calender_icon.png 24 October, 2024 | 11:57 AM

కోవర్ట్ ఆపరేషన్లతో "మావోల" ఉద్యమం నిర్మూలించలేరు

12-08-2024 12:14:36 PM

విప్లవ ద్రోహులను పార్టీ క్షమించదు

ప్రజల సమక్షంలో విచారించి వదిలేస్తాం 

మావోయిస్టు భద్రాద్రి కొత్తగూడెం  

డివిజన్ కమిటీ కార్యదర్శి ఆజాద్ 

జగిత్యాల,(విజయక్రాంతి): కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల వ్యూహాత్మక సూరజ్ కుండ్ బహుముఖ దాడిలో ఆపరేషన్ 'కగార్' మోసపు ఎత్తుగడలతో ప్రజాయుద్ధాన్ని నిర్మూలించలేరని భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) భద్రాద్రి కొత్తగూడెం - అల్లూరి సీతారామ రాజు డివిజన్ కమిటీ కార్యదర్శి ఆజాద్ అన్నారు. విప్లవ ద్రోహుల, కోవర్ట్ లను పార్టీ, ప్రజలు ఎన్నటికీ క్షమించరని రాజ్ కుమార్, అర్జున్ లను ప్రజాకోర్టులో పెట్టి విచారించి -విడిచి పెట్టామని విలేకరులకు సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గుంటూరు జిల్లా, మాచర్ల గ్రామానికి చెందిన కాకర్ల రవి కుమార్ పీడీఎస్ యు విద్యార్థి సంఘంలో పనిచేస్తూ 2016లో పార్టీ రాజకీయాలకు ఆకర్షితుడై రిక్రూట్ అయ్యాడనీ, 2023 ఏప్రిల్ నెలలో రవిలో వస్తున్న మార్పు, ప్రవర్తనను, వ్యవహార పద్ధతిలో తప్పుడు భావాలు, లంపెన్ బుద్దులు తలెత్తడంతో ఇంటికి పంపించామని ఆజాద్ ఆ ప్రకటనలో వెల్లడించారు.

కాకర్ల రవి, ఆయన భార్య కల్పన పోలీసుల ఎదుట లొంగిపోయి  పోలీసు ఇన్ ఫార్మర్ గా, విప్లవ ద్రోహిగా మారాడని, పార్టీలో పని చేస్తున్న క్రమంలో పరిచయం ఉన్న వ్యక్తులను కూడా పోలీస్ ఇన్ ఫార్మర్స్ గా, కోవర్టుగా తయారు చేశాడని ఆజాద్ ఆరోపించారు. అందులో భాగంగా అర్జున్, రాజ్ కుమార్ కోవర్టులుగా తయారు చేశారు. గాలి నారాయణరెడ్డి అలియాస్ రాజ్ కుమార్ 36 ఏళ్ళు తండ్రి చంద్రశేఖర్ రెడ్డి, తల్లి రంగమ్మ అనంతపురం జిల్లా, చెన్న కొత్తపల్లి మండలం, వర్రం పల్లి గ్రామానికి చెందిన వాడని, 2020 అక్టోబర్ లో సోషల్ మీడియా ద్వారా పార్టీ రాజకీయాలకు ఆకర్షితుడై పూర్తికాలం కార్యకర్తగా రిక్రూట్ అయ్యాడని వివరించారు. 2023 జనవరి 7 వరకు పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి పని చేస్తున్న క్రమంలో శబరి ఏరియా, వెంకటాపురం గ్రామం దగ్గర అరెస్టు అయ్యాడని, పోలీసులు అరెస్టు చేసి 15 రోజులు పోలీసు కస్టడీలో చిత్రహింసలు పెట్టి, ఇన్ ఫార్మర్ గా మారాలని లేకపోతే నీపై అనేక కేసులు పెట్టి 30ఏళ్ళు జైలులో వేస్తామని బెదిరించి భయబ్రాంతులకు గురిచేసినా లొంగకపోవడంతో 2 కేసులు పెట్టి జైలుకు పంపారని ఆజాద్ పేర్కొన్నారు.

ఏడాది తరువాత బెయిల్ పై జైలు నుండి అడుగు పెట్టగా పోలీసులు విజయవాడ తీసుకొని పోయారని, 98 గేటు దగ్గర పట్టుకొని డీఎస్పీ అశోక్, ఏటపాక ఎస్పీ, ఇంటలిజెన్స్ అధికారులు కోవర్టుగా పని చేయాలని ఫుల్ మోటివేషన్ చేసినా వినకపోవడంతో కాకర్ల రవిని పిలిపించి ఒప్పించారని తెలిపారు. లేకపోతే మళ్ళీ కేసులు పెట్టి జైల్ పంపుతామని బెదిరించి కోవర్టు పని చేయడం తప్ప మార్గం లేదని అయోమ యంలోకి తోసేసారని అన్నారు. దాంతో ఏమీ చేయలేని స్థితిలో కోవర్టుగా ఒప్పుకొని 2024 ఫిబ్రవరిలో మళ్ళీ పార్టీలో పని చేస్తానని వచ్చి పోలీసులు, కాకర్ల రవి కాంటాక్టులో ఉంటూ పార్టీకి ద్రోహం చేయాలని నిర్ణయించుకున్నారన్నారు.

దుండి తేజ అమర్ నాథ్ అలియాస్ అర్జున్ 25ఏళ్లు తండ్రి ముసలరెడ్డి, తల్లి లక్ష్మి, బాపట్ల జిల్లా, దీరాల గ్రామ  వ్యక్తి. పార్టీ రాజకీయాల పట్ల విశ్వాసంతో దోపిడీ లేని రాజ్యాధికారంకై పోరాడాలని నిర్ణయించుకొని 2021 డిసెంబర్ నెలలో పూర్తికాలం కార్యకర్తగా రిక్రూట్ అయ్యాడని అప్పటి నుండి 2024 ఫిబ్రవరి వరకు పార్టీకి, ప్రజలకు విశ్వా సంగా క్రమశిక్షణను అమలు చేస్తూ పని చేశాడని అన్నారు. పని చేస్తున్న క్రమంలో కగార్ దాడిని రాజకీయంగా అర్ధం చేసుకోకపోగా కాకర్ల రవి మాటలు నమ్మి కోవర్టు గా తయారు అయటాడని, ఎస్పీ రాకేష్ మెల్లగా అర్జున్ కు పరిచయమై డేరాల, నాయకత్వం సమాచారం ఇస్తే ఎలాంటి హాని కలగకుండా చూసుకుంటానని చెప్పాడని తెలిపారు. అర్జున్ ప్రజల, పార్టీ విశ్వాసాన్ని కోల్పోయి కోవర్టు చేయడానికి ఒప్పుకొని పోలీసులకు పార్టీ సమాచారం అందజేస్తూవచ్చాడన్నారు.

ఓస్డి భరత్, పోలీస్అధికారులు దుష్ట పథకానికి రూపకల్పన చేశారన్నారు. భారతదేశంలో నూతన ప్రజాస్వామిక విప్లవ విజయానికై పోరాడుతున్న భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు)ని నిర్మూలించే లక్ష్యంతో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు వ్యూహాత్మక సూరజ్ కుండ్ బహుముఖ దాడిలో భాగంగా ఆపరేషన్ కగార్ దాడిని ప్రజలపై, పార్టీపై ఆఖరి యుద్ధాన్నిప్రకటించిందని దేశంలోని ఆకలి చావులను, నిరుద్యోగాన్ని నిర్మూలించలేని దోపిడీ పాలకవర్గాలు ప్రజా పోరాటాల నిర్మూలించడానికి ఎంతో శ్రద్ధ వహిస్తున్నాయని, అమాయక ఆదివాసీ ప్రజలను, కార్యకర్తల భయబ్రాంతులకు గురి చేసి, డబ్బు ఆశ చూపించి ఇన్ ఫార్మర్ గా, కోవర్టులుగా తయారు చేసి నిజాయితీ లేని మనిషిగా భవిష్యత్తు తెలియని అంధకారంలోకి నెట్టివేస్తున్నా రని ద్వజమెత్తారు. మోసకారి యుద్ధము ప్రజలకు కొత్తమీ కాదన్నారు.

మోసపూరిత ఎత్తుగడలతో విప్లవోద్యమాన్ని నిర్మూలించలేరని, ప్రపంచ చరిత్రలో ఏ యుద్ధ చరిత్రను చదివిన అంతిమంగా ప్రజలదే విజయమనేది జగమెరిగిన సత్యమేనని, భారత అర్ధ వలస, అర్ధ భూస్వామ్య వ్యవస్థ కూలిపోకతప్పదని, నూతన ప్రజాస్వామిక విప్లవం రాక తప్పదు. దోపిడీ పాలక వర్గాల మోచేతి నీళ్ళు తాగే వాళ్ళ మాట నమ్మొద్దనీ, ఇన్ ఫార్మర్స్, కోవర్టుగా తయారు కావద్దన్నారు. రాజ్ కుమార్, అర్జున్ లను క్యాడర్ ముందు, ప్రజల ముందు తప్పులను ఒప్పించి ఆ తరువాత ప్రజల అభిప్రాయాల మేరకు విడిచి పెట్టామని మావోయిస్టు భద్రాద్రి కొత్తగూడెం - డివిజన్ కమిటీ కార్యదర్శి ఆజాద్ విలేఖరులకు పంపిన ఆప్రకటనలో వెల్లడించారు.