బెల్లంపల్లి (విజయక్రాంతి): అందరినీ విడిచి అన్నల్లో కలిసి పెనిమిటితో సహా అడవుల్లోకి వెళ్లిపోయావు. మీ అయ్యా, అన్న పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్నాను. ఉన్న ఒక్క అన్న పరిస్థితి బాగాలేదు. బిడ్డ పని జేత్తెనే పూట గడవడం కట్టమైతంది. దానికి సర్కారు నౌకరి లేదు బిడ్డ. నీవు ఇల్లిడిసి పోయినంక నీకోసం ఏడ్వని రోజు లేదు. పంటి కింద ముద్ద దిగుతలేదు. కన్నుమూస్తే నిద్ర పడతలేదు బిడ్డా, ఎట్లున్నవో, ఏడున్నవో దెల్వక ఊపిరాగి లేత్తంది. ఇప్పటికే బతుకు ఆగమైంది. ఊళ్ల అందరూ తమ పిల్లలతో సంబరాలు చేసుకుంటుంటే నీవే యాదికత్తవ్ బిడ్డా. నేనేం పాపం జేస్తి, నాకు దూరమయ్యావ్. అన్న పరిస్థితి బొత్తిగా మంచిగ లేదు.
నిన్ను తలువని రోజు లేదు. మా ఇద్దరి ఆరోగ్యం సక్కగుంటలేదు. ఏడ్చి ఏడ్చి నా కళ్ళు బొత్తిగా కనిపిస్త లేవు బిడ్డా. అందరి కోసం నీవు 20 ఏళ్లు మాకు దూరమైనవ్. ఇక సాలు బిడ్డా. నాకోసం, మీ అన్న కోసం ఇంటికి రా బిడ్డా..! అంటూ మావోయిస్టు దండకారణ్య టెక్నికల్ కమిటీ ఇన్చార్జి జాడి భాగ్య అలియాస్ పుష్ప తల్లి ఆవుల మల్లమ్మ రోదించిన తీరు చంద్రవెల్లి గ్రామస్తులను, పోలీసు అధికారులను ఎంతగానో కలచి వేసింది..
మావోయిస్టులు అడవుల్లో ఉండి సాధించేది ఏమీ లేదు.... రామగుండం సిపి ఎం.శ్రీనివాస్
మావోయిస్టులు అడవుల్లో ఉండి సాధించేది ఏమీ లేదని రామగుండం సిపి ఎం. శ్రీనివాస్ అన్నారు. బుధవారం బెల్లంపల్లి మండలంలోని చంద్రవెల్లి గ్రామం నుండి దండకారణ్య మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్న జాడి పుష్ప , ఆమె భర్త జాడి వెంకటి ల కుటుంబ సభ్యులను కలిసి ప్రభుత్వానికి లొంగిపోవాలని సూచించారు. అనంతరం సిపి మాట్లాడుతూ 1994వ సంవత్సరంలో అప్పటి పీపుల్స్ వార్ పార్టీలో చేరిన భార్య భర్తలు జాడి పుష్ప, జాడి వెంకటిలు 25 ఏళ్లుగా మావోయిస్టు పార్టీలో పనిచేస్తూ వారి కుటుంబ సభ్యులకు దూరంగా ఉన్నారన్నారు. ప్రభుత్వం లొంగిపోయే మావోయిస్టులకు పునరావాసంతో పాటు వారిపై ప్రకటించిన రివార్డులను అందజేస్తుందని తెలిపారు. ప్రస్తుతం మావోయిస్టు పార్టీలో టెక్నికల్ ఇన్చార్జిగా పనిచేస్తున్న జాడి భాగ్య అలియాస్ పుష్ప ఆమె భర్త జాడి వెంకటి అలియాస్ సురేష్ లు లొంగిపోయి కుటుంబ సభ్యులతో జీవించాలని కోరారు.
10 సంవత్సరాల కిందట లొంగిపోయిన మావోయిస్టులకు కూడా ప్రభుత్వం తరఫున పునరావాసం కల్పించినట్లు సిపి చెప్పారు. పోలీసులు ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్నారనే విషయాన్ని మావోయిస్టులు గమనించాలన్నారు. మావోయిస్టులు స్వచ్ఛందంగా లొంగిపోతే వారికి పోలీసుశాఖ తరపున తాము అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. మావోయిస్టు పార్టీలో అత్యధికంగా తెలంగాణ ప్రాంతం నుండే 17 మంది పనిచేస్తున్నారని చెప్పారు. తెలంగాణ ప్రాంతం నుండి దండకారణ్యంలో సలాకుల సరోజ అలియాస్ దీప, ఆరేపల్లి కృష్ణ అలియాస్ కిట్టు, జాడి భాగ్య అలియాస్ పుష్ప, జాడి వెంకటి అలియాస్ సురేష్, బండి ప్రకాష్ అలియాస్ ప్రభాత్, బబ్బెర రవి, ఆత్రం లచ్చన్న, మల్లోజుల వేణుగోపాల్, సత్యనారాయణ, అప్పాజీ, మల్లా రాజిరెడ్డి లాంటి అగ్ర నాయకులు మావోయిస్టులుగా కొనసాగుతున్నారని చెప్పారు. వీరంతా అడవులను వీడి స్వచ్ఛందంగా లొంగిపోవాలని కోరారు. తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం సాధించలేరని, ప్రజా జీవితంలోకి వచ్చి ప్రజలకు నేరుగా సేవలందించాలని సిపి మావోయిస్టులకు సూచించారు.
కుటుంబ సభ్యులకు దూరంగా అడవుల్లో మావోయిస్టులు ఆరోగ్య సమస్యలతో పాటు వ్యక్తిగత సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఇటీవల కాలంలో అనేక మంది మావోయిస్టు నాయకులు పోలీసు ఎన్కౌంటర్లలో తమ ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. మావోయిస్టులు ఆయుధాలు వీడి జనజీవన స్రవంతి లోకి వస్తే వారిపై ఉన్న రివార్డులతో పాటు ప్రభుత్వం తరపున అందించే ఆర్థిక సహాయాన్ని వారికి అందేలా కృషి చేస్తామని చెప్పారు. అనంతరం మావోయిస్టు పార్టీలో కొనసాగుతున్న జాడి భాగ్య అలియాస్ పుష్ప సోదరుడు ఆవుల గంగన్న తమ కుటుంబ ఆర్థిక పరిస్థితి సరిగా లేదని సిపి శ్రీనివాస్ దృష్టికి తీసుకువచ్చారు. తన కూతురు స్వప్న నర్స్ ట్రైనింగ్ పూర్తి చేసి ప్రైవేట్ గా పనిచేస్తుందని, ప్రభుత్వ ఉద్యోగం కల్పించి తమ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. దీనికి సిపి శ్రీనివాసు స్పందిస్తూ ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి తప్పకుండా న్యాయం జరిగేలా చూస్తారని చెప్పారు.
ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ వెలువడిన తప్పకుండా దరఖాస్తు చేసుకోవాలని గంగన్న కూతురు స్వప్నకు సీపీ శ్రీనివాస్ సూచించారు. ఉద్యోగ ప్రిపరేషన్, కోచింగ్ కు అయ్యే ఖర్చులు పోలీసు శాఖ భరిస్తుందని భరోసా ఇచ్చారు. అనంతరం చాడి భాగ్య అలియాస్ స్వప్న తల్లి ఆవుల మల్లమ్మ, సోదరుడు ఆవుల గంగన్నల కు ఎప్పుడు అవసరమైన వైద్య సహాయం అందించాలని స్థానిక తాళ్ల గురిజాల ఎస్సై చుంచు రమేష్ సి పి శ్రీనివాస్ ఆదేశించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు బియ్యం, నిత్యవసర సరుకులు, పండ్లు, దుప్పట్లను సిపి అందజేశారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్, బెల్లంపల్లి ఏసిపి ఏ.రవికుమార్, బెల్లంపల్లి రూరల్ సీఐ సయ్యద్ అఫ్జలొద్దీన్ లు పాల్గొన్నారు.