కొయ్యూరు ఎన్కౌంటర్ జరిగి పాతికేళ్లు
నాడు నేలరాలిన విప్లవ ధృవతారలు
పీఎల్జీఏ వారోత్సవాలకు మావోయిస్టు పార్టీ పిలుపు
డ్రోన్ కెమెరాలతో రామగుండం కమిషనరేట్ పోలీసుల నిఘా
మంథని,(విజయక్రాంతి): సుధీర్ఘ మావోయిస్టు పార్టీ నక్సలైట్ల ప్రయాణంలో అది చీకటి రోజు. విప్లవ ధృవతారలు నేలరాలి పార్టీ గుండె చెదిరిన రోజు. అన్నలను ఒదిగి పట్టుకున్న అడవి తల్లి కన్నీరు పెట్టిన రోజు. తూటాల వర్షం కురిసిన ఆ నిశీథి ఇప్పటికీ మరిచిపోలేని రోజు. ఆ ఘటన జరిగి పాతికేళ్లు గడుస్తున్నా మావోయిస్టు పార్టీ మాత్రం ఇంకా ఆ విషాదం నుంచి తేరుకోలేని రోజు. మావోయిస్టు పార్టీకే ఊహించని విపత్తు అది. యావత్తు విప్లవ అభిమానులు, నక్సలైట్లను విషాదంలోకి నెట్టిన రోజు. అదే మంథని నియోజక వర్గంలోని మల్హర్ మండలం కొయ్యూరు ఎన్ కౌంటర్. 1999 డిసెంబర్ 2వ తేదీన భూమి, భుక్తి, విముక్తి అంటూ అడవి బాట పట్టిన అన్నలు ఊపిరి బిగపట్టిన రోజు. అప్పటి పీపుల్స్వార్ (ఇప్పుడు మావోయిస్టు పార్టీ) అగ్ర నాయకులు పోలీసు తుపాకుల నుంచి దూసుకొచ్చిన తూటాలను తమ గుండెల్లో దాచుకుని నేలరాలిన రోజుతో అన్నల కోటకు కోలుకోలేని దెబ్బ తగిలింది. నడువురా తమ్మి నడువురా.. నడువవే చెల్లి నడవవే అంటూ అరణ్యం నుంచి పోరాటం చేస్తున్న ఉద్యమ సింహాలు నల్లా ఆదిరెడ్డి, శీలం నరేష్, ఎర్రంరెడ్డి సంతోష్ రెడ్డితోపాటు మరో దళ సభ్యుడు లక్ష్మీరాజం ఎన్కౌంటర్లో నేలకొరిగి నేటికి 25 ఏళ్లు గడుస్తుంది. దీనితో మావోయిస్టు పార్టీ పీఎల్జీఏ వారోత్సవాలకు పిలుపునివ్వడంతో రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో డ్రోన్ కెమెరాలతో నిఘాను తీవ్రతరం చేస్తున్నారు. మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాలలో అలజడి వాతావరణం నెలకొంది.
ఆ అగ్రనేతల ఆశయ సాధనలో పీఎల్జీఏ ఏర్పాటు
కొయ్యూరు ఎన్కౌంటర్లో అసువులు బాసిన ఆ ముగ్గురు అగ్రనేతలను చిరకాలం గుర్తుంచుకోవాలని వారి ఆశయ సాధనలో ముందుకు సాగడానికి మావోయిస్టు పార్టీ ప్రజా గెరిల్లా ఆర్మీ పేరుతో 2000 సంవత్సరంలో ఒక సైనిక బలగంను ఏర్పాటు చేసుకుంది. అప్పటి నుంచి ప్రతి ఏటా కొయ్యూరు ఎన్కౌంటర్కు స్మృతిగా అమరులైన వారిని స్మరించుకుంటూ పీఎల్జీఏ వారోత్సవాలను నిర్వహిస్తుంది.
అడవి బాట పట్టిన ఆదిరెడ్డి...
కరీంనగర్ జిల్లా హుజురాబాద్కు 10 కి.మీ దూరంలో కొత్తగట్టు గ్రామంలో మధ్య తరగతి రైతు కుటుంబంలో నల్లా ఆదిరెడ్డి అలియాస్ శ్యాం జన్మించాడు. విద్యార్థి దశలోనే 1973 ఉద్యమ బాట పట్టాడు. 1975లో ఆర్ఎస్యూ కోసం ప్రచారం చేసి 1980లో రాష్ట్ర కమిటీ సభ్యునిగా ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శిగా, 1982లో రాష్ట్ర కమిటీ సభ్యునిగా, ఆదిలాబాద్ ఉద్యమానికి, సికాస ఉద్యమానికి నాయకత్వం వహించాడు. 1984లో రాష్ట్ర కార్యదర్శిగా కేంద్ర కమిటీ సభ్యునిగా పని చేశాడు.
విద్యార్థి దశ నుంచే నరేశ్కు విప్లవ భావాలు...
నరేష్కు విద్యార్థి దశ నుంచే విప్లవ భావాలు ఒంటబట్టాయి. బాల్యం నుంచే నీతి నిజాయితీగా మెలిగేవాడు. నరేశ్ను ఇంజనీర్గా చూడాలని తండ్రి పృథ్వీధర్ భావించి సిరిసిల్ల పాలిటెక్నిక్ కళాశాలలో చేర్పించాడు. అప్పుడే విప్లవ సాహిత్యంకు ఆకర్షితుడై ఉద్యమ బాట పట్టాడు. అప్పుడు నరేశ్కు 1981లో పెళ్లి చేశారు. ఆ రెండేళ్లకే పూర్తిగా అడవిలోకి వెళ్లాడు. 1989 నుంచి 1995 వరకు రీజినల్ కమిటీ కార్యదర్శిగా 1995 కేంద్ర కమిటీ సభ్యులుగా పని చేశాడు. 20 ఏళ్లు ఉద్యమమే ఊపిరిగా బతికాడు. 1999 డిసెంబర్ 2న ఎన్కౌంటర్లో అస్తమించాడు.
అన్యాయాలు చూడలేక అడవిలోకి సంతోష్
దేవరుప్పల మండలం కడివెండికి చెందిన ఎర్రంరెడ్డి లక్ష్మారెడ్డి, అనసూర్యలకు 1959లో సంతోష్ రెడ్డి జన్మించాడు. ఉన్నత చదువుల కోసం హైదరాబాద్ వెళ్లి అప్పుడే ఉద్యమాలకు ఆకర్షితుడయ్యాడు. 1983లో కొండపల్లి సీతారామయ్య కేసులో అరెస్టయిన తర్వాత తౌలిసారిగా తుపాకీ పట్టాడు. మావోయిస్టు పార్టీలో చేరి 16 ఏళ్లుగా పని చేశాడు. రాష్ట్ర కార్యదర్శిగా కేంద్ర కమిటీ సభ్యునిగా కీలక బాధ్యతలు నిర్వర్తంచాడు. దురదృష్టవశాత్తు కొయ్యూరు ఎన్కౌంటర్లో మరణించాడు.
బేగంపేటలో విప్లవ సూరీల స్మారక స్తూపం
కొయ్యూరు ఎన్కౌంటర్లో నేలకొరిగిన విప్లవ సూరీల స్మారకార్థం కమాన్పూర్ మండలం బేగంపేటలో 78 అడుగుల ఎత్తులో స్మారక స్తూపం నిర్మించారు. ఇక్కడి రామగిరి ఖిల్లాతో ఆ ముగ్గురు అగ్ర నాయకులకు ఉన్న సంబంధం నేపథ్యంలోనే 2004లో కాంగ్రెస్ హయాంలో మావోయిస్టు పార్టీపై తాత్కాలికంగా నిషేధం ఎత్తివేశారు. అప్పుడు మావోయిస్టు పార్టీ నేత బండి ప్రకాశ్ ఆధ్వర్యంలో ఈ స్తూపం నిర్మించి విరసం నేత వరవరరావు, రత్నమాల, పద్మకుమారి చేతుల మీదుగా అనేక ఉద్రిక్తత పరిస్థితుల నడుమ స్తూపంను ఆవిష్కరించారు. అప్పుడు విప్లవ గీతాలతో బేగంపేట బెంబేలెత్తిపోయింది.
పీఎల్జీఏ వారోత్సవాలపై డ్రోన్ నిఘా...
పీఎల్జీఏ వారోత్సవాలపై పోలీస్ యంత్రాంగం డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేస్తుంది. మావోయిస్టు పార్టీకి కంచుకోటగా ఉన్న తూర్పు డివిజన్ పరిధిలోని ముత్తారం, కాటారం, మహదేవపూర్, మహాముత్తారం, మల్హర్ మండలాల్లోని ప్రభావిత గ్రామాలపై పోలీసులు నిఘాను ముమ్మరం చేసారు. సమస్యాత్మక అటవీ గ్రామాల్లో కూంబింగ్ కూడా చేపడుతున్నట్లు తెలిసింది. ప్రజా ప్రతినిధులు, మావోయిస్టు టార్గెట్లను అప్రమత్తం చేసినట్లు సమాచారం.