నికల్ ఇంచార్జీగా పని చేస్తున్న జాడి భాగ్య అలియాస్ పుష్ప, అమె భర్త జాడి వెంకటి అలియాస్ సురేష్ కుటుంబ సభ్యులను కలిసి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. జాడి భాగ్య అలియాస్ పుష్ప తల్లి ఆవుల మల్లమ్మ, సోదరుడు ఆవుల గంగన్నలతో మాట్లాడారు. తన కూతురు 20 ఏళ్లకు పైగా కుటుంబాన్ని వీడి మావోయిస్టు ఉద్యమంలో పని చేస్తుందని, తన ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని, కళ్లు కూడా కనిపించడంలేదని, తన కొడుకు గంగన్న కుటుంబ పరిస్థితి ఏమాత్రం బాగా లేదని కన్నీళ్ల పర్యంతమైంది.

కుటుంబాన్ని వీడిన జాడి భాగ్య, అల్లుడు జాడి వెంకటిలు అడవులను వీడి ప్రభుత్వానికి లొంగిపోవాలని, కుటుంబంతో కలిసి బతకాలని వేడుకుంది. ఈ సందర్భంగా సీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ.. మావోయిస్టుల్లో పని చేస్తున్న జాడి పుష్ప, జాడి వెంకటిలు లొంగిపోతే వారిపై ఉన్న రివార్డులతో పాటు ప్రభుత్వం అందించే అన్ని రకాల ప్రయోజనాలను అందిస్తామన్నారు. అడవుల్లో ఉండే మావోయిస్టులకు ప్రజల్లో ఆదరణ తగ్గిందన్నారు. అనంతరం జాడి పుష్ప తల్లి మల్లమ్మ, అన్న గంగన్నలకు బియ్యం, నిత్యావసర వస్తువులు, పండ్లు, దుప్పట్లను సీపీ అందజేశారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల డీసీపి ఎగ్గడి భాస్కర్, బెల్లంపల్లి ఏసీపి ఎ.రవికుమార్, బెల్లంపల్లి రూరల్ సీఐ సయ్యద్ అఫ్జలొద్ధీన్, తాళ్ల గురిజాల ఎస్‌ఐ చుంచు రమేష్ లు పాల్గొన్నారు.