ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం కంకేర్‌లో పట్టుకున్న పోలీసులు
జగిత్యాల, డిసెంబర్ 23 (విజయక్రాంతి): మావోయిస్టు అగ్రనేత ప్రభాకర్ అలియాస్ బల్మూరి నారాయణరావును ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని కాంకేర్ ప్రాంతంలోని అంతఘర్ అడవిలో పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. 40 ఏళ్లుగా పోలీసులకు చిక్కకుండా నక్సల్బరీ ఉద్యమంలో కీలక నేతగా ఉన్న ప్రభాకర్ ఎన్నో వ్యూహాత్మక ప్రణాళికల్లో, సుమారు వంద నేరాల్లో భాగస్వామ్యం ఉన్నట్లు పోలీసుల అంచనా.
ఆయనపై ప్రభుత్వం రూ.25 లక్షల రివార్డు ప్రకటించింది. ప్రభాకర్ అరెస్టును కాంకేర్ జిల్లా ఎస్పీ ఇందిరా కళ్యాణ్ ఎలిసెలా ధ్రువీకరించారు. 57 సంవత్సరాల వయస్సున్న ప్రభాకర్ జగిత్యాల జిల్లా బీర్పూర్ ప్రాంతానికి చెందిన వ్యక్తి. 1984లో మావోయిస్టు ఉద్యమానికి ఆకర్షితుడై ప్రాథమిక సభ్యత్వం తీసుకుని దళంలో చేరారు. ప్రభాకర్ మావోయిస్టు సీసీఎం కార్యదర్శి గణపతికి బంధు వు. ప్రస్తుతం దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీలో యాక్టివ్ నార్త్ సబ్ జోనల్ బ్యూరోలో లాజిస్టిక్స్ సప్లై, ఎంఓపిఓఎస్ టీమ్ ఇన్‌చార్జిగా ఉన్నారు.
దేశంలోని చాలా రాష్ట్రాల మావోయిస్టు అగ్ర నాయకులతో ప్రభాకర్‌రావుకు సన్నిహిత సంబంధాలున్నట్లు సమాచారం. మావోయిస్టు సీసీఎం కార్యదర్శులు బసవరాజుకు, కే రామచంద్రారెడ్డి అలియాస్ రాజు, అలాగే దేవ్జీ అలియా స్ కుమార్దాదా, కోసా, సోను, మల్లా రాజరెడ్డి అలియాస్ సంగ్రామం ఇతర నక్సలైట్ నేతలతో సన్నిహిత సంబంధాలున్నాయి. ప్రభాకర్ భార్య డీవీసీ సభ్యురాలు రాజేకాంగే రావుఘాట్ ఏరియా కమిటీకి ఇన్‌చా ర్జిగా పనిచేస్తున్నట్లు సమాచారం.
గత కొన్ని రోజులుగా కంకేర్ ప్రాంతంలో ప్రభాకర్‌రా వు కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో పకడ్బందీ ప్రణాళికతో ఆదివారం రాత్రి అరెస్టు చేశారు. ఇదిలా ఉండగా 2008 నుంచి ఇప్పటివరకు డీకేఎస్జెడ్సి సరఫరాలో, మొబైల్ పొలిటికల్ స్కూల్ ఇన్‌చార్జి తదితర బాధ్యతల్లో ప్రభాకర్ పనిచేస్తున్నారని తెలిసింది.