బీజాపూర్: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో శుక్రవారం భద్రతా బలగాలు జరిపిన ఎన్‌కౌంటర్‌లో కనీసం 12 మంది మావోయిస్టులు మరణించారని ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి తెలిపారు. గంగలూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పిడియా గ్రామ సమీపంలోని అటవీప్రాంతంలో భద్రతా సిబ్బంది బృందం నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్‌లో ఉండగా కాల్పులు చోటుచేసుకున్నాయని పోలీసులు తెలిపారు. "గంగలూర్ ప్రాంతంలో ఎదురుకాల్పులు ముగిశాయి. ఇప్పటివరకు 12 మంది మావోయిస్టుల మృతదేహాలను వెలికితీయడంతో మా భద్రతా దళాలు భారీ విజయాన్ని సాధించాయి" అని ముఖ్యమంత్రి విలేకరులతో అన్నారు.
ఆపరేషన్ చేసిన భద్రతా బలగాలను, ఉన్నతాధికారులను ఆయన అభినందించారు. గత నెల రోజుల్లో ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు ఇది మూడో పెద్ద దెబ్బ అని చెప్పాలి. ఏప్రిల్ 16న, కంకేర్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో కనీసం 29 మంది మావోయిస్టులు మరణించగా, ఏప్రిల్ 30న నారాయణపూర్, కంకేర్ జిల్లాల సరిహద్దులో భద్రతా దళాలతో జరిగిన మరో ఎన్‌కౌంటర్‌లో 10 మంది మావోయిస్టులు మృతిచెందారు. రాష్ట్రంలోని బస్తర్ ప్రాంతంలో జరిగిన వేర్వేరు ఎన్‌కౌంటర్లలో ఈ ఏడాది ఇప్పటివరకు 103 మంది మావోయిస్టులు మరణించినట్లు సమాచారం.